Responsive Advertisement

తులసి మహత్యం

 తులసి మహత్యం🙏

బిల్వము శివుని కెట్లు ప్రియమో అట్లే విష్ణువునకు తులసి ప్రియమైనదిగా నెన్నబడినది. హిందువుల ప్రతి ఇంటిలోను గృహదేవతగా తులసి మొక్క ఆరాధింపబడుచున్నది.
అట్టితులసి మహిమ యపారము.
వేద పురాణ శాస్త్రములన్నియు
దీని మహిమను వెనోళ్ల చాటుచున్నవి.
తులసి దర్శనమున అన్ని పాపములు నశించును. అర్చనాదులచే
సకల కోర్కెలీడేరును.
ఇది భూలోకపు కల్పతరువు.
శ్లోకం:
తులసి స్పర్శనం స్నానం
తులసి స్పర్శనం తపః౹
తులసి స్పర్శనం మంత్రః
తులసి స్పర్శనం వ్రతమ్౹౹
ప్రదక్షిణం కృతం యేన
తులసి మునిసత్తమ౹
కృత ప్రదక్షిణ స్తేన
విష్ణుస్సాక్షాన్నసంశయః౹౹
తులసి పత్రములో అగ్రమున బ్రహ్మ,
నడుమ కేశవుడు,కాండమున శివుడు, శాఖలలో అష్టదిక్పాలకులుందురు.
లక్ష్మీ, గాయత్రీ,సరస్వతీ, శచీదేవుల వాసస్థానమే తులసీ పత్రము. తులసి సత్త్వగుణము యొక్క స్వరూపము.
పత్రమునందు ,కాష్ఠమునందు,
గంధమునందు,తుదకు దాని పాది(మూలము)లోని మట్టిలో కూడ
సత్త్వగుణము నిండియుండును.
తులసి సంపర్కముచేత మనకు సత్త్వగుణము లభించును.
తులసి వాసన మనలోని
తమోగుణమును పోద్రోలును.
తులసి జన్మవృత్తాంతము మహిమనుగూర్చి దేవీభాగవతములో,పద్మపురాణములో
స్కాందములో,అగస్త్య సంహితలో,
బ్రహ్మ వైవర్తములో,గణేశఖండములో
హరిభక్తవిలాస ధృతవిష్ణుయామళములో,
ప్రహ్లాద సంహితలో,
విష్ణుధర్తోత్తరములో,బృహన్నారదీయములో,గర్గ సంహితలో,
స్మృతి సరోజములో,
శ్రీమహాభాగవతములో,
సాధనకృతాంజలిలో వివరింపబడినది.మఱియు రామరహస్యోపనిషత్తు,
మత్స్య సూక్తము,షోడశపటలము మొదలగు
వానియందు తులసి మాహాత్మ్యమున్నది.
తులసి-భౌతికశాస్త్ర విజ్ఞానం🙏
తులసితో నానాప్రకారముల చికిత్సలు చేసిన నిమ్మళించని రోగములు నివారింపబడునని విజ్ఞాన శాస్త్రములు, చికిత్సావిధానము తెలుపుచున్నది.తులసి పాదులోని మృత్తికను శరీరమునకు పూసుకొని
ఆ మట్టినే నియతముగ కొంత కొంత తినుచువచ్చిన సమస్త వ్యాధులు నివారణమగును.డాక్టర్ నళినీనాథ్ యొక పత్రికలో నీ విషయమును తెలిపియున్నారు. ఒకానొకప్పుడొక పాశ్చాత్యోన్నతోద్యోగి ఇంటికి తాను పోయినపుడు అపుడచట తులసి మొక్కనుగాంచి ఆయనను ప్రశ్నించగా
ఆయన చెప్పిన విషయములివి.
వైజ్ఞానిక భాషలో తులసి చెట్టులో నున్నంత విద్యుచ్ఛక్తి ఏ ఇతరములైన చెట్టులోను లేదు.తులసి చెట్టునకు నాలుగు వైపుల రెండు వందల గజముల వరకుగల వాయువు శుద్ధిగానుండును. మలేరియా, ప్లేగు,క్షయ మున్నగు రోగములను కలుగజేయు సూక్ష్మ జీవులను తులసి
వాసన ధ్వంసముచేయును.తులసి యుండు చోట అంటుజాడ్యములు దరిజేరవు.తులసి గాలి పీల్చుచు,తులసి వనములో దినమున కొక పర్యాయము తిరుగువారిని
ఏ యంటురోగములునంటవు.
తులసి మాలను ధరించిన మానవ శరీరమునందు విద్యుచ్ఛక్తి స్థిరముగా నుండును. రోగ క్రిములు ప్రవేశింపవు.ఆరోగ్య జీవియై దీర్ఘకాలము ధర్మాచరణుడై బ్రతుకును.
తులసి రసము సంధిరోగములను,సన్నిపాత జ్వరములను బాపును.తులసి రసముచే శరీరములోని రక్తము శుద్ధియగును.ఇది కుష్టురోగులకు ఉపకారియై తులసి ఆకులను తినుటచేత కుష్టు నివారణ యగును.
తులసి యున్నచోట దోమలు చేరవు.పిడుగు పడిన వానికి తక్షణమే తులసి యాకురసముతో మర్దించిన మైకమువీడి స్వస్థత కలుగును .తులసి తినుటచే దేహమునకు వర్ఛస్సు కలుగును.ఉబ్బసముపోవును.
ఎక్కిళ్లు,శ్వాసకాస,విషదోషము,
పార్శ్వశూలనిమ్మళించును.
వాతకఫములు వాయును.తులసి వేరు వీర్యవర్థకము.చిత్తైకాగ్రతకు దోహదము కలిగించును.సాత్త్వికభావమలవడును.
ఇంద్రియములన్నియు శాంతి నొందును.
పూర్వస్మృతి గల్గును. దీనివలన ఆనందమలవడును. తులసికావనములో నుంచిన శవము ఏనాటికిని చెడక చాలాకాలము వరకు నిలువయుండును.ఇది దీని ప్రత్యేకత. జపానులో దీని ప్రాధాన్య మెక్కువ.
ఇట్టి వైజ్ఞానిక విషయములను
మన ప్రాచీనులు గ్రహించి
బిల్వము, తులసి, వేప,ఉసిరిక మున్నగునవి దేవతార్చనకుపయుక్తములుగ నిలిపి మన దైనందిన స్వాస్థ్యజీవనమునకు,
లోక కళ్యాణమునకు,సమాజాభివృద్ధికి
తోడ్పడిరి.
తులసీ ప్రార్థన🙏
శ్లో:యన్మూలే సర్వతీర్థాని
యన్మధ్యే సర్వదేవతాః౹
యదగ్రే సర్వ వేదాశ్చ
తులసీ తాం నమామ్యహమ్౹౹
శ్లో:బృందా బృందారణీం
విశ్వపూజితాం విశ్వపావనీమ్౹
పుష్పసారాం నందినీం చ
తులసీం కృష్ణ సేవితమ్౹౹
వ్రేళ్లయందు సర్వతీర్థములను,
మధ్యభాగమున సర్వ దేవతలును, కొసయందు
సర్వ వేదములను గలిగిన తులసిని బృంద,బృందారణి,విశ్వపూజిత,
విశ్వపావని,పుష్పసార నందినీతులసి,కృష్ణ సేవిత యను ఎనిమిది నామములతో
పూజించిన వారికి అశ్వమేధయాగ
ఫలము లభించును. రుద్రయామళ తంత్రములో తులసిని సేవించుటకీ
క్రింది మంత్రము చెప్పబడినది.
శ్లో:ఓం విష్ణుప్రియే మహామాయే
కాలజాల విదారిణీ౹
తులసీ మాం సదా రక్షా
మా మేక మమరం కురు౹౹
పై మంత్రము నుచ్చరించుచు తులసిని సేవించిన దీర్ఘాయుష్యము కలుగును.
*తులసీ ప్రాశస్త్యము*
శ్లో:తులసీ కాననం యత్ర యత్ర
పద్మ వనాని చ౹
సాలగ్రామ శిలా యత్ర యత్ర
సన్నిహితో హరిః౹౹
తా౹౹తులసీవనమెచ్చటగలదో ,
పద్మవన మెచ్చట గలదో ,
సాలగ్
రామశిల యెచ్చట గలదో
శ్రీహరి యచ్చట సన్నిహితుడై
యుండును.
శ్లో:తులస్యా రోపితా సిక్తా
దృష్టా స్పృష్టా చ పాలితా౹
ఆరోపితా ప్రయత్నేన
చతుర్వర్గ ఫలప్రదా౹౹
తులసీ విపిన స్యాపి
సమంతాత్పావన స్థలం౹
యోజన త్రిత్రయం జ్ఞేయం
గాంగేయ స్యేవపాంథసః౹౹
తులసీ కాననం చైవ
గృహేయస్యావ తిష్ఠతే౹
తద్గృహం తీర్థంభూతం హి
నాయంతి యమకింక రాః౹౹
తా౹౹తులసిని నాటినను,నీరు పోసినను,తాకినను,పోషించినను,
ధర్మార్థకామమోక్షములు గల్గును. తులసి యున్నచోటు పావనమైనది.తులసి తోటకు మూడామడల పరిసర ప్రాంతమంతయు పావనస్థలముగా భావించవలెను.
శ్లో:అనన్యదర్శనాః ప్రాతర్యేపశ్యంతి
తపోధన౹
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని
న సంశయః౹౹
ఉదయము నిదురలేచిన వెంటనే తులసిని జూచినచో సమస్త తీర్థములు చూచిన ఫలము లభించును.
శ్లో:తులసీ సన్నిధౌ ప్రాణాన్యేత్యజంతి
మునీశ్వర౹
న తేషాం నిరయక్లేశః ప్రయాంతి
పరమం పదమ్౹౹
తా౹౹తులసి సమీపమున బ్రాణముల నెవరు విడుతురో వారికి నరకప్రాప్తిలేదు
వారు పరమపదమగు వైకుంఠంమునకుఁబోవుదురు.
తులసీ దళములను స్త్రీలు కోయతగదు.పురుషులు కోయవలెను.తులసిని కోయునపుడు క్రింది శ్లోకమును బఠించుచు కోయవలెను.
శ్లో:తులస్యమృత జన్మాసి సదా త్వం
కేశవప్రియే౹
కేశవార్థం లునామి త్వాం
వరదాభవ శోభనే౹౹
శ్లో:మోక్షైక హేతోర్ధరణి ప్రసూతే
విష్ణోస్తమ స్తస్యగురోః ప్రియతే౹
ఆరాధనార్థం పురుషోత్తమస్య
లునామిపత్రం తులసీ క్షమస్వ౹౹
శ్లో:ప్రసీద మమదేవేశి ప్రసీద
హరివల్లభే౹
క్షీరోదమదనోద్భూతే
తులసీ త్వం ప్రసీదమ్౹౹
తులసి-ఒక దివ్యౌషధం🙏
తులసి మహౌషధి,సర్వవ్యాధి నివారిణి,విషఘ్ని,
శ్వాస కాస,క్షయాపస్మారకుష్ఠ్వాది రోగ నివారణ శక్తి గలది. నిత్యము తులసి దళములను భక్షించువారికే రోగములు
రావనుటలో నతిశయోక్తి లేదు.
తులసి కఫఛ్ఛేదిని,జఠరాగ్ని వివర్థని,సూక్ష్మరోగక్రిములను తులసి
నాశనము చేయును.
1.తులసి యాకులు,మిరియాలు నమిలిన ఎదురు గుక్కలు (Tonsils)
బాధింపవు.తిరిగి పెరుగవు.
2.తులసి పసరున నింగువనూరి తేలు కుట్టినచోట రాచిన నొప్పి యుపశమించును.
3.చిగుళ్ల వాపు,నోటి దుర్వాసన,తులసియాకులను నమిలి నీటితో పుక్కిళించుటచే నివారించును.
4.తులసి బీజములు భక్షించి,నీరు తాగిన కొన్ని దినములవరకు ఆకలి నరికట్టవచ్చును.
5.తులసి బీజములు నీటిలో వేసి చక్కరగలిపి సేవించిన జల్లదన మిచ్చును.తులసీ లక్షణములుగల రుద్రజడ లేక కమ్మగగ్గెర బీజములను మహమ్మదీయులు షర్బత్తులందు చేర్తురు.
6.తులసీ బీజములను తమలమునందు చేర్చి సేవించిన వీర్యము స్తంభించును.ఇది సిద్ధప్రక్రియ.
తులసి యందు అనేక రకములున్నవి.
1.రామతులసి 2.లక్ష్మీ తులసి
3.కృష్ణ తులసి 4.నిమ్మ తులసి 5.కర్పూర తులసి( కంటకీ తులసి మొదలగునవి)అన్నిటికంటే
కృష్ణ తులసి శ్రేష్ఠమైనది.🙏

Post a Comment

0 Comments