Responsive Advertisement

కథ - అహంకారం

*అహంకారం*
అహంకారంతో హుంకరించడం మనిషి దౌర్బల్యం. కొద్దిపాటి విజయానికే తమంతటివారు లేరన్న అహంకారంతో కన్నుమిన్నుగానక ప్రవర్తించేవారు కొంతకాలం విజయపథంలో పయనించినా- ఎదురుదెబ్బ తినకమానరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నవారే ఉన్నత స్థానంలో మన్ననలందుకుంటారు.

అహంకారం
ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద వందిమాగధులు జేజేలు పలుకుతుండగా, దర్పమంతా ప్రదర్శిస్తూ అమరపురికి వెడుతుంటే- దుర్వాస మహర్షి ఎదురవుతాడు. ఆయన మహేంద్రుడికి ఒక మాలను కానుకగా ఇచ్చి అది విజయమాల అని, అది ఇంద్రుడి మెడలో ఉన్నంతవరకు ఏ రాక్షసుడూ దరిదాపులకు రాడని చెబుతాడు.

అహంకారంతో మిడిసిపడుతున్న ఇంద్రుడు ఆ మాలను తీసుకుని తాను ధరించకుండా నిర్లక్ష్యంగా ఐరావతం మీదకు విసురుతాడు. ఐరావతం ఆ మాలను తొండంతో అందుకుని చిందరవందర చేసి కింద పడేసి కాళ్లతో తొక్కుతుంది. ఇది గమనించిన దుర్వాస మహర్షి ఇంద్రుడి పొగరుకు కోపించి, అతడి రాజ్యం పరాధీనమవుతుందని శపిస్తాడు. ముని శాపం ప్రభావంతో రాక్షసులు దేవలోకం ముట్టడించి మహేంద్రుణ్ని ఓడించి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తారు. ఉపేంద్రుడు శ్రీహరిని శరణువేడటం తరవాతి కథ.

సూదిమొన మోపినంత స్థలాన్ని కూడా పాండవులకివ్వనని అహంకారంతో ప్రవర్తించిన దుర్యోధనుడు చివరికి ఏమయ్యాడో అందరికీ తెలిసిందే.

దక్షుడు యాగం తలపెట్టాడు. దక్షయజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించి, చిన్నచూపుతో తన అల్లుడైన పరమశివుడికి ఆహ్వానం పంపడు. అయినా భర్త అనుమతితో పుట్టింటికి వెళ్తుంది జగన్మాత. కూతుర్ని ఆదరించక అహంకారంతో పరమశివుణ్ని నిందిస్తాడు దక్షుడు. తన భర్తను తూలనాడిన తండ్రిపై ఆగ్రహించిన సతీదేవి హోమగుండంలో తనువు చాలిస్తుంది. విషయం తెలిసిన పరమేశ్వరుడు ప్రళయతాండవం చేస్తూ- తన జటాజూటంలోని ఒక జట పెరికి నేల పైకి విసురుతాడు. ఆ జట నుంచి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. దక్షవాటికలో ప్రవేశించిన వీరభద్రుడు దక్షుణ్ని సంహరిస్తాడు.

రావణుడి అహంకారం, హిరణ్యకశిపుడి అహంకారం వారి పతనాలకు దారితీశాయి. ఈ కథలు చదివితే అహంకారం రాక్షసాంశ అనిపిస్తుంది.

మనిషి తాను ఎందులో గొప్పవాడినని ప్రశ్నించుకోవాలి. భగవంతుడిచ్చిన గాలి, నీరు, ఆహారం, ఔషధాలను వినియోగించుకుని బతుకుతున్నందుకు ఆ దేవదేవుడికి కృతజ్ఞుడై ఉండాలి. భూమిలోని నిక్షేపాలు అనుభవిస్తున్నందుకు భూమాతకు రుణపడాలి. సూర్యచంద్రులు, మేఘాలు లేకపోతే మనిషి ఉనికే ప్రశ్నార్థకం. ఏ క్షణాన రాలిపోతాడో తెలియని మనిషి అహంకరించడం మూర్ఖత్వమే కదా!

కంటికి కనిపించని వైరస్‌ మహామేధావిననుకునే మనిషిని భయభ్రాంతుణ్ని చేసి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయగలగడం సృష్టి విచిత్రం. తనకు అతీతమైన మహాశక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తోందని అర్థం చేసుకున్నప్పుడు అహంకారానికి తావుండదు.


భగవంతుణ్ని నమ్ముకున్నవాడు సంయమనంతో మనగలుగుతాడు. తన ఆస్తి, పదవి భగవదనుగ్రహమే అని గ్రహించగలిగినవాడు నిగ్రహంతో మెలగుతాడు. తన పదవిని ఇతరుల సేవకు వినియోగించగలవాడికి పదవి అలంకారమవుతుంది. మహాజ్ఞానులు తమ జ్ఞానం సరస్వతీ కటాక్షమని భావిస్తారు.

దురహంకారం దుర్జన లక్షణమని గ్రహించి మానవత్వంతో మనగలగడమే మనిషి కర్తవ్యం. సంతృప్తికర జీవనమే సంతోషదాయకం. తాను అందరికంటే గొప్పవాడినని కాక అందరిలో ఒకడిని అనుకోవడమే అసలైన జీవన విధానం!

Post a Comment

1 Comments

  1. కధలు , కధ తర్వాత మీరిస్తున్న విశ్లేషన రెండూ కూడా చాలా బాగున్నాయండి.
    Thank You. Chakraapani A

    ReplyDelete