కథ - గుణాఢ్యుడి కథలు వింటూ శోకించిన పశుపక్ష్యాదులు - A to Z 2512

HIGHLIGHTS

గుణాఢ్యుడి కథలు వింటూ శోకించిన పశుపక్ష్యాదులు.
...........................................

అందుకు ప్రతి ప్రతిజ్ఞగా శర్వవర్మ " ఓ గుణాఢ్యా ఆరునెలలకాలం లోపల నేను చక్రవర్తికి సంస్కృతం నేర్పకపోతే నీ పాదరక్షలను పన్రెండు సంవత్సరాల కాలం పాటు నెత్తిమీద మోసుకొని తిరుగుతానని శపథం చేశాడు.

శర్వవర్మ పట్టుదలతో కార్తికేయుని ఉపాసించి కాతంత్ర్య వ్యాకరణం/కాలాప వ్యాకరణాన్ని పొంది ఆరునెలలకాలంలోనే రాజును సంస్కృతంలో పరిపూర్ణుని చేస్తాడు. ప్రతిన ప్రకారం గుణాఢ్యుడు సంస్కృత, ప్రాకృత, దేశీభాషలను చివరికి ప్రతిష్ఠానపురాన్ని వదిలేసి వింధ్యాటవికి వెళ్ళిపోయాడు.

ఆ అడవిలో గోదావరి తీరంలో మౌనంగా, ఒంటరిగా చాలాకాలం తిరిగాడు. కొంతకాలానికి ఆ అడవిలో పిశాచభాష మాట్లాడే ప్రజలతో అతనికి సహవాసం కుదురుతుంది. వారితోనే  నివాసముంటూ పైశాచిభాషను మాట్లాడటం, వ్రాయటం, కవిత్వంచెప్పడం నేర్చుకొన్నాడు.

అప్పటికే మానవజన్మలోనున్న వరరుచినుండి  శివుడుచెప్పిన కథలువిన్న కాణభూతి, తనకు శాపవిముక్తి కలగాలంటే తాను చెప్పబోయే కథలనువినే వ్యక్తికోసం వేచివున్నాడు, అతనే గుణాఢ్యుడు.కొంతకాలానికి కాణభూతికి గుణాఢ్యుడు అగుపడ్డాడు. కాణభూతి తాను వరరుచి వద్ద విన్నకథలన్నింటని గుణాఢ్యుడికి పైశాచిభాషలో వినిపించాడు.కాణభూతికి శాపవిముక్తి కలిగింది. గుణాఢ్యుడు తాను విన్న కథలన్నింటిని తన రక్తంతో భూర్జపత్రాలపై వ్రాసుకొన్నాడు.

ఇలా వ్రాసిన గ్రంథాలు ఏడు లక్షలైనాయట. తాను పిశాచ భాషలో వ్రాసిన గ్రంధాలన్నింటికి కలిపి బృహత్కథ అనేపేరు పెట్టాడు. శాతవాహనరాజు తాను వ్రాసిన కథలను విని సంతోషిస్తాడని, ఆదరిస్తాడని నమ్మి గుణాఢ్యుడు, శిష్యులచేత వాటిని రాజు వద్దకు పంపాడు. పిశాచభాషలో రక్తంతో వ్రాసిన గ్రంథాలను చూచి ఆ  శాతవాహనరాజు ఈసడించుకొన్నాడు.

తను ఎంతోకష్టపడి వ్రాసిన గ్రంథాలను రాజు తిరస్కరించినాడని గుణాఢ్యుడు శోకిస్తూ అగ్నిగుండం ఏర్పాటుచేసి పశుపక్ష్యాదులకు తనకథలను ఒక్కొక్కటిగా వినిపిస్తూ అగ్నిగుండంలో కాల్చివేయసాగాడు. పశుపక్ష్యాదులు మేతమేయకుండా నీల్లు తాగకుండా గుణాఢ్యుడు చెప్పే కథలను వింటూ గుణాఢ్యుడికి జరిగిన అవమానాన్ని స్మరించుకొంటూ విలపిస్తూ నీరసపడిపోయాయి.

కోటలో రాజుకు అనారోగ్యం కలిగింది. రాచవైద్యులు ఆహారాన్ని పరిక్షించి వంటకు వుపయోగించే మాంసం బాగా రసపుష్టిలేక నీరసపడిందని అందుకే ఈ మాంసాన్ని తిన్న రాజుకు అనారోగ్యం కలిగిందని చెప్పారు.రోజు మాంసం తెచ్చే వేటగాళ్ళను రాజు విచారించాడు. గుణాఢ్యుడి కథలు వింటూ నిద్రాహారాలు లేక జంతువులు పక్షులు నీరసించిపోయాయని అందుకే జంతుమాంసం రసపుష్టిలేకుండా ఉందని సెలవిచ్చారు.

రాజు ఆ కథలను తిరస్కరించి తప్పుచేశానని తెలుసుకొన్నాడు. వెంటనే గుణాఢ్యుడి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. తప్పును మన్నించమని రాజు ప్రార్థించాడు. అప్పటికే ఆరు లక్షల గ్రంధాలు అగ్నికి ఆహుతైనాయి. మిగిలిన లక్ష గ్రంథాలను రాజు శిష్యుల సాయంతో భద్రపరిచాడు
అదే మనకు ఇపుడు లభ్యమైన బృహత్కథవశేషం.

కాణభూతి వలన శివుడు చెప్పిన కథలను మాల్యవంతుడు(గుణాఢ్యుడు) పైశాచిభాషలో విన్నాడు కదా ! అందుకే గుణాఢ్యుడికి శాపవిమోచనం కలిగి కైలాసం వెళ్ళిపోయాడు.

ఇతి శ్రీమత్కుంతల జనపదేశ్వర ప్రతిష్ఠాన పత్తనాధీశ...... అను గాధాసప్తశతి వాక్యాలను బట్టి శర్వవర్మ, గుణాఢ్యులు శాతవాహన రాజైన హాలుని ఆస్థానంలో వుండేవారని కొందరి చరిత్ర, సాహిత్య విమర్శకుల ఊహా.
............................................................................................................ జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

No comments