ఏది గొప్ప - ఒక చిన్న కథ...

ఏది గొప్ప - ఒక చిన్న కథ...
ఒక సాధువు తంబూరా మీటుకుంటూ ఓ తత్త్వాన్ని పాడుతూ వీధుల వెంట వెళుతున్నాడు. కలి అంటే విభేదమనీ, మనుషుల మధ్య చిచ్చు పెడుతుందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అతడు పాడుతున్నాడు. రాజమందిరం పై విహరిస్తున్న రాజుకి ఆ తత్త్వం వినబడింది. ఆయనకది బాగా నచ్చింది. ఆ సాధువును రాజసభకు తీసుకు రావలసిందిగా సేవకులను ఆదేశించాడు. రాజసభలో ఆ తత్త్వాన్ని మరోసారి పాడించి సభాసదులందరితో సహా విని ఆనందించాడు.
రాజు ఆ సాధువుకి బంగారం, రత్నాలు బహూకరించాడు. వద్దని తిరస్కరించాడు సాధువు. ఏంచేస్తూ ఉంటావని అడిగిన రాజుకి, తాను బట్టలు నేసె వాడినని జవాబిచ్చాడు ఆ సాధువు. పోనీ, పనిలో సహాయపడేది ఇస్తానని చెప్పి రాజు, రత్నాలు పొదిగిన బంగారు కత్తెరను బహూకరించాడు. దానిని కూడా సాధువు మర్యాదపూర్వకంగానే తిరస్కరించాడు. "సరే ఏం కావాలో నువ్వే కోరుకో" అన్నాడు రాజు. "రాజా! మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కాబట్టి, ఒక సూది ఇవ్వండి చాలు" అన్నాడు సాధువు. ఏమిటి ఈ దారిద్ర్యం? రాజు అంతటి వాడు ఏదైనా కోరుకో మంటే చిల్లి కానీ విలువ చేయని సూదినా కోరుకోవడం? రాజు ఆశ్చర్యంతో ఆ సాధువుని అడిగాడు. "మహారాజా! కత్తెర వస్త్రాన్ని రెండుగా చింపుతుంది. నాకు కావలసింది కలిని జ్ఞాపకం చేసే సాధనం కాదు. సూది రెండు ముక్కలను కుట్టి కలుపుతుంది. నాకు అలా కలిపేది కావాలి. అదే కలిదోషానికి విరుగుడు" అని సాధువు జవాబిచ్చాడు.

Post a Comment

0 Comments