తెలుగు భాష చరిత్ర

తెలుగు భాష చరిత్ర

ShyamPrasad +91 8099099083
0

తెలుగు భాష చరిత్ర

సంస్కృతంబులోని చక్కెర పాకంబు,
అరవ భాషలోని అమృతరాశి,
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు!!
-- మిరియాల రామకృష్ణ

సంస్కృతంలోని తియ్యదనమూ, తమిళంలోని అమృతత్వమూ, కన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష తెలుగు. భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం తెలుగుతోపాటు సంస్కృతం, తమిళం, కన్నడం భాషలకు 2008లో "ప్రాచీన భాష" హోదానిచ్చి గౌరవించింది.

Advertisement Space

ఆంధ్రప్రదేశ్ తరవాత తెలుగువాళ్లు ఎక్కువగా యానాం (పుదుచ్చేరి), తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, చత్తీస్ గడ్రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు. తెలుగు మాతృభాషగా కలిగున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తెలుగువాళ్లు ప్రపంచంలోని ఏ దేశానికెళ్లినా కనిపిస్తారనడం అతిశయోక్తి కాదు.

ముఖ్యమైన వాస్తవం: 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎనిమిదన్నర కోట్లజనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో (హిందీ, బెంగాలీల తరవాత) మూడో స్థానంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పదిహేనో స్థానంలోనూ నిలిచింది.

తెలుగు భాష చరిత్ర

తెలుగు ద్రావిడ భాష. ద్రావిడ భాషావర్గంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, గోండీ మొదలైన 85 భాషలుండగా, అత్యధికంగా మాట్లాడుతున్న ద్రావిడభాష తెలుగే.

తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందనీ, తెలుగుకు మాతృక సంస్కృతమేననీ జనబాహుళ్యంలో బలమైన అపోహ ఉన్నది. కానీ సంస్కృతం, హిందీ, బెంగాలీ మొదలైన ఉత్తర భారతదేశ భాషలు "ఇండో-ఆర్యన్" భాషావర్గానికి చెందినవి కాగా, దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలనీ భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం.

Advertisement Space

తెలుగుతో పాటు ప్రస్తుతం ఉనికిలో ఉన్న ద్రావిడభాషలన్నీ ఒకే మూలద్రావిడ మాతృక నుంచి క్రమంగా విడివడి, వేరువేరుగా స్థిరపడ్డాయని పరిశోధకుల అంచనా.

తెలుగు పేరు మూలం: ప్రసిద్ధ శైవక్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని "త్రిలింగ" ప్రాంతమని పిలిచేవారనీ, త్రిలింగ పదం నుంచే తెలింగ, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన ఉన్నది.

కాబట్టి తెలుగువారు కృష్ణా, గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతంలో నివసించేవారని చెప్పవచ్చు. తమిళం, గోండీ భాషల్లో తెలు, తెలిఅంటే తెలుపు లేదా చక్కదనం, "గ" అనేది బహువచన సూచకం. ఆవిధంగా చక్కనివారు, తెల్లనివారు అనే అర్ధంలో తెలింగ, తెలుంగ అనే పదాలు ఉద్భవించాయని మరో వాదన.

తమిళనాడులోనూ, కేరళంలోనూ ఇప్పటికీ తెలుగును "తెలుంగు" అనే పిలవడం మనం గమనించవచ్చు. భాషాశాస్త్రవేత్తల అంచనా మేరకు తెలుగు భాష కనీసం 2,400 సంవత్సరాల పూర్వం మూలద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేకభాషగా స్థిరపడింది.

Advertisement Space

క్రీ.పూ. మొదటిశకంలో శాతవాహన రాజుల పాలనలో రచించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్యసంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు పదాలు లిఖితరూపంలో దొరికిన ఆనవాళ్లలో ఇదే ప్రాచీనమైనది.

తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి శిలాశాసనం క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందినది. తెలుగు భాష చరిత్ర క్రీ.శ. పదకొండో శతాబ్దం నుండి గ్రంధస్థం చెయ్యబడింది.

తెలుగు లిపి

తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించింది. అశోకుని మౌర్య సామ్రాజ్యానికి సామంతరాజులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చారు.

దక్షిణ భారత భాషలన్నీ మూలద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రం బ్రాహ్మీ నుంచే పుట్టాయి. మౌర్యుల బ్రాహ్మీలిపిని పోలిన అక్షరాలు గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధస్తూపంలోని శాసనాల్లో లభించాయి.

Advertisement Space

ఈ భట్టిప్రోలు లిపి నుంచే దక్షిణ భారతదేశ లిపులన్నీ పరిణామం చెందాయి. చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు తెలుగు, కన్నడ దేశాలను కలిపి పాలించడం వల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామం చెందింది.

క్రీ.శ. ఐదో శతాబ్దం నాటికి ఈ భట్టిప్రోలు లిపి నుంచి పాత తెలుగు లిపి ఆవిర్భవించిందని పరిశోధకుల అంచనా.

ముఖ్యమైన వాస్తవం: ప్రాచీన తెలుగు లిపిలో ఖ, ఘ, ఛ, ఝ, థ, ఠ మొదలైన మహాప్రాణ అక్షరాలు లేవనీ, ఈ శబ్దాలు ఇండో-ఆర్యన్ భాషల ప్రజలు మాత్రం విరివిగా వాడేవారనీ, ద్రావిడ భాషల ప్రజలు ఈ శబ్దాలను సాధారణ వ్యవహారిక భాషలో అసలు వాడేవారు కాదనీ శాస్త్రవేత్తల అభిప్రాయం.

ఇప్పటికీ మన పల్లెల్లో ఈ మహాప్రాణ అక్షరాలను చాలామంది రోజువారీ పలుకుబడి భాషలో వాడకపోవడం మనం గమనించవచ్చు. నన్నయ కాలంలో సంస్కృత సాహిత్యం విరివిగా తెలుగులోకి అనువాదం అయినప్పుడు, ఈ సంస్కృత మహాప్రాణ శబ్దాలను తెలుగులో రాయడం కోసం ప్రత్యేకంగా తెలుగు లిపిలో అక్షరాలను రూపొందించారు.

తెలుగు అక్షరాలు (37)

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ, సున్నా

క గ చ జ ట డ ణ త ద న ప ఫ బ మ య ర ల వ శ ష స హ ళ ఱ

సంస్కృత శబ్దాలను తెలుగులో రాయడం కోసం రూపొందించిన అక్షరాలు (19)

ఌ ఌ ఋ ౠ అః (విసర్గ)

ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ థ ధ భ క్ష రుత్వం, రుత్వం దీర్ఘం

Advertisement Space

తెలుగులోని మాండలికాలు

మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. మాండలిక భాషలన్నీ ప్రధానభాషలోని వివిధ వ్యవహారికాలు మాత్రమే, అన్ని మాండలికాలూ కలిపితేనే ప్రధాన భాష అవుతుంది.

ప్రతి భాషకీ మాండలిక భేదాలున్నట్టుగానే, తెలుగుకీ ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులను బట్టీ, పాలకుల భాషను బట్టీ, కులమతాలను బట్టీ, వృత్తిని బట్టీ మాండలికాలు ఏర్పడతాయి.

ఉదాహరణ: తెలంగాణ తెలుగుపై మొదట తమిళ, కన్నడ భాషల ప్రభావమూ, ఆ తరవాత ఉర్దూ ప్రభావమూ పడటం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది.

భౌగోళిక, చారిత్రక కారణాల రీత్యా రాయలసీమ తెలుగుపై తమిళ, కన్నడ భాషల ప్రభావం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అదో భిన్నమైన ప్రత్యేకతను సంతరించుకున్నది. కోస్తాంధ్ర తెలుగుపై సంస్కృతం, ఇంగ్లీషు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అదో ప్రత్యేకతను సంతరించుకున్నది.

జిల్లాలను బట్టి కూడా వేరువేరు మాండలికాలు ఉన్నప్పటికీ తెలుగులో ప్రధానమైన మాండలిక భాషలు నాలుగున్నాయి.

తెలుగు మాండలిక భాషలు

  1. రాయలసీమ భాష: చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల భాష
  2. తెలంగాణ భాష: తెలంగాణ పది జిల్లాల ప్రాంతపు భాష
  3. తీరాంధ్ర/కోస్తాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల భాష
  4. కళింగాంధ్ర/ఉత్తరాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాష
Advertisement Space

తెలుగు సాహిత్యం

నన్నయ పదకొండో శతాబ్దంలో రచించిన మహాభారతం తెలుగులో ఆదికావ్యమనీ, నన్నయ ఆదికవి అనీ చెప్పబడుతున్నది. అంతకు ముందు సాహిత్యం అసలే లేకుండా, ఉన్నట్టుండి ఇంత అద్భుతమైన, పరిపక్వమైన కావ్యం రచించడం అసాధ్యం కాబట్టి, నన్నయకు ముందే మరింత తెలుగు సాహిత్యం ఉండవచ్చని సాహిత్యకారుల అభిప్రాయం.

పదహారో శతాబ్దంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెలుగు వైభవంగా వెలిగింది. ఎంతో సాహిత్యం సంస్కృతం నుంచి తెలుగు, కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యింది.

ముఖ్యమైన వాస్తవం: ఈ కాలంలో వివిధ సాహితీప్రక్రియల్లో వెల్లువలా సృష్టించబడ్డ ఎంతో సాహిత్యం సాహిత్యాభిమానుల, విద్యావంతుల అభిమానాన్ని చూరగొనగలిగినప్పటికీ, సంస్కృతభాష ప్రభావం కారణంగా చాలామటుకు గ్రాంథిక భాషలో ఉండడం వల్ల ప్రజాబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారం పొందలేకపోయాయి.

పల్లె ప్రజలకు, నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థం అయ్యే విధంగా వాడుకభాషలో సరళమైన రీతిలో వెలువడ్డ వేమన పద్యాలు, బ్రహ్మంగారి సాహిత్యమూ, అన్నమయ్య, కంచెర్ల గోపన్న రాసిన కీర్తనలు ఇప్పటికీ ప్రజల ఆదరణ చూరగొంటున్నాయి.

Advertisement Space

తెనాలి రామలింగడు కథ

శ్రీకృష్ణదేవరాయలు ప్రతి సంవత్సరం తన రాజసభలో "అత్యంత మూర్ఖుడు" అనే బిరుదు పోటీ నిర్వహించేవారు. ఈ బిరుదుని గెలుచుకున్న వారికి బిరుదుని చ్చి 5000 వరాహాలు బహుమానంగా అందజేసేవారు.

ప్రతి సంవత్సరం తెనాలి రామలింగడే విజేతగా నిలిచి 5000 వరాహాలు ఎగరేసుకు పోయేవాడు. ఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్ధానకవులు, అధికారులు అతని వద్ద పని చేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు. ఆ కుర్రాడు అలాగే చేశాడు.

పోటీ అయిపోయిన తర్వాత రామలింగడు సభకు చేరుకున్నాడు. "ఇదేమిటి రామలింగా! నీవు పోటీ ముగిసిన తర్వాత విచ్చేశావు" అని అడిగాడు కృష్ణదేవరాయలు.

"ప్రభూ! నాకు వంద వరహాలు అవసరమయ్యాయి. వాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టింది" అని జవాబిచ్చాడు రామలింగడు.

"నువ్వు ఈ పోటీలో పాల్గొని ఉంటే 5000 వరహాలు సంపాదించేవాడివి కదా! వంద వరహాలు కోసం 5000 వరహాలు కాదనుకున్నావు" అన్నాడు మహారాజు.

"ప్రభూ! నేనొక పెద్ద మూర్ఖుడిని" అన్నాడు రామలింగడు.

బదులుగా మహారాజు "నువ్వు అత్యంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు చూడనే లేదు" అన్నాడు.

"అంటే ఈ పోటీలో విజేతను నేనే అన్నమాట!" అని ఎగిరి గంతేశాడు రామలింగడు.

అప్పటికి గాని రాజుగారికి తను నోరుజారానని అర్ధం కాలేదు. కాని రామలింగడి వంటి చతురుడికి ఈ బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి 5000 వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడు. మరోసారి రామలింగడే అందరికన్నా తెలివైన మూర్ఖుడని రాయలవారి ఆస్ధానంలో నిరూపితమైంది.

Advertisement Space

లేబుల్స్ / ట్యాగ్స్

తెలుగు భాష Telugu Language తెలుగు చరిత్ర Telugu History తెలుగు లిపి Telugu Script తెలుగు సాహిత్యం Telugu Literature మాండలికాలు Telugu Dialects ద్రావిడ భాషలు Dravidian Languages నన్నయ Nannaya తెనాలి రామలింగడు Tenali Ramakrishna కృష్ణదేవరాయలు Krishnadevaraya విజయనగర సామ్రాజ్యం Vijayanagara Empire భట్టిప్రోలు లిపి Bhattiprolu Script తెలంగాణ Telangana ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh రాయలసీమ Rayalaseema కోస్తాంధ్ర Coastal Andhra
Advertisement Space

🔔 మరిన్ని తెలుగు సాహిత్య కథనాలు చదవడానికి మా వెబ్‌సైట్‌ను ఫాలో చేయండి!

📚 తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర గురించి మరిన్ని ఆసక్తికరమైన వ్యాసాలు

Post a Comment

0Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!