కథ- సమయస్ఫూర్తి

కథ- సమయస్ఫూర్తి

SHYAMPRASAD +91 8099099083
0
సమయస్ఫూర్తి:
అనగనగా ఒక అడవిలో ఆకలితో ఉన్న సింహం తనకు 'తగిన ఆహారం ఏం దొరుకుతుందా' అని అలోచిస్తూ అడవి అంతటా తిరిగింది. దూరంనుండే దాన్ని చూసిన జంతువులన్నీ వేటికవి దాక్కున్నాయి, దాని కంట పడలేదు.

చివరికి మామిడి చెట్టు మీద ఉన్న కోతి ఒకటి కనిపించింది దానికి. 'వేరేవేమీ‌ కనిపించటం లేదు. ఈ పూటకి దీన్ని తిని కడుపునింపుకుందాం' అనుకున్నది సింహం.

'సరే, మరి నాకు చెట్టెక్కటం రాదు కదా, దాన్నే చెట్టు దిగేలా చెయ్యాలి' అని, అది ఒక ఉపాయం ఆలోచించింది. నేల వైపుకే నిశితంగా చూస్తూ, దేన్నో బాగా పరిశీలిస్తున్నట్లు ఒక్కో కాలునూ ఎంతో జాగ్రత్తగా ఎత్తి ఎత్తి వేస్తూ నడవటం మొదలు పెట్టింది.

'క్రింద ఎవరో‌ కదులుతున్నట్లున్నారే' అని చూసిన కోతికి అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్న సింహం కనబడింది. 'ఇదేంటి, ఇట్లా నడుస్తోంది? క్రింద ఏం చూస్తోందసలు? కనీసం పైకి తలెత్తి కూడా చూడటం లేదేమిటి?' అని దానికేసే ఆశ్చర్యంగా చూడసాగింది కోతి.

కొంత సేపటికి సింహం కోతి తనను గమనిస్తున్నదని కనుక్కున్నది. 'ఇదే అవకాశం' అనుకొని అది ఒకసారి పైకి కోతి వైపుకు చూసి, చిరునవ్వు నవ్వి అన్నది- "మిత్రమా! నన్ను చూసి భయపడుతున్నావా? ఇప్పుడింక ఆ అవసరం లేదు. నేను ముసలిదాన్నయినాను. యౌవనంలో ఎన్నో జంతువులను చంపి తిన్నాను, చాలా పాపం మూటగట్టుకున్నాను. ఇప్పుడు నాకు హింస అంటేనే అసహ్యం వేస్తున్నది. అందుకని, నా పాప పరిహారం కోసం తీర్థయాత్రలకు బయలుదేరాను. నా వల్ల ఎవ్వరికీ హాని కలగకూడనని నాకుగా నేను ఈ నియమం పెట్టుకున్నాను- నా కాలి క్రింద పడి కీటకాలు కూడా చావరాదని, ఇలా చూసి చూసి నడవాలని నిశ్చయించుకున్నాను. కాశీ చాలా దూరంలోనే ఉంది- అయినా నా నియమాన్ని మటుకు తప్పేది లేదు" అన్నదది కోతితో.

కోతి దాని మాటలు నమ్మింది. "ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంతటి మార్పు!" అనుకున్నది ముచ్చటగా. "ఇట్లాంటి భక్తులను కాకపోతే వేరే ఎవరిని దర్శించుకుంటాం?" అనుకొని, చెట్టు దిగి వచ్చి, సింహం ముందు నిలబడి, ఎంతో భక్తిగా నమస్కరించింది.

అదే అదననుకున్న సింహం ఒక్కసారిగా దాని మీదికి దూకి, దాన్ని బోర్లా పడేసి, దాని పొట్టమీద కాలు మోపి నిలబడింది. క్రూరంగా నవ్వుతూ, కోర పళ్ళు చూపిస్తూ, నాలుకతో పెదాలను నాక్కుంటున్న సింహాన్ని చూడగానే కోతికి తను చేసిన తప్పు అర్థమైంది. 'క్రూరజంతువుల్ని ఏనాటికీ నమ్మకూడదు' అని వాళ్ళ అమ్మ ఎంత గట్టిగా చెప్పిందో గుర్తొచ్చి, దానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అయితే అది తెలివైనది కదా, వెంటనే తమాయించుకున్నది. గట్టిగా, పడి పడి నవ్వటం మొదలెట్టింది.

"ఇంకొద్ది సేపట్లో నీకు చావు తప్పదు. ఏడవటానికి బదులు ఎందుకు, నవ్వుతున్నావు?" అడిగింది సింహం అనుమానంగా. "పూర్వం నీలాంటి తెలివి తక్కువ సింహం ఒకటి ఇలాగే ఓ కోతిని చంపి తినాలనుకున్నదట" చెప్తూ చెప్తూ నవ్వ సాగింది కోతి. "అప్పుడు దాని పరిస్థితి ఎలా అయ్యిందో తలచుకుంటే నవ్వు ఆగట్లేదు. మరీ ఇంత ఇదిగానా?" అని మళ్ళీ మళ్ళీ నవ్వసాగింది కోతి.

"ఏమైందట, దానికి?" అడిగింది సింహం కరకుగా.

"అబ్బ...ఉహ్హుహ్హుహ్హు.." అని మళ్ళీ పడి పడి నవ్వింది కోతి. నువ్వు నా పొట్ట మీద కాలు పెట్టి నొక్కుకుంటూంటే ఎట్లా చెప్పను- ఆయాసంగా ఉంది. కాలు కాస్త ప్రక్కకు తియ్" అంటూ సింహం కాలును పక్కకు నెట్టింది కోతి. అదేమిటో వినాలనే ఆత్రుతలో ఉన్న సింహం‌ కూడా అదాటున కాలును ప్రక్కకు జరిపింది.

అంతే- కోతి ఒక్కసారి ఎగిరి గంతేసి చెట్టు మీదికి పారిపోయింది!

పారిపోతూ పారిపోతూ "ఇప్పుడేం జరిగిందో అదే జరిగిందిలేమ్మా!" అని సింహాన్ని వెక్కిరించింది!

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!