ఎవడీ బర్చరీకుడు? ఏమిటీతని గొప్ప ?

ఎవడీ బర్చరీకుడు? ఏమిటీతని గొప్ప ?
..............................................

భూభారంతోపాటు  భూలోకంలో పాపభారం పెరిగిపోయింది. దేవతలు  పాపభారాన్ని తగ్గించమని  బ్రహ్మను మొరపెట్టుకొన్నారు. అందుకు బ్రహ్మ, భగవానుడైన విష్ణువు అవతారపురుషుడై భూలోక పాపభారాన్ని రూపుమాపుతాడని అభయమిస్తాడు. ఇదంతా చూస్తున్న యక్షుడొకడు భూలోకపాపభారాన్ని తొలగించటానికి విష్ణువు అవతారమెత్తాలా ? నేకొక్కడు చాలదా భూలోకపాపభారం తీర్చటానికి అంటూ ఎగతాళిగా ప్రశ్నిస్తాడు. అందుకు బ్రహ్మ కోపగించుకొని కొన్నికొన్ని మహత్కార్యాలు సాధించాలంటే అది మహత్ములకే సాధ్యం, అందుకే విష్ణువే అవతార పురుషుడై భూలోకంలో జన్మిస్తాడు, సభామర్యాద ధిక్కారానికి నువ్వు నరలోకంలో రాక్షసుడువై జన్మిస్తావని శపిస్తాడు.

ఘటోత్కచుడంటే బొర్లించిన కుండ అకారంలో తలకాయకలవాడని అర్థం.ఇతని భార్య పేరు అహిళావతి.వీరిద్దరికి శక్తివర ప్రసాదం వలన పుత్రసంతానం కలుగుతుంది. బర్బరీకుడు అంటే పుట్టుకతోనే ఉంగరాలు జుట్టు కలవాడని అర్థం.

బర్చరీకుడు తల్లివద్దనే  సకల శాస్త్రాలు నేర్చి దేవిఉపాసన చేసి, ఆ శక్తివలన మూడు బాణాలను పొందుతాడు.ఆ బాణాలకు గొప్ప విశేషముంది. 

మొదటి బాణాన్ని ప్రయోగిస్తే అది లక్ష్యాన్ని (టార్గెట్ ) ను చేరి దేనిని సంహరించాలో గుర్తిస్తుంది.identification of target or enemies.

రెండవబాణ ప్రయోగం వలన అది మిత్రులను హితులను మంచివారిని గుర్తిస్తుంది.identification of non enemies.

ఇక మూడవ బాణాన్ని ప్రయోగిస్తే అది మొదటి బాణం గుర్తించినవారిని సంహరిస్తుంది.అంటే గుర్తించిన శత్రువులను ధ్వంసం చేస్తుంది.

ఇంకొక్కసౌలభ్యం ఏమిటంటే  దేనిని గుర్తించాలో స్మరిస్తూ మొదటి బాణాన్ని ప్రయోగిస్తే దానిని అది మాత్రమే గుర్తిస్తుంది. ఉదా॥ కొండపై రాళ్ళురప్పలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోటానికి మంత్రించి ఈ బాణాన్ని వదిలితేకొండపై రాళ్ళురప్పలు ఎన్నున్నాయో గుర్తిస్తుంది.

కురుక్షేత్ర సంగ్రామం చూడాలని బర్బీరకుడు ఉబలాటపడతాడు. తల్లి అనుమతితో కురుక్షేత్రానికి బయలుదేరుతాడు. తనదగ్గర అజేయమైన మూడుబాణాల సంపత్తి వుంది కాబట్టి కురుక్షేత్రంలో బలహీనుల పక్షంలో వుండి  యుద్ధంచేస్తానని శపధంచేస్తాడు.కౌరువుల పక్షాన 11 అక్షౌహినులు పాండవులపక్షాన 7 అక్షౌహినుల సైన్యంవుంది కాబట్టి పాండవులే బలహీనుల అతని ఉద్దేశ్యం.

కౌరవపాండవ సైన్యాలు ఇరువైపులా మొహరించాయి. ఎవరు ఎన్నాళ్ళలో యుద్ధం ముగించగలరో తెలుసుకోవాలని అభిలాషతో కృష్ణుడు మొదటగా భీష్ముడిని ప్రశ్నిస్తే 20 రోజులని, ద్రోణుడు 24 రోజులని, కర్ణుడు 22 రోజులుచాలని సమాధానమిచ్చారు.

 కురుక్షేత్రంలో జరుగుతున్న తంతును దూరంగా గమనిస్తున్న బర్బరీకుడు కృష్ణుడికి కంటికి కనబడతాడు. మాయావేషంలో కృష్ణుడు బర్బరీకుడి వద్దకు వెళ్ళి నువ్వైతే కురుక్షేత్రయుద్ధాన్ని ఎన్నాళ్ళలో ముగించగలవలని ప్రశ్నిస్తాడు. తన వద్ద త్రిశరాలు ఉన్నాయని వాటి ద్వారా క్షణకాలంలో యుద్ధాన్ని ముగించగలనని బర్బరీకుడు సమాధానమిస్తాడు.

ఆ మూడుబాణాల గొప్పతనం తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు అతనికో పరిక్షపెడతాడు. సమీపంలోని రావిచెట్టు మీది ఆకులను గుర్తించమని శ్రీకృష్ణుడు అడగగానే బర్బరీకుడు మొదటిబాణం తీసి మంత్రోచ్ఛారణకు కళ్ళు మూసుకోగానే శ్రీకృష్ణుడు రావి ఆకునొకదాన్ని తెంపి కాలికింద వేసుకొంటాడు. మొదటిబాణం ప్రయోగించిన వెంటనే రావిచెట్టుపైనున్న వేలాది ఆకులను గుర్తించి శ్రీకృష్ణుడి పాదం వైపు దూసుకువస్తుంది.అశ్చర్యపోయిన బర్బరీకుడు అతని కాలికింద రావిఆకు వుందని, కాలు తీయకపోతే కాలిని చేధించుకొని ఆ బాణం రావిఆకును చేరుతుందని హెచ్చరిస్తాడు. శ్రీకృష్ణుడు కాలు ప్రక్కకు తీస్తాడు.

బర్బరీకుడి వలన పెద్ద అపాయం దాపురించిందని శ్రీకృష్ణుడు భయపడ్డాడు. అదెలాగంటే బర్బరీకుడు పాండవులు బలహీనులని వారి పక్షంచేరి యుద్ధంచేస్తే, బర్బీకుని వలన పాండవులు బలవంతులైతారు, కౌరవులు బలహీనపడతారు. అప్పుడు తన శపధంప్రకారం బలహీనులైన కౌరవుల పక్షంచేరాలి.బర్బరీకుడు ఎటుచేరినా కౌరవపాండవ సేనలు యుద్ధం ముగిసేనాటికి నశించి బర్బీకుడొక్కడే చివరకు మిగులుతాడు.

ఇదే అంశాన్ని శ్రీకృష్ణుడు బర్బరీకునితో ప్రశ్నిస్తాడు. బర్బీకుడు తికమక పడిపోతాడు.వచ్చినవాడు సామాన్యుడు కాదని శ్రీకృష్ణుడని గ్రహించి, తాను చేసిన శపధానికి విచారపడి ధర్మపరిరక్షణకు ఏం చేయాలని శ్రీకృష్ణుని ప్రార్ధిస్తాడు. తనకో వరం ఇస్తే పరిహారం చెపుతానంటాడు శ్రీకృష్ణుడు. అలాగేనంటాడు బర్చరీకుడు.

అయితే నీ ప్రాణాలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. ధర్మరక్షణకు నా ప్రాణం ఇవ్వటానికి నాకేమి అభ్యంతరంలేదు కాని కురుక్షేత్రసంగ్రామాన్ని కన్నులారా చూడాలన్న తన కోరిక మాటేమిటని తిరుగు ప్రశ్నించాడు బర్చరీకుడు.

నువ్వు బ్రతికివున్నపుడే నీ కోరిక తీరుతుంది, మొదట నీ తలనరికి ఇవ్వమంటాడు కృష్ణుడు.కృష్ణుడి మాటమేరకు కత్తితో తలనరక్కొని అతని చేతులలో వుంచుతాడు ఆ ఘటోత్కచుని కుమారుడు.

శ్రీకృష్ణుడు బర్బరీకుని ఖండిత శిరస్సును తీసుకొని, కురుక్షేత్ర సంగ్రామచరిత్ర ముగిసేంత వరకు ఆ శిరసుకు ప్రాణంపోసి, కురుక్షేత్రయుద్ధం కనబడేలా ఓ కొండకొనలో  ఉంచుతా

డు.

యుద్ధం ముగిసింది,కౌరవసంహారం జరిగిన తరువాత పాండవులు తమలో తాము గొప్పవాళ్ళమని తనవలననే కౌరవులు ఎక్కువమంది సంహారించబడ్డారని గర్వంతో పొంగిపోసాగారు.

అప్పుడు శ్రీకృష్ణపరమాత్మ మీలో ఎవరు గొప్పవాడో చెప్పగలవాడు మొత్తం సంగ్రామాన్ని చూచినవాడు బర్బరీకుడొకడేనని అతని తల వద్దకు పాండవులను పంపుతాడు.

అంతట బర్చరీకుడు నేను మొత్తం కురుక్షేత్రయుద్ధాన్ని చూచాను, శ్రీకృష్ణుని సుదర్శనచక్రమే కౌరవసేనలో తిరుగుతూ దుష్టులను సంహారించిందని శ్రీకృష్ణుభగవానుడే కర్త కర్మ క్రియ అని తెలియచేస్తాడు.

జ్ఞానోదయం చెందిన పాండవులు తమ గర్వానికి సిగ్గుపడి బర్బరీకుని త్యాగానికి మెచ్చుకొని అతనికి అకాలమరణం సిద్ధిస్తున్నందుకు శోకించారు.

శ్రీకృష్ణుడు బర్బీకుని తలను నదిలో కలిపి కర్మకాండలు పాండవులచే నిర్వహింప చేసి బర్బీకునికి సద్గతులు ప్రాప్తింప చేస్తాడు.
బ్రహ్మచే శాపం పొందిన యక్షుడు ఇలా శ్రీకృష్ణుని దయచేత సద్గతులు పొందాడు.
-----------------------------------------------------------------

Post a Comment

0 Comments