🍁శిక్షణ, క్రమశిక్షణ🍁
అది సారనాథ్‌కు సమీపంలో ఉన్న విశాలమైన వనం. ఆ వనంలో ఎన్నో రకాల జింకలు జీవిస్తూ ఉండేవి. వాటికి క్రూరమృగాల పీడతో పాటు వేటగాళ్ళ వల్ల ప్రమాదాలూ ఎక్కువగానే ఉండేవి. అలాగే తినకూడని మొక్కలూ ఉండేవి. తిరగకూడని ప్రదేశాలు ఉండేవి. అవి ఈ ప్రమాదాలన్నిటినీ గుర్తించి బతకాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా, ఏమరపాటు కనబరచినా ఏదో ఒక వైపు నుంచి ప్రమాదం వచ్చిపడేది. ఈ ప్రమాదాలను పసిగట్టడం, వాటి నుంచి తప్పుకోవడం చిన్నప్పటి నుంచే వాటికి తెలియాలి. ఆపదలో చిక్కుకున్నప్పుడు తెలివితో బయటపడే మార్గాలు తెలియాలి. ఈ విద్యల్ని ‘మృగమాయ విద్యలు’ అంటారు. వీటిని నిగ్రోధుడు అనేవాడు నేర్పేవాడు. ఈ నిగ్రోధుడు జింకల గురువు.
ఆ వనంలో కురంగుడు, హరిణుడు అనే రెండు కుర్ర జింకలు కూడా నిర్గోధుడి దగ్గర శిక్షణకు చేరాయి. ఆ రెండూ అన్నదమ్ములు. కురంగుడు ఆలస్యం చేయకుండా సమయానికే గురువు దగ్గరకు వచ్చేవాడు. విద్య నేర్వడంలో క్రమశిక్షణ పాటించేవాడు. చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. కానీ, హరిణుడు ఇందుకు భిన్నంగా ఉండేవాడు. శ్రద్ధ చూపేవాడు కాదు.
‘నీ పద్ధతి ఏం బాగోలేదు’ అని అన్నయ్య కురంగుడు వారిస్తే -
‘‘సోదరా! ఈ విద్యలన్నీ అవసరమా? ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే ఈ అడవిలో తిండి కోసం తిరగడం ఎందుకూ? పొదల్లోనే దాక్కుంటే పోలా? అయినా ఎప్పుడో వచ్చే ఆపదను ముందే ఊహించుకొని భయంతో బతకడం ఎందుకు? ఈ అడవిలో ఇన్ని వేల జింకలున్నాయి. వాటికి రాని ఆపద నాకే వచ్చి పడుతుందా?’’ అనేవాడు తమ్ముడు హరిణుడు.
‘‘సోదరా! మనం ఈ విద్యలు నేర్చేది పొదల్లో దూరి బతకడానికి కాదు. వనంలో విహరిస్తూ ఆహారం
తినడానికే! తోటివారితో కలిసి తిరగడానికే! అలా తిరిగేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే, విచ్చలవిడితనంతో విహరిస్తే... ఆ వచ్చే ప్రమాదాలను మనకు మనమే ఆహ్వానించినట్టు. వాటికి మనమే ఎదురు వెళ్ళినట్టు. ప్రమాదాల్లో చిక్కుకోకుండా సుఖంగా బతకడానికే ఈ శిక్షణ, క్రమశిక్షణ’’ అని చెప్పాడు అన్నయ్య కురంగుడు.
అతను ఎన్ని సార్లు చెప్పినా హరిణుడు తన నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు.
👉తాను పాటించాల్సిన నియమాలు పాటించకుండా, ‘ఆ ప్రమాదం నాకే వచ్చి పడుతుందా ఏమిటి?’ అనే నిర్లక్ష్య ధోరణితో తిరుగుతూ... తిరుగుతూ... చివరకు వేటగాడు పన్నిన ఉచ్చులో పడ్డాడు. ఆ వేటగాడికి చిక్కాడు. నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు.
👉కురంగుడు అడవి అంతా తిరిగినా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటూ సుఖంగా జీవించాడు.
ఇది బుద్ధుడు చెప్పిన జాతక కథల్లో ఒక కథ. ఈ కథ ఇప్పుడు మనకు ఈ కరోనా కాలంలో చక్కగా వర్తిస్తుంది.
ఇళ్ళల్లోంచీ బయటకు రాకుండా ఎంతోకాలం జీవించలేం. అలాగని బయట విచ్చలవిడిగా తిరిగినా, నిర్లక్ష్యంగా గడిపినా మనదీ హరిణుడి గతే!
👉జాగ్రత్తలు పాటిస్తూ నిరంతరం అప్రమత్తతతో ఉంటే... వనమంతా తిరిగినా వర్ధిల్లిన కురంగునిలా... జగమంతా తిరిగినా జీవించగలం!🍁
Hi Please, Do not Spam in Comments