కరోనా కతలు

కరోనా కతలు

SHYAMPRASAD +91 8099099083
0
కరోనా కతలు  -     (  బయట తిరుగుళ్ళు  )

ఇండియాలో మనకొక మంచి అలవాటుంది. ఆఫ్ కోర్స్ చాలా మంచి అలవాట్లు మనకెన్నో ఉన్నాయి. కానీ వాటిల్లోకెల్లా ఇది చాలా మామంచి అలవాటు. అదేంటో చెప్పనా? - బయట తిరుగుడు.

ఈ మాట వినగానే మళ్ళీ నేనేదో రసవత్తరమైన కధ రాస్తున్నాననుకుని "ఇదేదో భలే బాగుంది. మంచి టాపిక్ ఇన్నాళ్ళకు రాస్తున్నారు సారు' అని సీట్లో ముందుకు జరగకండి. అదికాదు. పనీపాటా లేకుండా ఊరకే రోడ్లమీద తిరగడాన్నే నేను 'బయట తిరుగుడు' అంటున్నాను. ఇది ఈ విధంగా మన రక్తంలో ఇంకిపోయి ఉంది మరి !

పనున్నా లేకపోయినా ఊరకే తయారై కాసేపు రోడ్లమీద తిరిగి వస్తే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం మనకు కలుగుతుంది. ఇదేం దరిద్రమో తెలీదు గాని, చాలామందిలో ఈ రోగం ఉంటుంది. ఇంట్లో ఉండలేరు. పొద్దున్న లేవగానే ముందు రోడ్డెక్కాలి. అలా ఎక్కకపోతే, ఇంట్లో ఆడాళ్ళే విసుక్కుంటారు. 'ఎంతసేపూ నా మొహం చూస్తూ కూచోకపోతే అలా కాసేపు బయటకెళ్ళి ఏడవచ్చుగా' అంటూ. ఈ రోగం ఒక్క మగాళ్ళకే కాదు, అదేంటో ఆడవాళ్ళు కూడా అంతే, 'అబ్బ. బయటకెళ్ళి నెలైంది. కాస్త అలా బయటకెళ్ళి ఒక తిరుగుడు తిరిగి రావాలి. అప్పుడుగాని కాస్త రిలీఫ్ గా ఉండదు' అనే ఆడవాళ్ళను నేను చాలామందిని చూచాను. మళ్ళీ నన్ను వేరే విధంగా అర్ధం చేసుకోకండి. నేను మంచి ఉద్దేశ్యంతోనే చెబుతున్నాను.

మామూలు రోజుల్లో అలా తిరిగితే పోనీలే ఇదొక రోగంలె అనుకోవచ్చు. కానీ ప్రాణంమీదకు వస్తున్న ఈ రోజుల్లో కూడా, కదిల్తే కరోనా కాటేస్తున్న ఈ రోజుల్లో కూడా, పోలీసులు కర్రలిరిగేలా వీపు పగిలేలా బాత్తున్న ఈ రోజుల్లో కూడా, ఏదో ఒక రకంగా, ఎప్పుడో కాసేపు, పోలీసుల కళ్ళు గప్పి, రోడ్లమీద అటూఇటూ తిరిగి వస్తేగాని తోచని క్షుద్రజీవులు కోట్లలో ఉన్నారు మన దేశంలో. అదేం శునకానందమో మరి?

చాలామంది ఆడాళ్ళలోనూ, మగాళ్ళలోనూ నేనీ పోకడను గమనించాను. పౌర్ణమి అమావాస్యలు వస్తున్నాయంటే చాలు, కాలు గాలిన పిల్లులై పోతారు. ఏదో ఒక కుంటిసాకుతో రోడ్దేక్కాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. తిట్లో దెబ్బలో తినాల్సిందే. చేతులు కాల్చుకోవాల్సిందే. తర్వాత తీరిగ్గా ఏడవాల్సిందే.

ఈ మధ్యన ఇంకో విచిత్రమైన మాట వింటున్నా.

ఇంతకు ముందైతే 'వాడు మగాడ్రా బుజ్జీ. తిరగాలి. తిరక్కపోతే మగాడు చెడిపోతాడు' అనేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. 'అది ఆడదిరా. ఎన్నాళ్ళు ఇంట్లో కూచుంటుంది? తిరగాలి, లేకపోతే చెడిపోతుంది' అంటున్నారు. అసలు బయట తిరగడానికీ ఈ చెడిపోడానికీ ఏమిటో సంబంధం? నా చిన్నప్పటినించీ ఆలోచిస్తున్నా. ఇప్పటికీ అర్ధం కావడంలేదు నా మట్టిబుర్రకి. ఏం ఇంట్లో ఉండేవాళ్ళు చెడిపోరా? చెడిపోకూడదా? ఏంటీ గోలసలు?

ఎవరి ఇళ్ళలో వాళ్ళుండండి. బయటకు రావద్దురా బాబూ అని ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రీ దండాలు పెట్టి మరీ మొక్కుతున్నారు ప్రజలకి. వీళ్లేమో రోడ్లెక్కి పోలీసులతో గొడవ పడుతున్నారు. చావు తన్నులు తింటున్నారుగాని ఇంట్లోకి పొండిరా అంటే పోవడంలేదు. వీధి వాకిట్లోంచి ఇంట్లోకి పంపిస్తే దొడ్డి వాకిట్లోంచి బజార్లోకి తుర్రుమంటున్నారు.

అసలు, మన ఇండియా వాళ్ళకి వేరే శిక్ష ఏమీ అక్కర్లేదని నా ఉద్దేశ్యం. 'బయటకు రాకుండా ఇంట్లో ఉండండిరా' అంటే చాలు, ఒక వారానికి గుండాగి చస్తారు. వేరే మరణశిక్షా ఉరిశిక్షా ఏవీ అక్కర్లేదు వీళ్ళకి.

పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ముందు రోడ్డెక్కి కాసేపు అటూ ఇటూ తిరిగి, ఏదో ఒక చెత్త ఏదో ఒక బజ్జీలబండి దగ్గర తిని, ఏదో ఒక మాల్ లో పనికిరానివన్నీ కొని, ఆ చెత్త పట్టుకుని ఇంటికి చేరితే IAS పరీక్షలో సెలక్ట్ అయినంత ఆనందం మనకి. ఇదేం ఖర్మో మరి?

ఇలాంటి ఇంపల్సివ్ రోమింగ్, ఇంపల్సివ్ బయ్యింగ్ ఉన్న చాలామంది ఆడాళ్ళను నేను ఎరుగుదును. మళ్ళీ మరోలా అర్ధం చేసుకోకండి. నేను ఇప్పుడు కూడా మంచి ఉద్దేశం తోనే చెబుతున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు కాళ్ళు కట్టేసిన కుందేళ్ళై పోయారు. బయటకెళ్ళి ఏదో ఒకటి కొనకపోతే వాళ్లకు మహాచావుగా ఉంటుంది.

కరోనా ఏమోగాని, ముందు రోడ్లమీద తిరగనివ్వక పోవడం మనవాళ్ళ చావుకొస్తున్నది. కొన్నాళ్ళు గనక ఇలాగే సాగితే, ముందు మమ్మల్ని ఇంట్లోనించి రోడ్డెక్కనివ్వండి. కరోనా వచ్చి చచ్చినా పరవాలేదు. మేము రోడ్డెక్కాల్సిందే అని అందరూ పోలో మంటూ బయటకు వస్తారేమో చీమల పుట్టలలోంచి చీమల్లాగా !

'మనిషి రోడ్డున పడ్డాడు' అనేది ఒకనాటి సినిమా. 'మనిషి రోడ్డున పడలేక ఇంట్లోనే మురిగి చస్తున్నాడు' అనేది నేటి సినిమా.

ఇంకెన్ని సినిమాలు చూడాలో? చూద్దాం !

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!