Responsive Advertisement

మృత్యుంజయ మహరాజు -- కరోనా కథ.

మృత్యుంజయ మహరాజు -- కరోనా కథ.
---------------------------------------------
ఒకానొప్పుడు కాశీరాజ్యాన్ని మృత్యుంజయుడనే మహరాజు పాలించేవాడు. మేధోశక్తి వీరత్వం సంస్కారం మంచితనం దయ కరుణ అనేగుణాల వలన ఈ మహారాజు జగద్విఖ్యాతుడైనాడు.

మృత్యుంజయ మహారాజు ఎంత మంచివాడో తెలివైన వాడో అంతే చాదస్తం కూడా ఉండేది.

పేరుకు తగ్గట్టుగా మృత్యువును జయించాలని అనేక ప్రయత్నాలు ప్రయోగాలు చేశాడు కాని ఏవి సత్ఫలితాలివ్వలేదు.

రాజు ఆస్థానంలోని కవులను పండితులను జ్యోతిష్కులను పురోహితులను సంప్రదించాడు పరిష్కారం అడిగాడు.
మృత్యువు అందరికి సమానమని సహజమని ఎవరు దానినుండి తప్పించుకోలేరని వారందరు ఏకకంఠంతో సెలవిచ్చారు.

అయినా మృత్యుంజ మహరాజు పట్టువదలలేదు.అనేక తాళపత్ర గ్రంథాలను తిరగవేశాడు.ఒక తాళపత్రంలో అశాకిరణం కనబడింది.అదేమిటంటే వరుసగా తొమ్మిది రోజులపాటు  బుుత్విక్కుల సాయంతో మృత్యుంజయ హోమం నిర్వహిస్తే  పరిష్కారమార్గం దొరుకుతుందని.

రాజు సంతోషపడిపోయాడు దేశవిదేశాల నుండి ద్వివేద త్రివేద చతుర్వేదాలలో తలలు పండిన బుుత్విక్కులను పిలవనంపాడు. వేదశాస్త్రబద్ధంగా కఠోర నియమనిష్ఠలతో ఎనిమిదనొక్కరోజు హోమం జరిపించాడు.

తొమ్మిదో రోజు యాగముగింపు సమయంలో మృత్యుదేవత ప్రత్యక్షమైంది. ఏం కోరికకావాలో కోరుకోమంది.

అమ్మా తల్లి మృత్యుదేవతా నాకు మరణం లేకుండా వరం ప్రసాదించమని ప్రార్ధించాడారాజు.

మృత్యుదేవత చిన్నగా నవ్వింది.
మహరాజా భూలోకంలో పుట్టిన ప్రతిప్రాణి గిట్టకమానదు.
మానవులకేమి మినహాయింపు లేదు.
నువ్వేమి అతీతుడవు కావు. నీకు మరణం తప్పదు.
మృత్యుంజయ హోమం ద్వారా నన్ను సంప్రీతురాలిగా చేశావు కాబట్టి నీ మరణాన్ని కొద్దికాలం ఆపగలను అంతేకాని నీకు మరణం లేకుండా చేయగలశక్తి నాకులేదు.

రాజు ఆలోచనలో పడ్డాడు.మరణం తప్పదన్నపుడు దానిని తప్పించుకొనే వుపాయం కొరకు ఆలోచించాడు.

బుర్రలో ఒక కిటుకు మెదిలింది.
అలాగే తల్లి, అయితే యమకింకరులు నాకోసం వచ్చినపుడు వారు నాకు కనబడేట్టుగాను వారినుండి దూరంగా తప్పించుకు పోవటానికి నా కాళ్ళకు అతీంద్రీయశక్తి కావాలని కోరుకొన్నాడు

మృత్యుదేవత తథాస్తు అంది. అయితే యమభటులు కనబడినపుడు అంత:పురాన్ని వదలొద్దని హెచ్చరించింది. మరుక్షణమే అతని కాళ్ళకు
ఎంతోశక్తి వచ్చినట్లైంది.

రాజు ఎంతో సంతోషంగా వున్నాడు. యమదూతలు కనబడగానే  దూరంగా పరువులెత్తి వారి బారి నుండి  ప్రాణాలను నిలుపుకోవచ్చని సంబరపడిపోయాడు.

ఆ రోజు రానే వచ్చింది. యమభటులు కనబడగానే మృత్యుంజయ మహరాజు ప్రాణభయంతో వణికిపోయాడు. వారినుండి తప్పించుకోటానికి  పరిగెత్తి పోయాడు.
 వీధులవెంటఅడ్డంగా పోయాడు.వచ్చిన వారిని త్రోసేసి పరిగెత్తి పరుగులెత్తి పోయాడు

యమభటులు నవ్వుకొంటూ యమలోక దారిపట్టారు.

హమ్మయ్య గండం గడిచిందని రాజు సంతోషంగా ఇల్లు చేరాడు.
అలా ఇల్లు చేరిన రాజుకు రెండుమూడు రోజులలోనే దగ్గు అయాసం పడిశంతో జ్వరం వచ్చింది.

రాజవైద్యులు పరిరక్షించి వీధులలో విచ్చలవిడిగా   తిరిగినందువలన కరోనా వైరస్ సోకిందని ఎన్ని చికిత్సలందించినా మహరాజుకు బ్రతికేయోగం లేదని తేల్చేశారు.

 యమభటులు వచ్చినపుడు అంత:పురంలోనే ఉండాలని మృత్యుదేవత చెప్పిన మాటలు వినకపోయి వీధులవెంబడి పరిగెత్తి భయంకరమైన కోవిడ్ - 19 బారిన పడ్డానని విలపించాడు రాజు.

14 వ రోజున యమభటులు వచ్చారు. రాజుకు ఇపుడు పరుగులెత్తే శక్తిలేదు. వారిని చూచి స్వయంకృతాపరాధం వలన మృత్యువు పాలబడ్డానని రోధించాడు.

యమకింకరులు తమ పనిని కానించేసుకొన్నారు.

నీతి :- భారతీయులు కూడా   మృత్యుంజయుని    చాలా మంచి మేధస్సు కలవారు. అయితే క్రమశిక్షణ కొంచెం తక్కువేనని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం  డాక్టర్లు పోలీసులు వీధులలోనికి పోరాదని
చెప్పినా వినరు.
లాక్ డౌన్ పట్టించుకోరు. చివరికి మృత్యుంజయ మహరాజులా ప్రాణం మీదకు తెచ్చుకొంటారు.

మాటవిందాం
మనం బ్రతుకుదాం
ఇతరులను బ్రతుకనిద్దాం
-----------------------------------------------------------------------------------------------------

Post a Comment

0 Comments