కథ -కృషి

కథ -కృషి

SHYAMPRASAD +91 8099099083
0
*కృషి*

‘నడవడిక’ అనేది మనుషులు పాదాలతో నడిచే తీరుకు సంబంధించిన విషయం కాదు. ‘చేతలు’ అంటే కేవలం చేతులతో చేసే పనులకు సంబంధించిన విషయమూ కాదు. ఇవి ప్రవర్తనకు సంబంధించిన సంగతులు. జీవన పోరాటంలో విజేతల వెనక ఎంతో కృషి ఉంటుంది. అటువంటివారి విజయానికి మూలం ఏమిటో గ్రహించి, ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించాలి.

భగవంతుడు మనిషిని దీనుడిగా, హీనుడిగా సృష్టించలేదు. తనకు ప్రతిగా మానవుణ్ని భూమ్మీదకు పంపించాడు. సర్వ ప్రాణుల్లో ఆలోచన చేయగల, సంభాషించగల జీవిగా మానవుణ్ని ఈశ్వరుడు సృష్టించాడు. కాళ్లూ చేతులూ మానవుడికి ఉన్నట్లుగా మరే ప్రాణికీ లేవు. ఒక యువకుడు ఓ వ్యక్తి వద్దకు వెళ్లి ‘అయ్యా! మీకు తోచిన ధర్మం చేయండి’ అని దీనంగా ప్రార్థించాడు. ఆయన యువకుణ్ని తేరిపార చూశాడు. ‘నువ్వు కోటీశ్వరుడివి కదా! అయినా అడుక్కుంటున్నావెందుకు?’ అన్నాడు. బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు. ‘నా చేతిలో ఒక చిన్న రాగినాణెమైనా లేదు. నేను బిచ్చం ఎత్తుకోక ఏం చేయను?’ అని ప్రశ్నించాడు. ‘నీ కళ్లు, కాళ్లు, చేతులు సక్రమంగా ఉన్నంతకాలం నువ్వు సంపన్నుడివే! ఇవి అమూల్యమైన అవయవాలు. వీటి సాయంతో నువ్వు సుఖంగా బతకవచ్చు. ఇక నువ్వు యాచించవలసిన పనిలేదు’ అని ఆయన చెప్పగా యువకుడికి జ్ఞానోదయం కలిగింది. ఆ విశిష్టవ్యక్తి- ప్రసిద్ధ రష్యన్‌ కథా రచయిత టాల్‌స్టాయ్‌.

ఈశ్వర చంద్రవిద్యాసాగరుడి వద్దకు ఒక బాలుడు వెళ్ళి ‘అయ్యా! ఆకలవుతున్నది, ఒక పైసా దానం చేయండి’ అని యాచించాడు. ‘రెండు పైసలిస్తే ఏం చేస్తావ్‌?’ అడిగాడు విద్యాసాగరుడు.

‘మా అమ్మకు శెనగలు కొనుక్కుపోతా!’

‘రూపాయి ఇస్తే ఏం చేస్తావ్‌?’

‘చవగ్గా దొరికే వస్తువులు కొని, వాటిని బజారులో అమ్మి, స్వశక్తితో జీవిస్తా. ఇక అప్పుడు అడుక్కోవలసిన దుస్థితి నాకు ఉండదు.’

ఈ సమాధానం విన్న వెంటనే విద్యాసాగరుడు ఒక రూపాయి తీసి ఆ బాలుడి చేతిలో పెట్టాడు. కొంతకాలానికి ఆయన ఒక పనిపై ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళడం సంభవించినప్పుడు, అక్కడ కొత్తగా ఒక దుకాణం వెలసి ఉండటం గమనించాడు. ఒక యువకుడు గబగబ వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి- ‘ఇదంతా ఆనాడు మీరిచ్చిన రూపాయి చలవే’ అన్నాడు.

‘డబ్బుకంటే విలువైనది కృషి! అది నీ దగ్గరుంది. కృషి చేసేవాళ్లకు దరిద్రం ఉండదు’ అన్నాడు విద్యాసాగరుడు ఆ యువకుడిని మనసారా అభినందిస్తూ.

శరీరాన్ని శ్రమ పెట్టేవాళ్లకు ఆరోగ్యం, ఆనందంతోపాటు సంపద కూడా సిద్ధిస్తుంది. ఒక తల్లి చిన్న కోళ్లఫారం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది. ఆమె కుమారుడు తల్లికష్టంలో పాలుపంచుకొనేవాడు. పని చేయడం అతడి నిత్యజీవితంలో ఒక భాగమైంది. చిన్నచిన్న వ్యాపారాల్లో అనుభవం సంపాదించాడు. చివరకు కోట్ల కొలది ధనానికి అధిపతి కాగలిగాడు. అనేక సంస్థలను స్థాపించాడు. పెక్కుమంది చేతులకు పనులు కల్పించాడు. ఆ సంస్థల్ని నడపడానికి ఎంతో ధనాన్ని ఖర్చు చేశాడు. అంతకంటే ఎక్కువగా రెండుచేతులా దానధర్మాలు చేశాడు. ఆయనే సుప్రసిద్ధ సంపన్నుడు రాక్‌ ఫెల్లర్‌.

సాధుసంతులకు మనదేశం జన్మభూమి. ఆ మహాపురుషులు ప్రపంచమంతటా పర్యటించి ప్రజలకు మార్గదర్శనం గావించారు.

కృషికి ఆడంబరాలతో పని లేదు. సాధుసన్యాసులు తమకంటూ ఏమీ మిగుల్చుకోరు. కాషాయవస్త్రాలతో నిరాడంబరంగా జీవిస్తారు. కాషాయం కట్టకపోయినా భారతీయ గృహస్థుల నిరాడంబర జీవన విధానానికి ఇదే మూలం!

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!