ఎర్రచందనం, గంధం ఒకటేనా? వాటి ఉపయోగాలేమిటి?

*ప్రశ్న:* ఎర్రచందనం, గంధం ఒకటేనా? వాటి ఉపయోగాలేమిటి?

*జవాబు:* ఎర్రచందనం, గంధపు వృక్షం రెండూ సుగంధ ద్రవ్య వృక్షాలే అయినా వృక్ష శాస్త్ర పరంగా రెండూ ఒకే జాతికి చెందినవి కావు. ఎర్ర చందనానికి వాసన కన్నా రంగు ఎక్కువ. దీనిని వృక్ష శాస్త్రంలో *"టెరో కార్పస్‌ శాంటాలినస్‌"* అంటారు. ఎర్రచందనపు వృక్షం మధ్య భాగం ఖరీదు ఘనపుటడుగు దాదాపు రూ.లక్ష వరకు ఉంటుంది. చాలా దృఢంగా, ముదురు ఎరుపు రంగులో ఉండడం వల్ల ఈ కలపను ఖరీదైన నిర్మాణాల్లోనూ, చైనా వాళ్లు తినడానికి వాడే పుల్లల తయారీలోనూ, ఎర్రని పౌడర్‌ తయారీలోనూ ఎర్రచందనాన్ని వాడుతున్నారు. ఒక్కో చెట్టు విలువ సుమారు కోట్లలో ఉండడం వల్ల ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు గురవుతున్నట్టు తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. గంధపు చెట్టును శాస్త్రీయంగా *"శాంటాలమ్‌ పెనిక్యూలాటం"* అంటారు. ఇవి ఎర్ర చందనం లాగా దృఢంగా ఉండవు. గరుగ్గా ఉన్న బండమీద నీరు పోసి రాస్తే పసుపు రంగులో ఉన్న గంధపు లేపనం లభిస్తుంది. ఈ చెట్టు నుంచి తీసిన నూనెను ప్రధానంగా సుగంధ ద్రవ్యాలలోనూ సబ్బుల తయారీలోనూ వాడతారు. గంధపు చెట్టు కలపను నిర్మాణాల్లో వాడరు.

Post a Comment

0 Comments