తెలుసుకుందాం

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యానారాయణ Kavisamrat Viswanadha Satyanarayana 10-09

 నేడు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యానారాయణ గారి జయంతి  10-09


తెలుగు సాహిత్యరంగంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, చరిత్ర సృష్టించిన ఎందరో మహానుభావులు వున్నారు. కేవలం తెలుగుసాహిత్యానికే తమ జీవితాన్ని అంకితం చేసినవారు కూడా ఎందరో వున్నారు. అయితే విశ్వనాథ సత్యానారాయణను ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యక్తిగా అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే.. ఆయన చేపట్టని సాహిత్యప్రక్రియ అంటూ ఏదీ లేదు... కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు.. ఇలా అన్నింటిలోనూ ఆయన పాండిత్యం, ప్రతిభలు జగమెరుగినవి. అందువల్లే.. 20వ శతాబ్దంలో ఆంధ్రసాహిత్యానికి ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యానికి ఆయనే పెద్ద దిక్కుగా భావిస్తారు. అంతెందుకు.. తెలుగు అభ్యుదయ కవి అయిన శ్రీశ్రీ కూడా విశ్వనాథను ‘‘మాట్లాడే వెన్నముక’’గా వర్ణించారు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఈయన.. కవి సామ్రాట్ బిరుదును పొందారు.


జీవిత చరిత్ర :


1895 సెప్టెంబరు 10వ తేదీన కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో నివాసమున్న శోభనాద్రి, పార్వతమ్మ దంపతులకు విశ్వనాథ జన్మించారు. ఈయన భార్య వరలక్ష్మమ్మ.  నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఆయన... తరువాత పై చదువులను బందరు పట్టణంలో అభ్యసించారు. బి.ఎ. తరువాత ఆయన చదవిన బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరారు. ఉద్యోగం చేస్తుండగా మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించారు. తరువాత మహాత్మా గాంధీ నడుపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు. అయితే ఆ తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడ లోని అప్పటి ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన వివిధ హోదాల్లో పని చేసారు. 1957 లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించారు.


సాహితీ ప్రస్థానం


1916 నుంచి విశ్వనాథ తన రచనా ప్రస్తానాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరంలో ఆయన ‘‘విశ్వేశ్వర శతకము’’ రచించారు. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ‘‘ఆంధ్రపౌరుషం’’ రచించారు. అలా ఒక్కొక్కటిగా రాసుకుంటూపోయిన ఆయన.. 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు ఆయన వందల్లో రచనలను అందించారు. 1961 లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించారు. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఆయన రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి - ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి.


పురస్కారాలు


1. ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సమ్రాట్" బిరుదుతో సత్కరించింది.


2. 1964లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.


3. 1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడ లో "గజారోహణం" సన్మానం జరిగింది.


4. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.


5. 1962లో ‘‘విశ్వనాథ మధ్యాక్కరలు’’ రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.


6. 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.


7. 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారంతో గౌరవించింది.


8. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన రాసిన ‘‘రామాయణ కల్పవృక్షం’’నకు ‘‘జ్ఞానపీఠ పురస్కారం’’ అందింది.

Post a Comment

0 Comments