ప సి మొ గ్గ లు

ప సి మొ గ్గ లు

SHYAMPRASAD +91 8099099083
0

ప సి మొ గ్గ లు


ఐదవ తరగతి చదువుతున్నతరుణ్ స్కూల్ నుండి వస్తూనే

అమ్మా అమ్మా నాకు తరగతిలో మొదటి ర్యాంక్ వచ్చింది చూడు

అంటూ తన రిపోర్ట్ కార్డ్ ని తల్లికి చూపిస్తూ ఎంతో సంబరపడిపోయాడు..

తల్లి జానకి రిపోర్ట్ కార్డ్ చూస్తూ తరుణ్ ని దగ్గరకు తీసుకుని *మా తరుణ్ కి కాకపోతే ఇంకెవరికి వస్తుంది అంటూ ముద్దులాడింది...

శ్రీరామ్ జానకి ల ఏకైక సంతానం తరుణ్ .. వీళ్లది స్వగ్రామం రాజాం శ్రీకాకుళం జిల్లా. శ్రీరామ్ ది కిరాణా వ్యాపారం ఉన్నంతలోనే సంతోషముగా సాగిపోయింది వాళ్ళ జీవితం నాలుగో తరగతి వరకు తరుణ్ చదువు రాజాం లోనే కొనసాగింది మొదటి నుండి తరగతిలో ప్రధమ స్థానం లోనే ఉండేవాడు.

అయితే శ్రీరామ్ కి తన స్నేహితుడు ఇలా సలహా ఇచ్చాడు ఒక రోజు *తరుణ్ ఇంత బాగా చదువుతున్నాడు కదా!మరి వాడిని ఇక్కడే చదివిస్తావా?
వైజాగ్ లో మంచి స్కూల్ లో జాయిన్ చేసి వాడిని హాస్టల్ లో పెట్టు.

ఇక్కడే ఉంటే వాడు నీలాగే పోట్లాలు కట్టుకుని బ్రతుకుతాడు’’ అని అన్నాడు..

శ్రీరామ్ పై తన స్నేహితుని మాటలు బాగా ప్రభావం చూపాయి..జానకి తో మాట్లాడాడు..జానకి తరుణ్ ని హాస్టల్ లో వేయడానికి ఒప్పుకోలేదు..ఇద్దరు చాలా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు..

శ్రీరామ్ ది వ్యాపారము కనుక దానిని మార్చలేడు.

ఒక్కగానొక్క కొడుకుని హాస్టల్ లో వేయలేడు..అందుకే జానకి తరుణ్ వైజాగ్ లో ఉండడానికి..వారాంతము లో శ్రీరామ్ వైజాగ్ వచ్చి వీళ్లతో గడపడానికి ఇద్దరూ నిర్ణయించుకుని ఇలా వైజాగ్ వచ్చి చదువుకుంటున్నాడు.

బాగా చదువుతున్న తరుణ్ మీద స్కూల్ లో టీచర్లు అందరూ ప్రత్యేక మైన శ్రద్ద పెట్టేవాళ్లు

అదే సమయములో బాగా చదివి ఈ స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని తరుణ్ పై వత్తిడి తీసుకొచ్చేవాళ్లు.

జానకికి కూడా ఫోన్ చేసి బాబుకి నిద్ర లేపండి..దగ్గర ఉండి చదివించండి అని సూచనలు ఇస్తూ ఉండేవారు..

ఇలా ఉంటుండగానే ఏడాది గడిచిపోయింది.

తరుణ్ ఆరవతరగతికి చేరుకున్నాడు.

స్కూల్లో చదువు ,ఒత్తిడి, పోటీతత్వము అన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి తరుణ్ కి.

ఒక ప్రక్క తల్లి ‘’బాగా చదవాలి తరుణ్.

మన ఊరు వదిలి మనము మీనాన్నకి కూడా దూరముగా నీ చదువు కోసమే వచ్చాము నువ్వు బాగా చదవాలి’’ అని..

మరో ప్రక్క ఫోన్ లో నాన్న ‘’ఒరేయ్ తరుణ్ నిన్ను వైజాగ్ పంపి మరీ చదివిస్తున్నాను నువ్వు బాగా చదవాలి.. మన ఊరి పేరు నిలబెట్టాలి.. నన్ను చూసి అందరూ గర్వపడాలి ‘’అని.. ఇంకో వైపు స్కూల్లో యాజమాన్యం నీమీద చాలా హోప్స్ పెట్టుకున్నాము మన స్కూల్ పేరు నిలబెట్టాలి’’అని.

ఈ మాటలన్నీ తరుణ్ ను చాలా ఒత్తిడికి గురిచేశాయి..రాత్రి పగలు చదువుతుండే సరికి కంటికి నిద్ర కరువైంది ఆ చిన్నారికి..

తినడానికి సమయం చాలక తిండి కూడా సరిగ్గా తినడం మానేశాడు..

స్కూల్ లో ,ఇంటిలో,ఫోన్లో నాన్న అందరూ ఒకటే మాట చదువు చదువు చదువు. తరుణ్ కి ఒక రకమైన ఏవగింపు వచ్చేసింది.. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయిపోయాడు తనకి తెలియ కుండానే.

ఒక రోజు స్కూల్ నుండి ఫోన్ వచ్చింది జానకి కి ‘’మీ అబ్బాయికి ఏమయింది?ఈ రోజు పరీక్షలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి..మీరు అసలు ఏమి చేస్తున్నారు..చదివిస్తున్నారా?

తరుణ్ మీద మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాము..ఇలా అయితే చాలా కష్టం’’ అని ఫోన్ దించేశాడు ప్రిన్సిపాల్.

అప్పటి నుండి జానకి కి తరుణ్ మీద చాలా కోపం వచ్చింది..

తను భర్త కి దూరంగా ఇలా వచ్చింది వీడికోసమేగా ఈ రోజు ఇలా చేస్తాడా అని తరుణ్ స్కూల్ నుండి రాగానే చడామడా కడిగేసింది..

కోపం లో తరుణ్ చెప్పేది కూడా వినిపించుకోకుండా ఆ చిన్నారి మనసుని తెలియకుండానే గాయపరిచింది జానకి.

చేసేది ఏమి లేక నిస్సహాయముగా లోపలికి వెళ్లిపోయాడు తరుణ్..అంతలోనే శ్రీరామ్ నుండి ఫోన్ వచ్చింది..

జరిగినదంతా భర్తకి చెప్పేసింది జానకి.

ఇదంతా చూస్తున్న తరుణ్ ఒక్కసారిగా ఏడుపు ఆపుకోలేక పోయాడు..తన గదిలోకి వెళ్లిపోయాడు..రాత్రి భోజనానికి తల్లి పిలిస్తే వచ్చాడే గాని సరిగ్గా తినలేకపోయాడు..

పొద్దున్నే లేచి స్కూల్ కి వెళ్ళాడు...అక్కడ తీవ్రమైన మానసిక సంఘర్షణ కి గురియయ్యాడు తరుణ్..

నిద్రలేక తిండిలేక పరీక్ష సరిగా రాయలేక పోయాను...కానీ నన్నేవరూ అర్ధము చేసుకోవడము లేదు..అందరూ నావలన ఇబ్బంది పడుతున్నారు..

మాపైన చాలా నమ్మకం ఉంది అందరికీ ..కానీ నేను సరిగ్గా చదవలేక పోతున్నాను సారీ మమ్మీ డాడీ అని తన డైరీ లో రాసుకున్నాడు

పుస్తకాన్ని బాగ్ లో పెట్టి బెంచ్ పైనే నిద్రపోయాడు..భోజనం సమయమైన ఇంకా తరుణ్ అక్కడే ఉండటాన్ని చూసి టీచర్ తరుణ్ నిద్ర లేపింది.

తరుణ్ లేచాడే కానీ టీచర్ పిలిస్తే బేలగా చూస్తున్నాడు..ఉలకలేదు..పలకలేదు..భయమేసి ప్రిన్సిపల్ కి పిలిచింది టీచర్..అప్పటికి తరుణ్ పరిస్థితి అలానే ఉంది..ఇంకా లాభం లేదని జానకిని పిలిపించారు..

పరుగెత్తుకుని వచ్చిన జానకి తరుణ్ ని ఆ స్థితిలో చూసేసరికి ఆమెకు ముచ్చెమటలు పోసాయి..

స్కూల్ యాజమాన్యం సహాయముతో హాస్పిటల్ కు తీసుకు వెళ్లింది..అందరు డాక్టర్లు పరీక్షించిన పిమ్మట తరుణ్ ని మానసిక వైధ్యుడు దగ్గరకి తరలించారు..

కంగారుగా భర్తకి ఫోన్ చేసింది జానకి.. భార్యకు బరోసా ఇచ్చిన శ్రీరామ్ ఆఘ మేఘాల మీద వైజాగ్ లో హాస్పిటల్ కు చేరుకుని తరుణ్ పరిస్థితి ని చూసి విలవిలలాడిపోయాడు..

తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనలేక తనలో తానే పోరాడి అలసిపోయింది ఆ చిన్న మనసు...ఎంతో వేదనకు గురియయ్యాడు తరుణ్..

అబ్బాయి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్ చెబుతుంటే శ్రీరామ్ జానకి లు తల్లడిల్లిపోయారు..

ఒక్కగానొక్క కొడుకు ..మేము ఎవరికి ఏమి అన్యాయం చేశాము మాకెందుకు ఇలా జరిగింది అని వాపోయారు..

తరుణ్ బ్యాగ్ సర్దుతున్న జానకి చేతికి డైరీ చిక్కింది.తరుణ్ రాసుకున్న ఆవేదనను చదివి శ్రీరామ్ కి చూపించింది

ఆ రోజు స్కూల్ నుండి వచ్చినపుడు నేను తిడుతుంటే బాబు ఏదో చెప్పబోయాడు ఒక్కసారి వాడు చెప్పేది విని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు..బాబు ఆరోగ్యము బాగులేకపోవడం వలనే పరీక్ష అలా రాసుంటాడని ఈ అమ్మ మనసుకి ఎందుకు తట్టలేదండీ.?.

ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెబితే విని కోపమయిన నేను.. నా బాబు చెప్పింది వినలేదే’’! అని లబో దిబో మంటూ శ్రీరామ్ ని పట్టుకుని ఏడిచింది.

భార్యా బిడ్డకి దూరముగా ఉంటూ ఎంతో త్యాగం చేసినా..నేటి తన బిడ్డ పరిస్థితి ని చూస్తూ ఉన్న ఆ శ్రీరామ్ గుండె తరుక్కుపోతుంది..

తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని లోలోపలే ఎంతో వేధన చెందాడు..

ఓ తల్లితండ్రులారా!ఆలోచించండి.

పాఠశాల నిర్వహకులారా !జరుగుతున్న యధార్ధ సంఘటనలను గమనించండి

ఎన్నో త్యాగాలు చేసి..ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్న తల్లితండులు..మీ పిల్లలపై ఉన్న ఒత్తిడిని తెలుసుకోండి..

ఉన్న ఊరిలోనే చదివే చదువులు చదువులు కావా?

ఇదివరకు మనము అలా చదువుకోలేదా?

చిన్న చదువులకే పెద్ద ఊర్లకు పంపవలసిన అవసరము ఏముంది?

ప్రతిభ కల విధ్యార్ధి కి ఉత్తమ విధ్యను అందించడానికి ప్రతీ చిన్న ఊర్లలోను మంచి స్కూల్ లు ఉన్నవి.

వాటి కోసం మనము ఎక్కడికో వెల్లనవసరము లేదు.మీ కుటుంబాలకు దూరముగా ఉంటూ పిల్లలకి దూరం చేయకండి.

ఓ పాఠశాల యజమానులారా!

దయచేసి పిల్లలపై ఒత్తిడి తీసుకురాకండి.

పోటీ తత్వము మంచిదే కానీ అది ఆరోగ్యకరముగా ఉండాలి..

పిల్లలకి చదువుతోపాటు ఆట పాట నేర్పించండి.వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడండి.

నేటి బాలలే రేపటి పౌరులు కదా!

ఆ మహత్తరమైన కార్యానికి సూత్రదారులు మీరే అని మరువకండి.

దయచేసి అందరూ మేలుకోండి..పసిమొగ్గలను సహజ సిద్దముగా వికసించనివ్వండి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!