20కుపైగా అధికారిక భాషల్లో అనువదించిన *ప్రతిజ్ఞ* ఎలా పుట్టిందో తెలుసా?

భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు..''అంటూ సాగే ప్రతిజ్ఞ భారతీయులందరికీ సుపరిచితమే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 20కుపైగా అధికారిక భాషల్లో అనువదించిన ఈ ప్రతిజ్ఞ ఎలా పుట్టిందో తెలుసా?
#Pledge #India 

జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయతకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది.

''భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు..''అంటూ సాగే ప్రతిజ్ఞ భారతీయులందరికీ సుపరిచితమే. రోజూ ఉదయం బడుల్లో పిల్లలందరూ దీన్ని గణగణమని చదివేస్తుంటారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 20కుపైగా అధికారిక భాషల్లో అనువదించిన ఈ ప్రతిజ్ఞ ఎలా పుట్టిందో తెలుసా?
జాతీయ గీతం జనగణమన రాసింది ఎవరని అడిగితే రవీంద్రనాథ్ ఠాగూర్ అని టక్కున చెప్పేస్తారు. జాతీయ జెండా రూపకర్త అనగానే పింగలి వెంకయ్య పేరు వెంటనే గుర్తుకువస్తుంది. మరి ఈ జాతీయ ప్రతిజ్ఞను రాసింది ఎవరు?
స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లకుపైనే గడిచినా ఈ ప్రశ్నకు సమాధానం చాలా కొద్ది మందికే తెలుసు.

పైడిమర్రి వెంకట సుబ్బారావు
పుట్టింది తెలుగు గడ్డపై
ఈ ప్రతిజ్ఞ పుట్టింది తెలుగులోనే. నల్గొండలోని అన్నెపర్తి గ్రామానికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1962లో దీన్ని రాశారు. దీని నేపథ్యాన్ని ఆయనపై పరిశోధన చేసిన రచయిత మందడపు రామ్ ప్రదీప్.. బీబీసీ తెలుగుకు వివరించారు. ఫర్‌గాటెన్ పేట్రియాట్ పేరుతో సుబ్బారావు జీవిత చరిత్రను రామ్ ప్రదీప్ రాశారు.
''చైనా-భారత్ యుద్ధ సమయంలో.. చైనా పౌరుల్లో దేశ భక్తి గీతాలు, ప్రతిజ్ఞలతో జాతీయవాదాన్ని నింపేవారు. అదే తరహాలో భారత్‌లోనూ స్ఫూర్తి నింపేందుకు సుబ్బారావు ఈ ప్రతిజ్ఞ రాశారు''.
''సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు తెన్నేటి విశ్వనాథానికి సుబ్బారావు మిత్రులు. వీరిద్దరికీ సాహిత్యంపై మక్కువ ఉండేది. సుబ్బారావు రాసిన ప్రతిజ్ఞను విశ్వనాథానికి చూపించారు. విశ్వనాథమే దీన్ని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి పూసపాటి విజయరామ గజపతి రాజుకు పంపించారు''.
''భిన్ననేపథ్యాలుండే విద్యార్థుల్లో ఐకమత్యం పెంచడమే లక్ష్యంగా అన్ని పాఠశాలల్లో ఈ ప్రతిజ్ఞ చేయించాలని గజపతి రాజు ఆదేశాలు జారీచేశారు''.
''తొలిసారిగా 1963లో విశాఖపట్నంలోని ఓ పాఠశాల విద్యార్థులతో ఈ ప్రతిజ్ఞ చదివించారు''.
''1964లో బెంగళూరులో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సదస్సు జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. వారే ఈ ప్రతిజ్ఞను అప్పటి కేంద్ర విద్యా శాఖ మంత్రి మహమ్మద్ అలీ కరీం చాగ్లాకు చూపించారు. ఆయనే దీన్ని 18 భాషల్లోకి అనువదింపచేశారు. స్కూల్ పిల్లలు దీన్ని పఠించేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు ఆయన సూచించారు.''

ఆయనకు ఆలస్యంగా తెలిసింది..
విద్యార్థులందరూ రోజూ ఈ ప్రతిజ్ఞను చేస్తున్న విషయం సుబ్బారావుకు చాలా ఆలస్యంగా తెలిసింది. మరణానికి ఒక ఏడాది ముందు.. అంటే 1987లో ఆయన దీన్ని గుర్తించారు.
''అప్పటికే జిల్లా కోశాధికారి పదవి నుంచి ఆయన విరమణ పొందారు. మూడో తరగతి చదువుతున్న మా అక్క కూతురు దుర్గా రాణికి హోం వర్క్‌లో ఆయన సాయం చేసేవారు. ఒక రోజు పాఠ్యపుస్తకంపై ఉన్న ఈ ప్రతిజ్ఞను దుర్గ చదివేటప్పుడు ఆయన విన్నారు. అప్పుడే ఈ విషయం మాకు తెలిసింది''అని సుబ్బారావు తనయుడు పీవీ సుబ్రమణ్యం చెప్పారు.
అప్పట్లో పుస్తకాలపై ఈ ప్రతిజ్ఞ ఉండేటప్పటికీ దానికింద సుబ్బారావు పేరుండేది కాదు. ప్రతిజ్ఞను సుబ్బారావే రాశారని గుర్తించాలని ఆయన కుటుంబ సభ్యులతోపాటు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, తెన్నేటి ఫౌండేషన్, జన విజ్ఞాన వేదిక కృషి చేశాయి. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాశాయి.

గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం
సుబ్బారావుకు గుర్తింపు నివ్వాలని కోరుతూ 2012లో ప్రతిజ్ఞ 50వ వార్షికోత్సవాన్ని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక నిర్వహించింది. ’’విశాఖపట్నంలో కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
అప్పటి విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా హాజరయ్యారు’’అని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఛైర్మన్ శివ శంకర్ తెలిపారు.
అయితే, తొలిసారి సుబ్బారావుకు గుర్తింపు నిచ్చింది తెలంగాణ ప్రభుత్వమే. రాష్ట్ర అవతరణ అనంతరం ప్రముఖ తెలంగాణ కవుల సాహిత్యాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై ఇక్కడి ప్రభుత్వంపై దృష్టిపెట్టింది.
‘‘సిలబస్ మార్పుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. దీనిలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. ఆయన చొరవతోనే తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ప్రతిజ్ఞ రచయితగా సుబ్బారావు పేరు ముద్రించారు’’అని రామ్ ప్రదీప్ తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ ఐదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంపై సుబ్బారావు పేరు కనిపిస్తోంది.

ఆర్‌టీఐపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందన
కేంద్రం కూడా స్పందించింది
తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లోనూ సుబ్బారావు పేరును చేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి.
‘‘మేం తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో గంటా శ్రీనివాసరావుని కలిశాం. ఆయన చొరవతో కొన్ని పాఠ్య పుస్తకాల్లో సుబ్బారావు పేరు ప్రచురించారు’’అని రామ్ ప్రదీప్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ముద్రించిన పాఠ్య పుస్తకాలపై సుబ్బారావు పేరు కనిపిస్తోంది.
ఈ ప్రతిజ్ఞను ఎవరు రాసారో చెప్పాలని కేంద్ర హోం శాఖకు రామ్ ప్రదీప్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు కూడా పెట్టారు. దీనిపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) స్పందించింది. ప్రతిజ్ఞను రాసింది సుబ్బరావేనని స్పష్టీకరించింది.

Post a Comment

0 Comments