Telugu Mathematical Story - Ekkala Kadha

Telugu Mathematical Story - Ekkala Kadha

ShyamPrasad +91 8099099083
1

ఎక్కాల కథ 🌸

ఎక్కాలొస్తే చిక్కులు తప్పుతాయి 🌸

అవి ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులు. ఆయన స్వయంగా కవిత్వం చెప్పేవాడు. దాంతో పాటు కవిపోషకుడు కూడ. ఆయన ఆస్థానంలో ఎంతోమంది కవులుండేవారు. వారిలో ఒక కవి రామభక్తుడు.

ఒకసారి సభలో 'రాముడు గొప్పవాడా లేక కృష్ణుడు గొప్పవాడా' అనే వాదన ప్రారంభించారు. ఆ మహారాజు కృష్ణభక్తుడు. అందువల్ల కృష్ణుడే గొప్పవాడన్నాడు. మిగిలిన కవులంతా రాజును వ్యతిరేకించడమెందుకని కృష్ణుడే గొప్పవాడని వంత పలికేరు. కాని రామభక్తుడైన ఒక కవి మాత్రం ఇద్దరిలో రాముడే గొప్పవాడన్నాడు.

రాజు అహం దెబ్బతింది. కాని ఏం చెయ్యగలడు? ఆ కవితో "ఏమయ్యా! స్వయంగా నేను నాతో పాటు ఇంతమంది సభ్యులు కృష్ణుడే గొప్పవాడని చెబుతోంటే నువ్వు రాముడంటున్నావ్. ఎంత ధైర్యం నీకు. నీ అభిప్రాయం మార్చుకో లేకపోతే సమర్థించుకో. నీకు ఒక రోజు గడువిస్తున్నాను. రేపు సభలో నీ అభిప్రాయం తెలియజెయ్యి. లేకపోతే నా సభలో నీకు చోటుండదు సరి కదా శిక్ష కూడ అనుభవించ వలసి ఉంటుంది" అని ఖచ్చితంగా చెప్పేశాడు.

పాపం ఆ కవికి ఏం చెయ్యాలో తోచలేదు. ఉన్న ఉపాధి ఊడిపోయింది. 'నిరాశ్రయా: న శోభంతే పండితా: వనితా: లతా:' అన్నారు పెద్దలు. అంటే పండితులకు, స్త్రీలకు, లతలకు ఆశ్రయం ఉంటేనే కదా రాణింపు రేణింపును. అందువల్ల భారమంతా రాముని మీదే వేశాడు. "నన్ను రక్షించే బాధ్యత నీదే కాబట్టి కాపాడమని" రాముణ్ణి పదే పదే వేడుకున్నాడు.

వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది. సహజంగా కవి కదా! దాన్ని ఒక శ్లోకరూపంగా మార్చాడు. మరునాడు ధైర్యం గా సభకు హాజరయ్యాడు. "ఏమిటి నీ సమాధానం" అన్నాడు రాజు కవి వైపు చూస్తూ.

అందుకున్నాడు కవి. "రాజా! సామాన్యులు ఎనిమిదో ఎక్కం లాంటి వారు. మహాత్ములు తొమ్మిదో ఎక్కం లాంటివారు. కృష్ణుడు ఎనిమిదో ఎక్కమైతే రాముడు తొమ్మిదో ఎక్కం. తమరొకసారి ఎనిమిదో ఎక్కాన్ని పరిశీలించండి."

8వ ఎక్కం (అష్టమ గుణకారం)

8 × 1 = 8
8 × 2 = 16 (1+6=7)
8 × 3 = 24 (2+4=6)
8 × 4 = 32 (3+2=5)
8 × 5 = 40 (4+0=4)
8 × 6 = 48 (4+8=12, 1+2=3)
8 × 7 = 56 (5+6=11, 1+1=2)
8 × 8 = 64 (6+4=10, 1+0=1)

"చూశారా మహారాజా! ఎనిమిదో ఎక్కం అంకెల మొత్తం రాను రాను దిగజారుతూ వచ్చింది. ఇక కృష్ణుడు అష్టమి నాడు పుట్టిన విషయం అందరికి తెలిసిందే. మరి తొమ్మిదో ఎక్కాన్ని పరిశీలించండి."

9వ ఎక్కం (నవమ గుణకారం)

9 × 1 = 9
9 × 2 = 18 (1+8=9)
9 × 3 = 27 (2+7=9)
9 × 4 = 36 (3+6=9)
9 × 5 = 45 (4+5=9)
9 × 6 = 54 (5+4=9)
9 × 7 = 63 (6+3=9)
9 × 8 = 72 (7+2=9)
9 × 9 = 81 (8+1=9)
9 × 10 = 90 (9+0=9)
9 × 11 = 99 (9+9=18, 1+8=9)
9 × 12 = 108 (1+0+8=9)

"ఇది రాను రాను పెరుగుతూ వస్తోంది. అంతే కాకుండా దాని లబ్ధం ఎటువంటి మార్పులు లేకుండ ఒకే విధంగా ఉంది. నవమి నాడు పుట్టిన వాళ్లు కూడ సుఖదుఃఖాల్లో ఎటువంటి ఒడుదుడుకులు లేకుండ ఒకేవిధంగా ఉంటారు. రాముడు నవమి నాడు పుట్టిన విషయం మీకు తెలియనిది కాదు మహారాజా! అందుకే రాముణ్ణి గొప్పవాడని అన్నాను తప్పంటారా!" అన్నాడు.

వాస్తవమేదైనా కవి యొక్క గణితశాస్త్ర పాండిత్యం, చమత్కారం, తెలివితేటలు రాజుకు బాగా నచ్చాయి. ఆస్థానంలో అందరికంటే ఎత్తు పీట వేసి కూర్చోపెట్టాడు.

కవి చెప్పిన శ్లోకం

అసతాం చరితం చిత్రం అష్టభిర్గుణితం యథా
సతాం హి చరితం చిత్రం నవభిర్గుణితం యథా
చూశారా! ఎక్కాలొస్తే చిక్కులెలా తప్పుతాయో.
కాబట్టి పిల్లలు ఎక్కాలు బాగా కంఠస్థం చేస్తే మంచిది.

Post a Comment

1Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!