తూఫాన్ కి పేరు ఎలా పెడతారు???
మొన్ననే సూపర్ తుఫాను అంపన్ నుంచి కోలుకోక ముందే.. భారత్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. గుజరాత్‌లోని సూరత్‌కు దక్షిణ నైరుతి దిశలో 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. దీనిని ‘నిసర్గ’ పేరుతో పిలుస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటీవల సూపర్ సైక్లోన్ ‘అంపన్’ పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో విధ్వంసం సృష్టించింది. ‘అంపన్’, ‘నిసర్గ’ ఇలా ఒక్కో తుపానును ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ తుపానుకు నిసర్గ అనే పేరును బంగ్లాదేశ్ సూచింది. అసలు తుపానులకు పెడుతున్న పేర్ల వెనుక ఓ పెద్ద కథే ఉంది. 2020లో హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లకు కొత్తపేర్లను పెట్టే క్రమంలో ఇది మొదటిది.
తాజాగా భారత వాతావరణశాఖ రాబోయే తుపానుల పేర్ల జాబితాను ఇటీవల విడుదల చేసింది. వీటిలో అర్నబ్, నిసర్గ, ఆగ్, వ్యోమ్, అజర్, పింకూ, తేజ్, గాటి, లులు తదితర 160 పేర్లు ఉన్నాయి. వీటిని హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13దేశాలు ఈ పేర్లను నిర్ణయిస్తాయి. వీటిలో భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మియన్మార్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యూఏఈ, యెమెన్ దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశం 13పేర్లను సూచించాలి. తాజాగా విరుచుకుపడిన ‘అంపన్’పేరు థాయిలాండ్ సూచించింది. ఈ పేరుతో 2004లో ప్రతిపాదించిన 64 పేర్లు పూర్తయ్యాయి. ఇప్పుడు కొత్తగా 169 పేర్లను ప్రతిపాదించారు. 2004లో తొలిసారి ప్రచురించగా ఆ జాబితాలో అంపన్ చివరిది. 2019లో అరేబియా సముద్రంలో ఐదు తుపానులు ఏర్పడ్డాయి. 1902లోనూ ఐదు తుపాన్లు ఏర్పడ్డాయి. 1902 తరువాత అంత సంఖ్యలో తుపాన్లు రావడం 2019లోనే కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఆరు రీజినల్ స్పెషలైజ్డ్ మెట్రోలాజికల్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో 5 కేంద్రాల్లో తుపానుల బెడద ఎక్కువ. అయితే, తుఫాను పేర్లు ఖరారు చేసేటప్పడు 13 దేశాలు కొన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. ఒక్కో దేశం తుపానుకు పేరు ప్రతిపాదించడానికి ప్రామాణికం పాటిస్తుంది. ఒకసారి వినియోగించిన పేరును మళ్లీ వాడకూడదు. ఈ పేర్లు ఏ రాజకీయ పార్టీని, మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా ఉండకూడదనే ప్రధాన నిబంధన. పేరు మరీ కరకుగా, క్రూరంగా కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ సులభంగా పలికేలా పదాలతో.. నిమిది అక్షరాలను మించి ఉండకూడదు. ఖరారు చేసిన పేరును ప్రకటించే సమయంలోనూ ఒకసారి సమీక్షించుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు వాతావరణ శాఖ అధికారులు.
ఒకప్పుడు తుపానుకు ఎలాంటి పేరు ఉండేది కాదు, ఫలానా సంవత్సరంలో తుపాను అంటూ పిలిచేవారు. తుపాను వాతావరణం ఏర్పడినప్పుడల్లా దాన్ని అదే పేరుతో పిలవడం వల్ల తికమకపడే అవకాశం ఉంది. ఇలా ఒక్కో తుపానుకు ఒక్కో పేరు పెడితే డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు, మీడియాకు, సాధారణ ప్రజలకు ఇది ఫలానా తుపాను అని గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఆ పేరుతో ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ నిపుణులు.
Hi Please, Do not Spam in Comments