Responsive Advertisement

నువ్వు కమెడియన్ వి కాదురా. నా కథలో హీరో వి

నువ్వు కమెడియన్ వి కాదురా. నా కథలో హీరో వి

శ్రీను గాడు” ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాడొకడు. ఒక్కడేంటి, మనకు తెలిసిన ప్రతి పదిమందిలోనూ ఒకడున్నా ఉండొచ్చు. “పక్కింటి శ్రీను గాడు” , “ప్లేబాయ్ శ్రీను గాడు” , “బెంచ్ మేట్ శ్రీను గాడు” , “క్లాస్ టాపర్ శ్రీను గాడు” ఇలా ఎంతో మంది శ్రీను గాళ్లు మనకు తెలిసుండొచ్చు. వాళ్లందరినీ మనం మరిచి పోయి ఉండొచ్చు. కానీ శ్రీను అనే పేరు వినబడగానే గుర్తొచ్చేవాడు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనివాడు ఒకడుంటాడు. నా జీవితంలోనూ అలాంటి వాడు ఒకడున్నాడు.

కాలేజీలో జాయిన్ అయిన రోజు నాకు పరిచయమైన మొట్టమొదటి వింత జంతువు వాడే. వాడిని చూడగానే “ఏంటి ఇంత వయసొచ్చినా ఇంకా చదువుతూవుంటారా?” అని డౌటొచ్చింది. రెండు రోజుల తర్వాత అర్థమైంది , వయసైతే పెరిగింది కానీ మనిషీ పెరగలేదు, వాడి మెదడూ పెరగలేదని. గడ్డం గడ్డిలా పెరిగినా ఇంకా నోట్లో వేలు పెట్టుకుని పడుకునేవాడు. ఎవరు నవ్వినా పట్టించుకునేవాడు కాదు. వాడి గురించి ఎవరు కామెడీ చేసినా కోపమో, చిరాకో, ఆనందమో, బాధో అర్థంకాని ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయేవాడు. అప్పట్లో ఆ చేష్టలు చూసి అనిపించేది నాకు,”నేనే గనుక హీరో అయితే నా పక్కన బెస్ట్ కమెడియన్ వీడే అవుతాడ” ని. బహుశా నా జీవితంలో లో వాడొక ముఖ్య పాత్రధారి అవుతున్నాడని విషయం నేను అప్పుడు అలా అర్థం చేసుకున్నానేమో. 

మంచి, చెడు, బాధ, ఆనందం, ఆవేశం, అమాయకత్వం లాంటి అన్నిటికీ అర్థం, ద్వంద్వార్థం రెండూ నేర్పిన మా కాలేజ్ లో నా జ్ఞాపకాలు దాగి ఉన్న ప్రతిచోటును మొదటిసారి నాకు చూపించింది వాడే. నేను అడగకపోయినా, నాకు అవసరం లేకపోయినా వాడికి తెలిసిన వాళ్ళందరినీ పరిచయం చేశాడు. నిజానికి నన్ను కూడా. 

మేమిద్దరం చదివేది వేరు వేరు కోర్సులు. కానీ మా క్లాస్ రూమ్ ఒక్కటే. హాస్టల్ లో కూడా ఒకే రూమ్. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం తిట్టుకుంటూ, తన్నుకుంటూ. మాతో కలిసి చదివిన వాళ్ళు, హాస్టల్లో మాతో కలిసి ఉన్న వాళ్ళు, అందరూ శ్రీను గాడి మీద జోకులు వేసేవాళ్ళు. నేను వాళ్ళతో పోటీపడి మరీ వాడిని కామెడీ చేసే వాడ్ని. వాడు మాత్రం ఎప్పుడూ నా గురించి కామెడీ గా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వేరే ఎవరైనా నా మీద జోకులు వేస్తే ఒక్కోసారి కోప్పడేవాడు కూడా. “వీడి ఓవరేక్షనేంటి” అనిపించేది నాకు. నాలా సెటైర్లు వేయడం చేతకాక నన్ను సపోర్ట్ చేస్తూ కూర్చుంటాడు అనుకునేవాడ్ని.

నేను ఏం చేసినా తప్పనేవాడు కాదు శ్రీను గాడు. తప్పు చేశాను రా అని నేను అన్నప్పుడు కూడా “పర్లేదు లేరా అయిపోయిందేదో అయిపోయింది” అనేవాడు. అందుకేనేమో వాడి దగ్గర ఏ విషయం దాచేవాడ్ని కాదు. నేను చేసిన తప్పు ఒప్పు అన్నీ తెలిసింది వాడొక్కడికే. అన్నీ తెలిసినా నేను మంచివాడ్నా చెడ్డవాడ్నా అని నన్ను ఎప్పుడూ జడ్జ్ చేయలేదు వాడు. నేను మంచి ఫ్రెండ్నని నమ్మాడు అంతే. 

ఎంతలా అంటే.. ఒకసారి మా క్లాస్ మేట్ ని లవ్ చేస్తున్నానని చెప్పాడు. అప్పటికే తన నెంబర్ తెలుసుకుని తనకి మెసేజ్ చేస్తున్నాను అని కూడా అ చెప్పి మురిసిపోయాడు. ఆ అమ్మాయి వాడి మెసేజ్ లు చూసి, కోప్పడి, తప్పనిసరిగా వాళ్ళ అమ్మను తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తానని నాతో చెప్పింది. “వాడికి అలా చేస్తే బుద్ధి రాదు. లేట్ చేయకుండా ఇప్పుడే నువ్వు వెళ్లి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇవ్వ” మని చెప్పి నేనే వాడి మీద కంప్లైంట్ లెటర్ రాసిచ్చి మరీ పంపాను. ప్రిన్సిపాల్ శ్రీను గాడికి చీవాట్లు పెట్టి పంపాడు. అది చూసిన వాళ్ళందరూ “గొప్ప ఫ్రెండ్ దొరికాడు రా బాబూ నీకు. నీ మీద కంప్లైంట్ ఇస్తానంటే ఆపకుండా, కంప్లైంట్ లెటర్ రాసిచ్చి మరీ ఎంకరేజ్ చేశాడు”అన్నారు వాడితో. “మీకెందుకురా మీ పని మీరు చూసుకోండి” అని సమాధానం చెప్పాడు వాళ్ళకి. వాడి సమాధానం వినేంత వరకు “ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇష్యు ఇంకా పెద్దది అవుతుందనిపించింది రా….. ఆ అమ్మాయి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు నీ గురించి మరీ చెడ్డగా చెప్పేస్తుందేమోనని భయపడి, నువ్వు చేసింది మరీ అంత తప్పు కాదు కానీ ఎందుకైనామంచిది ఒకసారి మందలించండి అని అర్థం వచ్చేలా లెటర్ రాసి,” ఏం మాట్లాడకుండా ఇది ఇది తీసుకెళ్లి ప్రిన్సిపల్ కి ఇవ్వు చాలు వాడి పనైపోతుంది” అని ఆ అమ్మాయితో చెప్పి పంపాను ” అంటూ బోలెడంత వివరణ ఇవ్వాలని అనుకున్నాను నేను కానీ వాడి మాటలు విన్న తర్వాత ఏం మాట్లాడలేదు. 

“వాడికి నా ఆలోచనలు ఎంత వివరించి చెప్పినా అర్థం కావు, తింగరోడు కాబట్టి నేనేం చెప్పినా తందాన అంటుంటాడు” అనుకునేవాడిని. కానీ ఆరోజు అర్థమైంది నాకు నేనేంటో తెలిసినవాడికి కూడా నా ప్రతి నిర్ణయానికీ కారణాన్ని వివరించాలని అనుకునే నేనే తింగరోడినని.

ఒకరోజు ఎందుకో కారణం లేకుండా కోపం వచ్చింది నాకు. ఎప్పటి లాగే నా కోపానికి శ్రీనుగాడే బలయ్యాడు. ఎప్పుడు కోపం వచ్చినా నోటికొచ్చిన అక్షింతలన్నీ వాడి మీదే జల్లేవాడ్ని. ఆరోజు మాత్రం వాడు నిద్రపోతున్నాడని జాలిపడి, నడ్డి మీద తన్ని ఊరుకున్నాను. దబేలున కింద పడ్డాడు. పైకి లేచిన తర్వాత “నేనేం పాపం చేశాన్రా?” అంటున్న వాడి మొహం చూసి ఆరోజంతా నవ్వాగలేదు నాకు. ఇప్పటికీ కోపం వచ్చినప్పుడల్లా ఆ సందర్భం గుర్తొచ్చి నవ్వొస్తుంది నాకు. కాసేపటికి బాధేస్తుంది కూడా. 

ఒకరోజు ఆనందంలో వెళ్లి, వాడి మీద పడి జుట్టు పట్టుకొని “యాహూ! ! ” అని అరిచాను. తల పట్టుకుంటే వాడు ఊరుకుంటాడా? “ఆనందం ఎక్కువయితే ముందు కారణం చెప్పరా. నేనూ ఆనందపడతాను. జుట్టు ఎందుకు పట్టుకోవడం?” అని నన్ను తరుముతూ రూమంతా పరిగెత్తించాడు. ఆరోజు “ఇంక ఓపిక లేదు రా నాయనా” అన్న తర్వాత వాడు ఆపకుండా కితకితలు పెడుతుంటే, నేనెలా కిందపడి దొర్లేశానో ఎప్పటికీ మర్చిపోలేను.

అలాంటి అనుభవాలే అర్థమయ్యేలా చెప్పాయి నాకు, అన్ని బంధాలు ఆనందాన్ని పంచుకుంటుంటే… స్నేహం మాత్రం పెంచుతుంటుందని. ఆనందంలో మాత్రమే కాదు బాధలో కూడా నన్ను వదిలి పెట్టకుండా, నా పక్కనే ఉండేవాడు శ్రీను గాడు. “బాధుంటే దాచుకోకుండా ఏడ్చేయ్యాలి రా. అప్పుడు భారమంతా దిగిపోతుంది” అనేవాడు “ఫిగర్ లా ఫీలైపోయి, నేను ఏడిస్తే ఓదార్చాలని ఆశపడకు రోయి. నేను బాధ పడతానంతే ఏడవను” అని జోక్ చేసే వాడ్ని నేను. ఇప్పుడు ఏడుపొచ్చేంత బాధ కలిగిన ప్రతి సారీ అనిపిస్తుంది, వాడు పక్కనుంటే ఈ పరిస్థితులను కూడా అప్పటిలాగే జోక్ గా తీసుకునే వాడినేమోనని అనిపిస్తుంది ఇప్పటికీ వాడు ఫోన్ చేసి ” ఏంటి సార్? ఏం చేస్తున్నారు? బిజీయా? “అన్న ప్రతి సారి చెప్పాలనిపిస్తుంది “రేయ్ శ్రీను గా నేను చెప్పింది విను. నేనుమొదట్లో అనుకున్నట్టు . నువ్వు కమెడియన్ వి కాదురా. నా కథలో హీరో వి. ఎందుకంటే నా జీవితంలో, నా ప్రతి జ్ఞాపకంలో నీకు నచ్చినంత చోటు నువ్వు కబ్జా చేసుక్కుర్చున్నావు. నేనేదో నీతో నా ఆనందాన్ని, కోపాన్ని, బాధని, పంచుకుంటూ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్టు గా నీ పక్కనున్నానంతే ” అని. కానీ చెప్పను. నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాడు నా ఫ్రెండ్....!!

Post a Comment

0 Comments