Responsive Advertisement

వేలుగాడువేలుగాడు
ఒక ఊరిలో రంగమ్మ, మల్లయ్య అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. పెళ్ళయి చాలా
కాలం గడచినా వారికి సంతానం కలగలేదు. ఊరిలో మధ్య దొంగతనాలు ఎక్కువయ్యాయి.
ప్రతీ రోజూ ఏదో ఒక ఇంటిమీద దొంగలు పడి నానా భీభత్సం సృష్టించేవారు. రంగమ్మనుకూడా
దొంగల భయం రోజూ వెంటాడేది. ఒక్క కొడుకైనా ఉండి ఉంటే మాకెంత తోడుగా ఉండేవాడో కదా
అని తెగ బాధపడేది రంగమ్మ.
పిల్లలు కలగాలని రంగమ్మ ఎప్పుడూ శివుణ్ణి పూజించేది. పిల్లలు కావాలని ఆలోచన వచ్చినప్పుడల్లా
తన చిటికన వేలిని చూసుకొని , వేలంత కొడుకైనా కలిగితే ఎంత బాగుండేదో అని భాధపడేది.
ఆమె పూజలకు మెచ్చి శివుడు, ఆమె కోరిక ప్రకారమే ఆమెకో చిటికెనవేలంత కొడుకును ఇచ్చాడు!
దంపతుల సంతోషానికి మేరలేదు. వాడికి వేలుగాడు అని పేరుపెట్టుకొని గారాబంగా
పెంచుకోసాగారు.
ఒకనాడు మల్లయ్య తోటకి పనికి వెళ్ళాడు. మల్లయ్య వెళ్ళిన కాసేపటికి రంగమ్మ ఆయనకు చద్ది
తీసుకపోవడానికని బయలుదేరింది. అది గమనించిన వేలుగాడు అమ్మా! నాన్నకు నేను చద్ది తీసుక
వెళతానే అన్నాడు. అప్పుడేమో రంగమ్మ, నువ్వు చూస్తే చద్దిమూటంత కూడా లేవు, చద్దినెలా
తీసుకెళతావు? అని అడిగింది. అప్పుడు వేలుగాడు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అటుగా ఒక
ఎద్దుల బండి పోవడం గమనించిన వేలుగాడు, అమ్మా! మన ఎద్దులను బండికి కట్టు, బండిలో
తీసుకెళతాను అన్నాడు బాధ్యతగా. అప్పుడు రంగమ్మ సంతోషించి నువ్వున్నది వేలంతేరా నాన్నా!
కానీ నీ బుర్ర మాత్రం కొండంతరా బాబూ అని వాడిని నిమిరి, చద్దిని బండిమీద పెట్టి బండి కట్టి
పంపించింది.
వేలుగాడు పొలం దారి గుండా పోసాగాడు. ఇంతలో అటుగా నలుగురు దొంగలు వచ్చారు.
దూరంనుండి చూస్తే బండిలో ఎవ్వరూ కనిపించలేదు కానీ దగ్గరికి వెళ్ళాక వేలుగాడిని చూసి
ఆశ్చర్యపోయారు. నలుగురు దొంగలలో ఒకడికి వేలుగాడి రూపం చూడగానే ఒక ఆలోచన కలిగింది.
వాడు మిగిలిన దొంగలతో ఇలా అన్నాడు: ఒరేయ్! వీడయితే చాలా సులభంగా ఎవరింట్లో ఎంత
సొమ్ముండేదీ కనుక్కోగలడురా! అన్నాడు. వీడ్నిమనం తీసుకుపోతే మన పనికి వీడు చాలా
ఉపయోగ పడతాడు అని వాళ్ళంతా ఆశ పడ్డారు.
ఆలోచనేదో బాగుందే అనుకున్న దొంగల నాయకుడు కూడా, ఒరేయ్! వేలుగా, నువ్వు మాతో
వస్తావా? అని అడిగాడు.
అందుకు మన వేలుగాడు ఓఁ, వస్తాను, కానీ నేనిప్పుడు మా నాన్నకు చద్ది తీసుకు పోతున్నాను.
అక్కడ మా నాన్నను మీరడగండి. నాన్న ఒప్పుకుంటే వస్తాను. రండి, బండి ఎక్కండి! మా నాన్న
దగ్గరకు తీసుకు పోతాను అని వాళ్ళను బండిలోకి ఎక్కించుకున్నాడు. పొలాన్ని సమీపించాక,
అదిగో అక్కడ కనిపిస్తున్నాడే! ఆయనే మానాన్న. వెళ్ళి అడగండి అన్నాడు. అప్పుడు దొంగలు
వేలుగాని తండ్రి దగ్గరికెళ్ళి అయ్యా! మేము వేలుగాడిని కొనాలనుకుంటున్నాము. ఎంతకావాలో
అడగండి అని అడిగారు. అప్పుడు మల్లయ్య అయ్యో! లేదు,లేదు! నా ఒక్కగానొక్క కొడుకుని నేను
అమ్మదలుచుకోలేదు! అంటూ వేలుగాడ్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వేలుగాడు వాళ్ల నాన్న
చెవి దగ్గరికి వెళ్ళి ;నాన్నా నన్ను వీళ్లకు అమ్మెయ్యి. సాయంత్రం అయ్యే సరికి నేను ఇంటికి
చేరుకుంటాను అన్నాడు గుసగుసగా.
కొడుకు మాటలు విన్న మల్లయ్య వాడిని దొంగలకు ఐదువేల రూపాయలకు అమ్మేశాడు. దొంగలు
వేలుగాన్ని తీసుకొని ఊళ్ళోకి వెళ్ళారు. ఇదిగో వేలుగా! నువ్విప్పుడు ఎవరింటిలో ఎంత ధనం
ఉందో చూసిరావాలి అని చెప్పారు. సరేనని వేలుగాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా! దొంగలను
పట్టుకొనే సమయం వచ్చేసింది. అందుకు నాకు నీ సహాయం కావాలమ్మా అని అడిగాడు.
విషయమంతా చెప్పాడు. ఇద్దరూ కలసి ఒక పథకం తయారు చేశారు.
పధకం ప్రకారం బాగా ధనమున్న ఇంటిని ఒకదాన్ని దొంగలకు చూపాడు వేలుగాడు రాత్రికే
వాళ్ళు ఇంటిలో దోపిడీ చెయ్యాలనుకున్నారు. బాగా చీకటి పడ్డాక వేలుగాడు వాళ్లను ఇంటి
దగ్గరికి తీసుకుపోయాడు. దొంగలంతా మిద్దెపైనున్న గవాక్షం ద్వారా ఇంటి లోనికి ప్రవేశించారు.
వారలా లోనికి వెళ్ళగానే తలుపు వెనకనే ఉన్నరంగమ్మ చప్పుడు కాకుండా తలుపును తీసి
బయటకు వచ్చి, తలుపుకు బయటినుండి గొళ్ళెం పెట్టేసింది. పెరట్లోనుండి చూస్తున్న మల్లయ్య
ఇంటిపైకెక్కి గవాక్షాన్ని కూడా మూసేశాడు. ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు
వెంటనే వచ్చారు. ఊరికి పెద్ద బెడదయిన నలుగురు దొంగల్నీ పట్టి జైల్లో వేశారు. ఊరంతా
వేలుగాడ్ని మెచ్చుకొన్నారు. రంగమ్మనూ, మల్లయ్యనూ అభినందించారు.

Post a Comment

0 Comments