Responsive Advertisement

అబద్ధాలాడుదాం రండి.

అబద్ధాలాడుదాం రండి.
---------------------------------------------

బలి చక్రవర్తిగారేమో ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశ్యపుడు.ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. విరోచనుని భార్య, దేవాంబ.విరోచనుని కొడుకు బలి. 

ప్రహ్లాదుడంటే నిత్యం సంతోషంగా వుండేవాడు లేదా చూడగానే ఆనందాన్ని ఇచ్చేవాడు. బలి అంటే త్యాగం చేసేవాడు.దేనిని త్యాగం చేస్తాడంటే అడిగినవారికి తన  లేదనకుండా దానం చేసేవాడు. బలి కొడుకు బాణుడు.బాణుని కూతురు ఉష.ఉషను ప్రేమించినవాడు శ్రీకృష్ణుని మనుమడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని తండ్రి ప్రద్యుమ్యుడు.

అబద్ధాలు చెప్పుకొందామని చెప్పి వంశవృక్షం చెబుతున్నాడేమిటని శంకగా వుందా!

అక్కడికే వస్తున్నా. బలిచక్రవర్తి వీరాధివీరుడు. బలగర్వం కలవాడు. ముల్లోకాలను జయించినవాడు. అలాంటి బలిచక్రవర్తికి కొంచెం తిక్కవుంది. అదేమిటంటే అడిగినవారికి లేదు అనకుండా దానం చేయడం.ఒక రకంగా శిబిచక్రవర్తిలాంటి వాడన్నమాట.

ముల్లోకాలను బలి జయించిన తరువాత ఇంద్రాదిదేవతలు పదవి ప్రాప్తి కొరకు విష్ణుమూర్తిని సాయం చేయమని వేడుకొంటారు.

చూశారా! పదవిపోతే మనుష్యులేకాదు దేవతలు కూడా రకరకాల వేషాలేస్తారు.

సరే! విష్ణుభగవానుడు అవతారాలలో ఐదవదైన వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని మూడడుగుల నేలను కోరడం జరిగింది కదా!

రాక్షసుల కులగురువు శుక్రాచార్యుడు. దేవతల గురువైన బృహస్పతితో సమానంగా జ్ఞానం కలవాడు.ఇతని బ్యాడ్ లక్ ఏమిటంటే ఇతను యుగయుగాలుగా రాక్షసరాజులకు గురువైనప్పటికి ఆ రాజులెవరు ఇతనిమాటలు వినలేదు. అందుకే పతనమైనారుకోండి.

అలా శుక్రాచార్యుడి మాట విననివారిలో బలి కూడా ఉన్నాడు.

అయ్యా బలిచక్రవర్తి నీతో మూడడుగుల భూమిని కోరినవాడు సాక్ష్యాత్తు విష్ణుమూర్తి. రాక్షసులు ఎవరినైనా నమ్మవచ్చు కాని విష్ణువు నమ్మరాదు. ఆయన మాడుగుల నేలను కోరడంలో ఏదో మతలబు ఉందయ్యా బాబూ, ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోమంటాడు శుక్రాచార్యుడు.

బలేవాడివయ్యా శుక్రాచార్యా! ఇచ్చిన మాటను ఎలా తప్పేది, మాట తప్పడంకన్నా మరణించడం మేలు కదా! అనంటాడు బలి.

అపుడు లోకంలో కల ధర్మాన్ని గురించి చెబుతూ

వారిజాక్షులయందు వైవాహికములందు
బ్రాణ విత్తమాన* *భంగములందు
జకిత గోకులా గ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘమురాదధిప

అనంటాడు.

అంటే స్త్రీల విషయంలో
పెండ్లి కుదుర్చుకొనేటపుడు
ప్రాణ,ధనహాని కలిగినపుడు,
అవమానం జరుగుతుందనే సందర్భంలో
గోవులకు బ్రాహ్మణులకు ముప్పు ఏర్పడినపుడు
అబద్ధం చెప్పినా ఫరవాలేదు  ఇక్కడ నీకు సంపదకు ఆపద కలుగుతోంది కాబట్టి బొంకవయ్యా దోరా ఏం దోషం లేదంటూ హెచ్చరిస్తాడు.

అయినా బలిచక్రవర్తి ఆడిన మాట నిలబెట్టుకొని పాతాళలోకానికి వెళతాడు. అంతేకాదు సాక్ష్యాత్తు విష్ణుదేవుడినే తన ద్వారపాలకుడిగా చేసుకొంటాడు.

ఇంతకు పై పద్యం ఏ మహాకవి రచనో, ఆయన రచించిన గ్రంధాలేమిటో చెప్పగలరా!
------------------------------------------------------------------------------------

Post a Comment

0 Comments