Ganesh Chaturthi / Vinayaka Chaturthi వినాయక చవితి
(ads)
వినాయక చవితి హిందువులకు ముఖ్యమైన పండగ. వినాయకుడు విఘ్నాలకు అధిపతి అన్నారు. గనుక మనం ఏ పని తల పెట్టినా ముందు గణపతి పూజ చేయాల్సిందే. లేకపోతే అన్నీ అవరోధాలే. ప్రారంభించిన పని పూర్తికానే మోనన్న భయంతోనైనా ముందు "అవిఘ్నమస్తు" అంటూ ఆయన్ను తల్చుకోకు తప్పదు. వినాయక చవితి మరో ప్రాముఖ్యమేమిటంటే- ఆ రోజు వినాయకుడి పూజ చేసి, కథ చెప్పుకోకపోతే నీలాపనిందలు వస్తాయి సుమా అన్న హెచ్చరిక ఉంది. ఎక్కడ లేని పోని అపవాదులకు గురి కావాల్సి వస్తుందోనన్న భయంతో వినాయక చవితి యథాతథంగా జరుపుకొంటారు. మిగతా పండగలకు ఏదో ఓపికుంటే కొబ్బరికాయ కొడతాం, లేకపోతే- ఆది లేదు. కానీ ఈ పండుగను అలా నిర్లక్ష్యం చేయలేం. అందుకు కారణం, భక్తితోపాటు భయం కూడా ఉండటమే. ఆ ఒక్క రోజు వినాయకుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటే, అటు విఘ్నాలు తొలగిపోవటమే కాక, ఇటు నీలాపనిందలకూ దూరం కావచ్చునన్న అభిప్రాయంతో తప్పనిసరిగా ఈపండగ జరుపుకుంటాం. మిగిలిన పండగల్లాగా పగలు కంచం ముందు కూర్చుని పిండి వంటలతో ఎంచక్కా భోంచేసి, సాయంత్రం కొత్త బట్టలేసుకుని అలా ఒక రౌండు కొట్టిరావడం కాదు. ఈ పండగకు కొంత ప్రిపరేషన్ కూడా అవసరం. ఇంట్లో పర్మినెంటు వినాయకుడు ఉన్నా మట్టితో చేసిన ప్రతిమ తీసుకురావాలి. పూజకు పత్రి కావాలి. పేరు పేరునా పత్రి సమర్పించాలి గనక అన్ని రకాల ఆకులూ సేకరించాలి. ఇక అలంకారాలు సరేసరి. అందుచేత వినాయక చవితి వచ్చిందంటే సందడే సందడి.
గరికపోచలేచాలు!!
సుందర సుగంధ పుష్పపత్రాలెన్నో ఉండగా వినాయకుడిని దూర్వాంకురాల(గరిక)తో పూజిస్తేనే సంతుష్టుడవుతాడని అంటారు. ఇంతకీ ఆ గరికకు ఎందుకంత ప్రాధాన్యం... ఇంకా ఆ విఘ్ననాయకుడికి ఇష్టమైనవేంటి?... ఈ విషయాలన్నీ గణేశపురాణంలో ఉన్నాయి.
పూర్వం ఒకనాడు దేవతలంతా సభలో ఉండగా... అతిలోకసుందరి తిలోత్తమ నాట్యం చేస్తోందట. ఇంతలో ఆమె చీరచెంగు జారిపోయింది. సభలోనే ఉన్న యమధర్మరాజు ఆమె సౌందర్యానికి పరవశుడై కౌగలించుకోవాలని లేచాడు. మరుక్షణమే, అది సంస్కారం కాదని తెలుసుకుని తలవంచుకుని వెనక్కి వెళ్లిపోయాడు. అయితే, అప్పటికే స్ఖలితమైన అతడి వీర్యం భూమిపై పడింది. దాన్నించి అగ్నిజ్వాలవలే మండే అనలాసురుడు పుట్టాడు.
ఆ రాక్షసుడు తన వాడివేడి కోరల నోరు తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు. దాంతో ముల్లోకాలూ వణికిపోయాయి. దేవతలందరూ విష్ణుమూర్తి శరణు కోరారు. విష్ణువు గణేశుణ్ణి ప్రార్థించమన్నాడు.
'విఘ్నస్వరూపుడైన గణపతిదేవా నమోనమస్తే....' అంటూ ఆర్తితో దేవతలు స్తుతించగా గణపతి 'బాలగణ పతి'గా సాక్షాత్కరించాడు. వెంటనే... అనలాసురుడు దాడి చేయడానికి రాగా బాలగణేశుడు తన మాయాబలంతో ఆ రాక్షసుణ్ని పట్టేసి మింగేశాడు. అనలాసురుణ్ణి మింగి తాపంతో ఉన్న ఆ బాలగజాననుడి తాపోపశమనానికి ఇంద్రుడు చంద్రుని కళని ఇచ్చాడు. అందుకే అప్పటినుంచి గణేశుడికి ఫాలచంద్రుడన్న పేరు వచ్చింది. విష్ణుమూర్తి పద్మాన్ని ఇచ్చాడు. అప్పటికీ తాపం శాంతించక పోవడంతో వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడట. శంకరుడు శేషుడిని ఇవ్వగా దానితో బంధింపబడిన ఉదరము కలిగిన వాడై 'వ్యాళబద్దుడ'య్యాడు. అయినా తాపోపశమనం కలగలేదు. సరిగ్గా అదే సమయంలో 8,800 మంది మునీశ్వరులు ఒక్కొక్కరూ 21 గడ్డి పోచలను భక్తితో సమర్పించారు. అప్పుడు గణేశుడి తాపం ఉపశమించింది. అది తెలుసుకున్న దేవతలు దూర్వాంకురాలతో పూజించి గజాననుణ్ణి సంతుష్టి పరిచారు.
అప్పుడు వినాయకుడు 'నా పూజలో ముఖ్యమైనవి ఈ గడ్డిపోచలే. ఇవి లేని పూజవల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల ఒకటి లేదా 21 దూర్వాంకురాలతో పూజచేస్తే నేను సంతుష్టుణ్ణవుతాను. దీని ఫలితం నూరు యజ్ఞాలవల్లగానీ దానాదికముల వల్లగానీ ఉగ్ర తపోనిష్ఠవల్లగానీ సంపాదించే పుణ్యం కన్నా ఎన్నో రెట్లు అధికం' అని చెప్పాడు.
గణపతికి గరికతో ఉపశమనం కలిగింది అన్న విషయంలో శాస్త్రీయ దృక్కోణం కూడా దాగిఉంది. గరికపోచల పై పల్చని సిలికా అనే పదార్థం రక్షణకవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. అగ్నిసంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ని మింగేయడం వల్ల లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు హరించగలిగాయి. ఈ కారణం వల్లే శాస్త్ర రంగంలోనూ... ఉష్ణ నిరోధక పదార్థాల్ని సిలికాతో తయారుచేస్తుంటారు.
తులసి పనికిరాదు
గణపతి పూజకు తులసిని మిగతా పత్రిలో కలిపి ఉపయోగించవచ్చు. కానీ, కేవలం తులసీదళాలతో విడిగా మాత్రం పూజ చేయకూడదు. ఈ విషయం బ్రహ్మవైవర్తపురాణంలో ఉంది. ఒకప్పుడు తులసి గోలోక నివాసిని. రాధాశాపంతో శంఖ చూడుడనే రాక్షసుణ్ణి వివాహమాడింది. ఈమె పతివ్రతగా ఉండగా అతన్ని ఎవరూ చంపలేరన్న కారణంతో ఓ రోజు శంఖచూడుడి వేషంలో విష్ణుమూర్తి వచ్చి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. అప్పుడు శివుడు శంఖచూడుణ్ణి సంహరిస్తాడు. దాంతో, ఆమె ఆగ్రహంతో విష్ణువును శిలవైపొమ్మని శపిస్తుంది. అప్పుడు విష్ణువు ఆమె శరీరం గండకీనదిగా మారుతుందనీ తాను అందులో సాలగ్రామశిలలుగా ఉంటాననీ వరమిస్తాడు. అంతేకాదు, ఆమె తలవెంట్రుకలు తులసిమొక్కలై పరమపవిత్రాలుగా ప్రసిద్ధి పొందుతాయని - చెబుతాడు. ఓసారి తీర్థయాత్రలు చేస్తూ గంగాతీరంలో ఉన్న గణపతిని చూసి మోహించి, తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నిరాకరించడంతో శపిస్తుంది తులసి. 'అకారణంగా నన్ను శపించావు కాబట్టి నువ్వు నా పూజకు పనికిరావు' అని గణపతి ఆమెకు ప్రతిశాప మిచ్చాడట.
(nextPage)
మట్టి ప్రతిమే శ్రేష్ఠం
వినాయకుడి పూజకు కేవలం మట్టి విగ్రహాన్నే వాడాలి. గంగలోని మట్టితో విగ్రహం చేసి వినాయకచతుర్దినాడు పూజించి మర్నాడు మళ్లీ ఆ గంగలోనే కలపాలి. ఆ విధంగా సంవత్సరానికోసారి గంగాదేవిని గౌరవించుకుంటాననీ గణపతి దేవతలతో అన్నాడట. కనుక మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి. చవితి మర్నాడు శుక్ర లేక మంగళవారం అయితే మాత్రం రెండోరోజు కాకుండా మూడోరోజు స్వామిని నిమజ్జనం చేయాలి.
గణపతికి నువ్వులతో కూడిన లడ్డూలంటే కూడా ఎంతో ఇష్టమట. ఆంజనేయుడిలాగే, విఘ్నేశ్వరుడికి కూడా సిందూరం అంటే ఇష్టం. దాంతో పూజిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయని ప్రతీతి.
(ads)
సిద్ధి -బుద్ధి - శుద్ధి
జ్ఞానేశ్వరుడు విజ్ఞానానికి ప్రతినిధి. వివేకానికి ప్రతీక. ఏనుగు తల నుంచి ఎలుక వాహనం దాకా... అంగాంగమూ అమూల్యమైన పాఠమే.
గుమ్మడికాయంత తల...గొప్పగా ఆలోచించమని చెబుతుంది.
చాటెడు చెవులు శ్రద్ధగా వినమంటాయి. బుల్లినోరు వీలైనంత తక్కువగా మాట్లాడమంటుంది. చిన్నికళ్లు...సూటిగా లక్ష్యానికి గురిపెట్టమంటాయి. బానపొట్ట సుదీర్ఘ జీవితానుభవాల్ని తలపిస్తుంది. బతుకంటే... మంచిచెడులూ కష్టసుఖాలూ ఆనంద విషాదాలూ. అన్నింటినీ స్థితప్రజ్ఞతతో జీర్ణించుకోమని ప్రతీకాత్మకంగా బోధిస్తున్నాడు లంబోదరుడు. ఆ తొండం... ఎటైనా తిరుగుతుంది. ఎంతదూరమైనా చొచ్చుకుని వెళ్తుంది.
జ్ఞానసముపార్జనలో ఆమాత్రం తపన ఉండాల్సిందే! మనిషిలోని చంచల స్వభావమే చిట్టెలుక. అహాల్నీ అత్యాశల్నీ ఎప్పుడూ నెత్తిన ఎక్కించుకోకూడదు. నిగ్రహశక్తితో వాటిని ఓడించాలి. మెడలు వంచి సవారీ చేయాలి. గణపతి చేతిలోని మోదకం...మన కృషి ఫలితం, కలల పంట. దేవుడి ముందు ఉంచిన పంచభక్ష్య పరమాన్నాల్లోనూ మహత్తరమైన సందేశం ఉంది. జ్ఞానసిద్ధి, ఆశయశుద్ధి, వినయబుద్ధి... ఈ మూడూ సొంతం చేసుకుంటే, ప్రపంచం మన పాదాల ముందు వాలుతుంది. శరణు శరణు అంటూ గుంజీలు తీస్తుంది. గణేష్ నవరాత్రుల్లో... రోజుకో మంచి గుణాన్ని అన్వయించుకున్నా చాలు. తొమ్మిదోరోజు మనలోని చెడునంతా నిమజ్జనం చేయవచ్చు.
బోలో గణేష్ మహరాజ్ కీ.... జై!