పెంపకం - A to Z 2512

HIGHLIGHTS

పెంపకం

*పెంపకం*
 
*రాజవత్ పంచవర్షాణి* 
 *దశవర్షాణి దాసవత్* 
 *ప్రాప్తే తు షోడశే వర్షే* 
 *పుత్రం మిత్రవదాచరేత్* 

తల్లిదండ్రులు తమ పిల్లలను ఐదు సంవత్సరాల వరకు మహారాజుని చూసినట్లు చూడాలి. తరువాత పది సంవత్సరాల పాటు ప్రేమానురాగాలు చూపిస్తూనే కట్టుదిట్టంగా పెంచాలి. పదహారు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత మిత్రుణ్ణి చూసినట్లు చూడాలి.

మనసు అనే మొక్కకు మనమే తోటమాలి. బీజాలు నాటడం నుంచి మొక్కగా ఎదిగేవరకు మనం ఎలా సాకుతామో అలా పెరుగుతుంది. మన జాగ్రత్తలన్నీ బీజాలు ఎంపిక చేయడంలోనే చూపాలి. అక్కడ పొరపాటు చేస్తే అమృతబీజాలకు బదులు విషబీజాలు పడతాయి. ఈ రెండింటి మధ్యగల తేడా ఏమిటోకూడా మనం గ్రహించాలి.
అమృతబీజాలంటే- ప్రేమ, కరుణ, దానం, దయ వంటివి.
విషబీజాలంటే- అసూయ, ద్వేషం, కోపం, అహంకారం వంటివి.
మొదటివి పూలమొక్కల్ని మొలిపిస్తాయి. రెండోరకం- విషవృక్షాలు పుట్టిస్తాయి. బాల్యదశ తల్లిదండ్రుల సంరక్షణలో గడుస్తుంది. పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపవలసింది వారే. పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. వారి ప్రతి చర్యనూ పిల్లలు సమీపం నుంచి గమనిస్తుంటారు. కాబట్టి, తమనుంచి పిల్లలు సద్గుణాలు నేర్చుకునేట్టు పెద్దల ప్రవర్తన ఉండాలి.
చాలామంది పిల్లల పెంపకం అంటే తిండి, గుడ్డ, ఇతర సౌకర్యాలు, చదువు మాత్రమే అనుకుంటారు. వీటికంటే ఎంతో ముఖ్యమైనది సంస్కారం.
సంస్కారానికి సరైన నిర్వచనం సత్ప్రవర్తన. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు- ఇలాంటివన్నీ సత్ప్రవర్తన కిందికే వస్తాయి.
కొందరు పిల్లలు అతిగా మాట్లాడతారు. కొందరు మూతి కుట్టేసినట్టు అసలు మాట్లాడరు. అతిస్వేచ్ఛ, పట్టించుకొనకపోవడం వల్ల పిల్లలు వారికి తోచినదల్లా మాట్లాడుతుంటారు. ఈ అలవాటు మార్చుకోకపోతే పెద్దయ్యాక ఎవరూ వారి ‘అతి’ని భరించలేరు.
పిల్లలను అతిగా మందలించడం, ఏది చేసినా అందులో తప్పులు చూపడం వంటి పెద్దల ధోరణి పిల్లల్ని మానసికంగా మూగవారిని చేస్తుంది. వారు తమలో తాము సంభాషించుకుంటారే తప్ప, నోరుతెరిచి మాట్లాడరు. దీనివల్ల భావవ్యక్తీకరణలో వారు విఫలమవుతుంటారు.
‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నది అందరూ గుర్తుంచుకోవాల్సిన అద్భుతమంత్రం.

No comments