Responsive Advertisement

ప్రియమైన నాన్నకు,మీ చిన్నమ్మాయి స్నేహ వ్రాయునది..

ప్రియమైన నాన్నకు,

మీ చిన్నమ్మాయి స్నేహ వ్రాయునది..

అందరూ ఈరోజు తండ్రి దినోత్సవం అంటోంటే నాక్కొంచెం వింతగానే ఉంది నాన్నా.. 

ఈ దినోత్సవాల మీద ఆసక్తిలేక పరిస్థితులు అనుకూలించక చిన్నప్పట్నుంచీ ఓ రకమైన నిర్లిప్తతతో బతికేశాగానీ ఇప్పుడు మీకు శుభాకాంక్షల్ని మనస్ఫూర్తిగా తెలుపడానికి ఉత్తరం కంటే వేరే ప్రత్యమ్నాయం దొరకలేదు.. అందుకే ఇలా..

జేబులో డెబ్భైరూపాయల పిసరంత ధైర్యంతో, చేతిలో ట్రంకుపెట్టె సంసారంతో ముగ్గురు చిన్నారికూతుళ్ల బాధ్యతని మోసుకుంటూ నగరంలోకి 1980లో అడుగుపెట్టిన నువ్వు యే రోజు నాన్నా మమ్మల్ని మహారాణులుగా పెంచింది..?

బారెడు సంసారానికి నీ చవకైన హోమియోపతి వైద్యంతో వచ్చే జానెడు జీతం యే మూలకి..? చాలీచాలనీ జీవితాలు.. చిరుగుల సర్దుళ్ళు.. ఇవే కదా జీవితమంతా..!!

టిఫిన్ల వైపు ఆశగా చూస్తే పొద్దున్నే చద్దన్నమే బలమన్నావ్.. ఉన్నదాంట్లో రాజీపడి బతకాలన్నావ్.. ఏదీ అతిగా ఊహించుకోవద్దన్నావ్.. పేరు బదులు నాలుగురుపాయలు సంపాదించవచ్చు కదా నాన్నా అంటే తృప్తిని మించిన సంపద లేదని ఆ వయసుకి అర్ధంకాని సమాధానాలతో సరిపెట్టావ్.. 
అమ్మాయిల్ని అపురూపంగా, యేడుమల్లెల ఎత్తుగా పెంచే మా స్నేహితురాళ్ళ తండ్రుల్నిచూసేదాన్ని తప్ప అమ్మాయైతే ఏంటి, అబ్బాయైతే ఏంటి ఇద్దరూ ఒక్కటే అని నీలాగా సమానదృష్టితో పెంచిన వింత తండ్రివి నువ్వొక్కడివే కనబడ్డావ్ నాన్నా అప్పట్లో..
ఎనిమిదో తరగతి చదువుతున్న ఆడపిల్లల్ని కరెంట్ బిల్లులు కట్టమని, రేషన్ సరుకులు తీసుకురమ్మని మగాళ్ల మధ్య క్యూలైన్లలో నించోబెడుతుంటే ఆ గుచ్చే చూపులు, తాకే చేతుల మధ్య నిన్నెన్నిసార్లు తిట్టుకున్నామో తెల్సా నాన్నా మేం..?

నీతో చెప్పుకోలేని ఇలాంటి ఇబ్బందులతో సతమతమవుతూ మాకెందుకు ఇలాంటివి చెప్తున్నావని అమ్మ దగ్గర విసుక్కుంటే ‘కూతురైనా, కొడుకైనా మీరే.. మీకు అన్నీ తెలియాలి.. మనపనుల కోసం వేరేవాళ్ళ మీద ఆధారపడితే ఎట్లా’ అంటూ ఎక్కడ్నించో వచ్చి మెల్లగా దాటవేసేవాడివి..!!

ఆ సమయానికి కోపం, ఆవేశం చాలాసార్లు వచ్చాయి.. మన పరిస్థితిని మేం ముగ్గురం చాలాసార్లు తిట్టుకున్నాం కూడా.. నువ్వు మాత్రం ఎప్పట్లానే పెద్దక్క జడలో నందివర్ధనంలాగా నవ్వేవాడివి.. అదేం నవ్వు నాన్నా నీది.. మేం అలా అగ్నిశిఖల్లా మండిపోతుంటే మంచుముక్కలాగా అంతా చల్లగా ఎలా నవ్వగలవు అసలు..?

బహుశా అందుకేనేమో..

మాకింకా ఉక్రోషం ఎక్కువైపోయేది.. చాలీచాలనీ చిరుగుల పరదాలోంచి గెలుపనే రంగులతివాచీ మీద పైకెగరాలనే కాంక్ష తప్ప వేరే యే కోరికలు కలుగలేదు. చూపులు, తాకిళ్ళని చెప్పుదెబ్బలుగా మార్చాలనిపించింది తప్ప లోపలకి పరిగెత్తాలనిపించలేదు.. 

అక్కచెల్లెళ్ళ ఒకరికొకరం చేయి చేయి పట్టుకుని ఒక్కటిగా నిలిచాం.. తోడుగా పరిగెట్టాం.. కలిసి పడ్డాం.. అందరం  గెలిచాం..
ఇప్పుడు ప్రపంచంలో యే మూలకెళ్లినా బతికెయ్యగల స్థైర్యం, నెట్టుకురాగల వ్యవహారజ్ఞానం, ఎలాంటిచోటైనా నిలబడగల నిబ్బరం అలవడ్డాయి..

లోకానికి ఆశ్చర్యం ఎక్కువ కాబట్టి కనకరత్నేశ్వర్రావుగారి అమ్మాయిలు వొట్టి మగరాయుళ్ళని అక్కడక్కడా తీర్పులిచ్చేశారేమో గానీ.. ఈ పోటీప్రపంచంలో ఇప్పుడు తెలుస్తోంది నాన్నా ఆ లక్షణాలు మాకెంత ఉపకరిస్తున్నాయో..
జీవితమంటే పూలబాటో, ముళ్లబాటో అని కాకుండా పోరాటం అని ఆ వయసుకే అర్ధమయ్యేలా చేశావ్ నాన్నా.. మెత్తగా ఉంటూనే ఎలా నెగ్గుకురావాలో నేర్పించావ్.. కానీ నిన్నే అర్ధం చేసుకోలేకపోయాం.. 
కోరి వచ్చిన సంబంధమైనా సరే నా ఇష్టాయిష్టాలు కనుక్కుని మరీ పెళ్లిచేశావ్.. నీ పెంపకం మీద నమ్మకమో లేక నా తెలివితేటల మీద ధైర్యమో తెలియదుగానీ.. అప్పగింతలప్పుడు సారె పెట్టకుండా పంపుతున్నా కదాని నోరు పెట్టుకుని బతకమని చెప్పలేదు నాన్నా నువ్వు.. నీ కళ్ళలో నమ్మకం, స్పర్శలో అనునయం మాత్రం చాలా చెప్పాయి.. 

వీలైనప్పుడు నలుగురికి పెట్టమన్నావ్ కాబట్టే నీ ఇన్స్పిరేషన్తో  ఇప్పుడు నేను నెలకొల్పిన ఈ ఫుడ్ ఇండస్ట్రీలో పదిమందికి అమ్మగా వచ్చిందానితో ఇంకో నలుగురికి పెట్టగలుగుతున్నాను..! అప్పట్లో అర్ధం కాని తృప్తి తాలూకూ ఆనందం ఇప్పుడు పొందుతున్నాను.. ఇంతకంటే ఏం ఆశలు లేవు నాన్నా ప్రస్తుతం.. నా పిల్లల్ని కూడా నువ్వు పెంచినట్టే పెంచాలన్న కోరిక తప్ప..!

అవును నాన్నా.. నువ్వే రైట్ ..!!

దాసీసేవల మధ్య పగలుకి రేయికి తేడాతెలీని మహారాణిగా కాకుండా ఏరోజుకారోజు ధైర్యంగా ముందడుగు వేసే సుశిక్షితురాలైన స్వతంత్ర యోధురాలిగా పెంచిన నాన్నకు ప్రేమతో.. 

ఇట్లు 
కనక రత్నేశ్వర్రావుగారి చిన్నమ్మాయి స్నేహ రత్నేశ్వర్రావు..

సేకరణ.....

Post a Comment

0 Comments