కథ -వీలునామా

కథ -వీలునామా

SHYAMPRASAD +91 8099099083
0
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🍁వీలునామా!🍁

శేషయ్య, భూషయ్య ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవారు. బాగా కలిసిరావడంతో తలొక పది ఎకరాల పొలం కొనుక్కున్నారు. భూషయ్యది తెలివి. శేషయ్యది ఆచరణ. ఇలా వీరిద్దరి కథ నడిచేది.

30 ఏళ్ల వయసులో భూషయ్య భార్య సునంద చనిపోయింది. అప్పటికి మూడు సంవత్సరాల కొడుకు వీరబాబు ఉన్నాడు.

కొంతకాలానికి భూషయ్య అనారోగ్యం పాలయ్యాడు. శేషయ్యను పిలిచి ‘మిత్రమా!

నా అనేవారు నాకు ఎవరూ లేరు. నాకు ఏదైనా ప్రమాదం జరిగితే నా కొడుకును నువ్వే పెంచి పెద్ద చేయాలి.’ అని చెప్పాడు.

‘నీకేమీ జరగదు. అలా ఆలోచించకు’ అని శేషయ్య భరోసాగా చెప్పాడు.

తనకు జరగరానిది ఏదైనా జరిగితే తన కొడుకు పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన భూషయ్యను కలవరపెట్టేది.

ఓ రోజు గ్రామంలోని నలుగురు పెద్దలను పిలిచాడు. శేషయ్యనూ రమ్మన్నాడు. ‘నాకు ఆరోగ్యం బాగా లేదు. వైద్యులు నేను ఎక్కువకాలం బతకనని తేల్చి చెప్పేశారు. నా ఆందోళన అంతా నా కొడుకు గురించే. అందుకే నా కొడుకు బాధ్యతలు శేషయ్యకు అప్పగించాలనుకుంటున్నా. నా పది ఎకరాలు అతనికి ఇచ్చేస్తా. దాని మీద వచ్చే ఆదాయంతో నా కొడుకును ఇరవై ఏళ్లు వచ్చే వరకు పెంచమని కోరుతున్నా.’ అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.
భూషయ్య మాటలు అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు.

‘మా వాడికి ఇరవై ఏళ్లు వచ్చాక శేషయ్య వాడి బాధ్యతలు పట్టించుకోనవసరం లేదు. అతనికి ఇష్టమైన ఎకరాలు నా కొడుకుకు ఇవ్వాలి. ఆ తర్వాత వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది’ అని చెప్పాడు భూషయ్య.
ఇదంతా విని శేషయ్య ‘నీ ఆస్తి నాకు అవసరం లేదు. నీకు ఏమీ జరగదు. నువ్వు ఆందోళన పడకు. నీ కొడుకును నా కొడుకుగా చూసుకుంటా’ అన్నాడు.

భూషయ్య బదులిస్తూ ‘శేషయ్యా! మనిద్దరం ప్రాణ మిత్రులం. అందుకే నీకు ఈ పని అప్పగిస్తున్నా’ అంటూ తను చెప్పిన మాటలు కాగితంపై రాసి గ్రామ పెద్దలతో సాక్షి సంతకాలు చేయించాడు. శేషయ్య సంతకం చేశాక తానూ సంతకం చేసి తన వీలునామాగా దానిని భద్రపరిచాడు.

తర్వాత ఆ వీలునామా నకళ్లు నలుగురు గ్రామ పెద్దలకు, శేషయ్యకు ఇచ్చాడు. అసలు వీలునామా తన పెట్టెలో పెట్టాడు.

ఒక రోజున భూషయ్య చనిపోయాడు. అనుకున్న ప్రకారం శేషయ్య వీరబాబును చేరదీసి ఇరవైఏళ్లు పెంచాడు.

‘మీ నాన్న కోరినట్టుగా నిన్ను ఇన్నేళ్లు పెంచా. నాకు ఇష్టమైన ఎకరాలు నీకు ఇమ్మన్నాడు. అందుకే నీకు ఒక ఎకరం ఇస్తున్నా’ అని శేషయ్య చెప్పాడు.

శేషయ్య పన్నాగం పసిగట్టిన వీరబాబు ‘తనకు న్యాయం జరిగేలా చూడండి’ అని గ్రామపెద్దల్ని అడిగాడు.

‘మీ నాన్న కోరిక ప్రకారమే శేషయ్య చేశాడు. అదే న్యాయం’ అని వారు చెప్పారు. వీరబాబు తనకు అన్యాయం జరిగిందని న్యాయాధికారి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడు.

‘నీ తండ్రి రాసిన వీలునామా తీసుకురా!’ అన్నాడు న్యాయాధికారి.

వీరబాబు ఇంటికి వెళ్లి తన తండ్రి పెట్టెని వెతికాడు. తండ్రి రాసిన వీలునామా దొరికింది.

వీలునామా చూసిన న్యాయాధికారి శేషయ్యకు రమ్మని కబురుపెట్టాడు.శేషయ్య గ్రామపెద్దలను తీసుకుని న్యాయాధికారి దగ్గరకు వెళ్లాడు.

‘నువ్వు అన్యాయం చేశావు అంటున్నాడు వీరబాబు. నీ సమాధానం ఏమిటి?’ అడిగాడు న్యాయాధికారి.

‘నాకు ఇష్టమైన ఎకరాలు వీరబాబుకు ఇమ్మని అతని తండ్రి చెప్పాడు. నేను అలాగే చేశాను’ అన్నాడు శేషయ్య.

‘లేదు. నువ్వు అలా చేయలేదు. నీకు ఇష్టమైన ఎకరాలు నీ దగ్గర ఉంచుకుని నీకు ఇష్టం లేని ఎకరం అతనికి ఇచ్చావు. వీలునామా ప్రకారం నీకు ఇష్టమైన తొమ్మిది ఎకరాలు వీరబాబుకు ఇవ్వాలి’ అని తీర్పు చెప్పాడు.అప్పుడు భూషయ్య తెలివి మిగిలిన వారందరికీ అర్థం అయ్యింది.

శేషయ్య మారు మాటాడకుండా వీరబాబుకు తొమ్మిది ఎకరాలు ఇచ్చేశాడు.🍁

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!