Responsive Advertisement

సింహము-కుందేలు కథసింహము-కుందేలు కథ
ఒక అడవిలో మదోత్కటమనే బలమైన సింహం నివశిస్తుంది. అది చాలా పొగరుబోతు, ఎంతో పౌరషం కలది. తన పంతం నెగ్గాలనే పట్టుదలగల క్రూర జంతువు. అడవిలో అది ఆడింది ఆట, పాడింది పాట. దాన్ని ఎదురించే బలం మృగానికి లేదు. కాబట్టి అది తనకంటే బలంగలవారు లేరని గర్వంతో ప్రతి జంతువునూ భయపెడుతూ, తన కంటికి కనిపించిన జంతువునల్లా చంపటం మొదలుపెట్టింది. సింహం కనపడిందంటే చాలు అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయేవి. ఒకనాడవన్నీ కలిసి ఒక తీర్మానం చేశాయి. రోజుకొకరు చొప్పున వంతు వేసుకొని సింహానికి ఆహారంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. మృగరాజుగారు దయతో తమ ప్రార్థన అంగీకరించి,
తమ ఇష్టం వచ్చినట్లు జంతువులన్నింటినీ చంపివేయకూడదని తీర్మానం. అవన్నీ కూడపలుక్కుని కలిసి కట్టుగా వెళ్ళి సంగతిని సింహానికి తెలియజేశాయి. ;రోజూ ఇలా అవసరమున్నా లేకున్నా కనపడ్డ జంతువులన్నింటినీ చంపితే అడవిలో జంతువులన్నీ కొద్ది రోజుల్లోనే నశిస్తాయి. తరువాత ఆకలితో నేనూ అవస్థ పడవలసి వస్తుంది; అని మనసులోనే అనుకొని అందుకు అంగీకరించింది. వేటాడకుండానే తన వద్దకు ఆహారం వస్తుందని, మృగాల మొర ఆలకించి సరే అన్నది. ప్రతిరోజూ మధ్యాహ్నం అయ్యేసరికి మీలో ఒకరు నాకు ఆహారంగా నా ముందు నిలబడాలి, ఆలస్యం చేసినా, మతిమరుపు చూపించినా మీ అంతు చూస్తాను. మాటంటే మాటే గుర్తుంచుకోండి అని గద్దించింది.
రోజు నుండి మృగాలు మాట ప్రకారం వంతుల వారీగా రోజుకొకరు చొప్పున సింహానికి సకాలంలో ఆహారంగా వెళుతున్నాయి. సింహం వేట మానేసింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు ఒక కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైనది. చక్కగా ఆలోచించగలదు. ఆనాడు ఎలాగైనా ఆపద నుండి బయట పడాలని మంచి ఉపాయం ఆలోచించింది. అన్ని జంతువుల మాదిరగా కాకుండా కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు వచ్చింది. అప్పటికే వేళ దాటిపోతున్నప్పటికీ ఆహారంగా జంతువూ రాకపోయేసరికి సింహం మండిపడుతూ ఉంది. దానికి తోడు ఆకలి బాధ ఎక్కువైంది. సింహం కోపంతో గర్జిస్తుండగా కుందేలు మెల్లమెల్లగా దాని వద్దకు చేరింది. సింహం దానిని చూచి ;ఓరీ! నీవా! నీకెంత పోగరురా! ఎందుకింత ఆలస్యం చేశావ్?; అని పెద్దగా గద్దించింది.
కుందేలు గజగజా వణుకుతూ ;మహారాజా! నేను మామూలు సమయానికే బయలుదేరి గబగబా పరిగెత్తి వస్తున్నాను. కాని దారిలో ఇంకొక సింహం కనిపించింది. తానే అడవి అంతటికీ రాజునని, తన మాటకి ఎదురు చెప్పేవాళ్ళు లేరని, నన్ను తనకి ఆహారం అవమని అడుగు ముందుకు వేయనీయక అడ్డం తగిలి నన్ను ఆపేసింది. నేను అతి కష్టం మీద దానిని ఒప్పించి ;మా రాజును నీ వద్దకు తీసుకొని వస్తా;నని ప్రమాణం చేసి తమ వద్దకు పరుగెత్తుకు వచ్చాను. పొగరుతో కన్నూ, మిన్నూ కానరాక తమను నిందించిన సింహానికి తగిన బుద్ధి చెప్పండి. పాపం తమరు ఎంతో
ఆకలిగా ఉన్నారు, ముందు నన్ను ఆరగించండి; అన్నది కుందేలు. సింహం గట్టిగా గర్జించి కనులెగరేసి ; పొగరుబోతు ఎక్కడుందో చూపించు ముందు, నిన్ను నిందిస్తూ నిన్నడ్డగించిన పిరికిపందకు తగిన శాస్తి చేస్తేనే గాని నేను ఆహారం ముట్టను. నిన్ను భక్షిస్తే వాణ్ణి నాకెవరు చూపిస్తారు? పద ముందు వాని దగ్గరకు వెళ్దాం; అని అన్నది. సింహాన్ని కుందేలు ఒక పాడుపడిన బావి దగ్గరకి తీసుకొని వెళ్ళింది. ;మహారాజా! నన్నడ్డగించి మిమ్ము నానా
మాటలు అన్న సింహం నూతిలోనే దాగి ఉంది వెళ్ళి చంపండి; అన్నది. కుందేలు మాటలు విన్న సింహం కోపంతో మరొకమారు గర్జించింది. నూతిగట్టు మీదకెక్కి అందులోకి తొంగి చూసింది. నీటిలో దాని నీడ కనపడింది. అది తన విరోధి అని భావించి, పంజా ఎత్తి గర్జిస్తూ బావిలోకి దూకింది. కుందేలు సంతోషంతో ఇంటికి పోయి తన వారందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. మృగాలన్నీ కుందేలును మెచ్చుకున్నాయి. శత్రువు మరణించినందువలన ఆనాటి
నుండి జంతువులన్నీ హాయిగా కాలం గడిపాయి. కాబట్టి బుద్ధిబలం గలవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. అలాంటి బుద్ధిబలాన్ని ఉపయోగించి సంజీవక పింగళకులకు విరోధం కలిగిస్తాను. అందుకు కాలం కూడా ఇపుడే కలిసి వచ్చింది.
రాజద్రోహం చేసినందుకు పదవులు పోగొట్టుకొని ఉన్న మన కాటక-పాటకులు సంజీవకుని ఆశ్రయిస్తున్నారు. అతనిని నమ్ముకొన్నచో రాజునకు చెప్పి ఎలాగైనా తమ పదవులను తిరిగి తమకు ఇప్పిస్తాడని వాటి నమ్మకం. అవకాశాన్నుపయోగించుకొని ఎద్దు మీద నేరాలు మోపి అతని మీద ఉన్న స్నేహ భావం తొలిగించి, రాజుగారి మనస్సుని మారుస్తాను అని దమనకుడు చెప్పగా విని కరటకుడు నీకు విజయం కలుగు గాకా! క్షేమంగా పోయి లాభంగా తిరిగి రా; అని పలికింది. దమనకుడు పింగళకుని వద్దకు పోయి నమస్కరించి ;మహారాజా! మన్నించండి. పిలవని పేరంటంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. తమరి ఉప్పు తిని నీడన పడి ఉండేవాడిని. తమ మేలు కోరి ఒక రహస్య విషయం మనవి చేయాలని వచ్చాను; అన్నాడు. వెంటనే పింగళకుడు ;దమనకా! నీ కంటే నాకు మంచి ఆప్తులెవరున్నారు? సందేహించకు, నీవు చెప్పదలచిన విషయం నాకు నిర్భయంగా చెప్పు. భయపడవలసిన పని లేదు; అని పలికింది. మహారాజా! మీరు మనసారా ప్రేమిస్తున్న సంజీవకుడు ఇపుడు మునిపటివలే లేడు. అతనికి మీ
రాజ్యం కాజేయాలనే ఆశ పుట్టింది. మిమ్ములను సంహరించి అడవికి తానే రాజు కావాలని కోరిక కలిగింది. అతడిప్పుడు రాజద్రోహులైన కాటక పాటకులతో కలిసి కుట్ర చేస్తున్నాడు, ఇది తెలిసినప్పటినుండి నా మనసు మనసులో లేదు. ఎప్పుడు వార్తను మీ చెవిన వేయాలా అని నిరీక్షిస్తున్నాను. నేడు తమతో మనవి చేసే అవకాశం దొరికింది అని అన్నది. త్రి పదవి ఇచ్చి ఎంతో గౌరవంగా చూస్తూ ప్రాణస్నేహితునిగా నమ్మానే! ఇలాంటి ద్రోహం
తలపెడతాడా? నీ మాట నిజమని నమ్మమంటావా? అన్నాడు పింగళకుడు. వెంటనే దమనకుడు ;ప్రభువులు నా వంటివారు నిజం చెప్పినా నమ్మరు, కారణం నాకు పదవి లేకపోవడమే. నీచులకు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు. పాములను తలపై పెట్టుకొని పూజించినా కాటు వేయడం మానదు కదా! సంజీవకుడు త్వరలో మీతో యుద్ధమునకు రావడానికి ఆలోచిస్తున్నాడు. మొదట అతని గుణం తెలియక నేనే మీ వద్దకు తీసుకు వచ్చి మీకు నచ్చచెప్పి మంత్రి పదవి ఇప్పించాను కదా! అట్టి వానిని నమ్మవద్దని ఎందుకు చెప్పుచున్నానో ఆలోచించండి; అని మరొకమారు
హెచ్చరించింది. ;మరైతే సంజీవకుణ్ణి వెంటనే మంత్రి పదవి నుంచి తొలిగిస్తాను. తరువాత అడవి నుండి
తరిమేద్దాం; అని మృగరాజు పలుకగా, దమనకుడు ;శాంతించండి మహారాజా! ఎంతకాలం నుండో మహారాజుగా ఉండి ఒక్కసారి ఆమాంతం శత్రువుగా మారితే అతడు వెంటనే తమకు అపకారం తల పెట్టవచ్చు;నని దమనకుడు పలికాడు. పింగళకుడు నవ్వి ;నాకే అపకారం తలపెట్టేటంతటి వాడా అతడు!; అని తేలిక భావంతో అన్నాడు.
దానికి దమనకుడు ;ప్రభువుల వారికి తెలియనిది కాదు, ఇతరుల స్వభావం తెలియక వారికి నివాసం కల్పించి పదవులీయడం మనది మొదటి తప్పు. అతని స్వభావం ఇలాంటిదని మనకు తెలిస్తే మనలో చేరనిచ్చేవారమా? స్వభావం తెలియక మిత్రుడని నమ్మి నల్లికి చోటిచ్చి చీరపోతు తన ప్రాణం పోగొట్టుకుంది. మీకా కథ చెపుతాను వినండి అని దమనకుడు కథ చెప్పటం ప్రారంభించింది.

Post a Comment

0 Comments