🚩 *ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం*
[ మనతోనే మన లానే ఉంటున్నా వారిదొక ప్రత్యేక శైలి - అదే ఎడమ చేతి వాటం. ఇది మొదటిసారి ఆగస్టు 13, 1976 న గమనించబడింది. ఈ దినోత్సవం ఎడమ చేతి వాటం ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై, ప్రధానంగా ప్రపంచంలో అధిక శాతంతో ఉన్న కుడి చేతి వాటం ప్రజల కారణంగా కృత్రిమంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలపై అవగాహన గలిగించి వాటిని అధిగమించడానికి ఎడమ చేతి వాటం ప్రజలకు అవసరమైన ప్రోత్సాహానిచ్చేందుకు ఉద్దేశించబడింది.
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అన్నాడో సినీ కవి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ‘కుడి’ పదం వాడడం సర్వసాధారణం. కుడి చేతితో చెయ్యి, కుడికాలు పెట్టు...అన్నమాటలు తరచూ వింటుంటాం. శరీర అవయవాల్లో దేని ప్రాముఖ్యం దానిదే అయినా మనిషి జీవనం సాఫీగా సాగేందుకు ఎంతో ముఖ్యమైనవి కాళ్లు, చేతులు. ప్రయాణానికి కాళ్లు, పనులు చేసేందుకు చేతులు ప్రధానం. చేతుల్లో కుడి చేతివాటం, ఎడమ చేతివాటం వారని రెండు రకాలు. చేసేపని ఒక్కటే అయినా ఒక్కొక్కరికీ ఒక్కో చేతితో చేయడం సౌలభ్యంగా ఉంటుంది. అయితే జనాభాలో 90 శాతం మంది కుడిచేతితోనే ఏదైనా పనిచేస్తారు. మిగిలిన పది శాతం ఎడమచేతివాటం. అందుకే వారు ప్రత్యేకం. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమ చేతివాటం వారని అంచనా. ఎడమ చేతివాటం అన్నది శారీరకంగా, మానసికంగా అబ్బి న అలవాటు. కొందరు పిల్లలు అన్నిపనులు ఎడమచేతితోనే చేస్తుంటారు. ఇటువంటి వారికి తల్లిదండ్రులు కుడిచేతితో తినడం, ఇతర పనులు బలవంతంగా అలవాటు చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఇవి అబ్బవు. ముఖ్యంగా పనులు చేయడం, రాయడం వంటివి మారడం చాలా అరుదు. ఇది ఒక శారీరక, మానసిక ప్రక్రియ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
చేయి మారినా రాత మారలేదంటారు. ఎడమ చేతివాటం వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీనటులు లెఫ్ట్ హ్యాండర్స్ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ చేతివాటం ఉన్న వారిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయని, ప్రత్యేక వ్యక్తులుగా వెలుగొందుతారని అంటారు.]

Hi Please, Do not Spam in Comments