కథ - గుడి పనులు

రామచంద్రపురం అనే ఊరిలో ఓ ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడు ఓ గుడిని కట్టించాడు. గుడిలోని దేవునికి పూజ చేసేందుకు ఓ పూజరిని నియమించాలి అనుకున్నాడు.దేవాలయం ఖర్చుల నిమిత్తం పొలము, తోటలు మాన్యంగా ఇచ్చాడు. పేదా,సాదా,బీద,బీక్క, సాధువులు సన్యాసులు నాలుగు రోజుల పాటు దేవాలయంలో వుండి, భగవంతుని ప్రసాదం స్వీకరించి, తృప్తి పడేలా ఏర్పాట్లు చేశాడు. దేవళం ఆస్తి పాస్తుల్ని భద్రంగా కాపాడుతూ,దేవాలయం వ్యవహారాలను చక్కదిద్దుకునే ఓ మంచమనిషి కోసం ఎదురు చూడసాగాడు.
చాలామంది ఆ ధనికున్ని మనస్సుల్లోనే తిట్టి పోశారు.అతన్ని పిచ్చివాడిగా చూసారు అందరూ. కాని ఆ ధనవంతుడు ఎవరి మాటలను లెక్క పెట్టేవాడు కాదు. గుడి తలుపులు తెరవగానే, ప్రజలు దేవుని దర్శించుకునేందుకు వచ్చేవారు. అప్పుడు ఆ ధనవంతుడు మేడమీదనుంచి గుడికి వచ్చి పోయేవారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు.
ఓ రోజు ఓ మనిషి దేవున్ని దర్శించాలని వచ్చాడు. మాసిన,చినిగిన బట్టల్లో వున్న ఆ మనిషి అంతగా చదువుకోలేదు.అతను భగవంతుని దర్శించి, వెళ్లిపోయేటప్పుడు,ఆ ధనికుడు అతన్ని తన వద్దకు రమ్మని సైగ చేసాడు.”మీరు ఈ దేవాలయం వ్యవహారాలను నిర్వహించే పని చేపడతారా?” అని అడిగాడు. ఆ వ్యక్తి నివ్వెరపోయాడు.”నేను ఎక్కువగా చదువుకోలేదు.ఇంత పెద్ద దేవాలయం పనులు ఎలా నిర్వహించగలను?” అని అన్నాడు.
  ” నాకు పెద్ద పండితులతో పనిలేదు. ఓ మంచిమనిషి చేతికి ఈ గుడిపనులు చేసే భాద్యతలను అప్పగించదలిచాను”అని ధనికుడు ఆ వ్యక్తితో అన్నాడు.అప్పుడా మనిషి అన్నాడు కదా-“ఎంతమందిలో మీరు నన్నే మంచిమనిషిగా ఎలా భావించారు?”. “మీరు మంచిమనిషి అని తెలుసు.గుడికి వచ్చే దారిలో ఓ ఇటుక బెడ్డ పాతుకు పొయ్యింది.దాన మొన బయటకి కనపడుతుంది.ఆ ఇటుక బెడ్డ మొన ఈ దారిగుండా వచ్చిపోయ్యేవాళ్ళ కాలికి తగులుతూ ఉండటం,వాళ్ళు ముందుకు తూలడమో,కిందపడి,లేచి, దుమ్ము దులుపుకుని పోవడమే నేను చాలా రోజులనుంచి చూస్తూనే ఉన్నాను.ఆ ఇటుక బెడ్డ మొన మీ కాలికి తగలలేదు. అయినా మీరు దాన్ని గమనించి,తొలగించి వేసే ప్రయత్నం చేశారు.మీరు ఓ కూలివానిితో గునపం తెప్పించి,ఆ ఇటుక బెడ్డను పెకళించి, నేలను చదును చేశారు” అని- ధనవంతుడు ఆ వ్యక్తితో అన్నాడు.
అప్పుడా వ్యక్తి ఇలా అన్నాడు-“ఇదేమంత పెద్ద పని కాదు.దారికి అడ్దమయ్యే రాళ్ళురప్పలు, ఇటుకలు, గిటుకలు కనపడితే  వాటిని తొలగించడం ప్రతిమనిషి కర్తవ్యం “తన కర్తవ్యాన్ని తెలుసుకుని,నడుచుకొనే మనుష్యులే మంచివాళ్ళు” అని థనికుడు అన్నాడు. ఆ వ్యక్తికి దేవాలయ వ్యవహారాలు నిర్వహిచే ఉద్యోగం దొరికింది. అతను గుడి పనులు చక్కగా చూసుకోసాగడు.
నీతి: మంచివాడికి మంచే జరుగుతుంది.

Post a Comment

0 Comments