Responsive Advertisement

మురారిరావు గురించి ఎంతమందికి తెలుసు ?

మురారిరావు గురించి ఎంతమందికి తెలుసు ?
-------------------------------------------
మురారిరావ్ ఘోర్పడే మరాఠా యోధుడు.ఒక సందర్భంలో  టిప్పు తండ్రి హైదర్‌ అలీని  సహితం మిత్రులసాయంతో ఓడించిన ఘనుడు. మురారిరావు ఘోర్పడే ను మురారిరావు అని కూడా పిలుస్తారు. మరాఠా భాషలో ఘోర్పడే అంటే ఉడుము.ఉడుము కోటగోడను పట్టుకొంటే  ఏం చేసినా వదలదు. శివాజీ సేనాని తానాజీ సింహఘడ్ కోటను జయించటానికి ఉడుము పట్టే కారణమని మనకు తెలుసు కదా !

మురారిరావు తండ్రి పేరు సిద్దోజీరావు.ఇతని బిరుదు హిందూరావు. అనంతపురం జిల్లాలో ప్రముఖ పట్టణం హిందూపురం,హిందూరావు బిరుదు మీదుగా ఏర్పడిన పట్టణమే. హిందూరావు ఇప్పటి బళ్లారి జిల్లాలో ప్రముఖ ఉక్కు ఖనిజకేంద్రంగా  వున్న సండూరును కేంద్రంగా చేసుకొని పాలించాడు.

మురారిరావు 1699 లో జన్మించాడు. 1729 లో సుగుణాబాయితో వివాహం జరిగింది. రెండోభార్య కూడా వుంది కాని పేరు తెలియదు. మురారిరావు రెండో భార్యను టిప్పు 1791లో శ్రీరంగపట్టణంలో ఉరి తీశాడు.

తండ్రి మరణాంతరం మురారిరావు 1731 లో రాజైనాడు.

ఛత్రపతి శివాజీ  భోంస్లే వంశస్తుడు.
మురారిరావు కూడా ఆ భోంస్లే వంశానికే చెందినవాడే. 1740 లో మురారిరావు ఫతేసింగు, రఘునాథరావు భోంస్లే మొదలైన సేనానుల సాయంతో అర్కాటుపై దాడిచేసి అర్కాటు నవాబైన దోస్త్ అలీఖాన్ ను దామలచెరువు యుద్ధంలో ఓడించి అర్కాటును అక్రమించి, తిరుచిరాపల్లిలో పాలకుడు మరియు దోస్త్ అలిఖాన్ అల్లుడైన చందా సాహేబ్  బందీగా పట్టుకొని సతారాకు పంపారు.

మురారిరావు ధైర్యస్థైర్యాలకు మెచ్చి తిరుచిరాపల్లి (తిరుచ్చి) పాలకునిగా నియమించారు.14 వేలమంది సేనతో మురారిరావు జూన్‌1741 నుండి మార్చి 1743 వరకు తిరుచిరాపల్లి పాలకుడిగా ఉన్నాడు.

ఈలోగా నిజాం నవాబు నిజామలిఖాన్ అర్కాటు వారసత్వయుద్ధాలలో జ్యోక్యం చేసుకొని అర్కాటుపైదాడి చేసి స్వాధీనం చేసుకొని తిరుచిరాపల్లి పై దాడి చేశాడు.
అంతవరకు మురారిరావు వెన్నంటివున్న రఘూజీ భోంస్లే మొదలైన సేనానులు సహాకారమందించలేదు.కారణమేమంటే పీష్వా బాలాజీ బాజీరావుకు భోంస్లేకు వున్న తగాదాలే. అయినప్పటికి మురారిరావు ఆరునెలలపాటు కోటను రక్షించుకొని విధిలేక కోటను స్వాధీనం చేశాడు. అందుకు ప్రతిగా నిజాం అనంతపురం జిల్లాలోని పెనుకొండ రాజ్యాన్ని రెండు లక్షల రూపాయలను ఇవ్వడం జరిగింది.

ఇలా మురారిరావు తన పాలనను పెనుకొండకు మార్చడం, కొద్ది కాలానికే అంటే 1754 లో పెనుకొండ నుండి రాజధానిని గుత్తికి మార్చడం జరిగింది.మురారిరావుకు ఫ్రెంచివారు మంచి మిత్రులు.

మురారిరావు గతంలో ఫీష్వాల అధికారానికి లోబడి పాలన సాగించి కప్పం కట్టేవాడు. గుత్తికి వచ్చిన తరువాత పీష్వాల బలహీనతలను తెలుసుకొని కప్పం కట్టనని, పైగా తాను ఛత్రపతి శివాజీ వంశీకుడనని గుత్తిరాజ్యాన్ని స్వంతంగా సంపాదించుకొన్నానని తిరగబడ్డాడు. ఇదే సమయంలో కర్ణాటకలోని సావనూరు పాలకుడైన అబ్దుల్ హకీం అప్ఘానితో చేతులు కలిపాడు. హకీం అప్ఘాని అప్పటికే హైదరాబాదు నిజాంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి కప్పం కట్టడం మానేశాడు. నిజాంపై పోరాటానికి పరస్పరం ఒప్పందం చేసుకొన్నారు.

మరాఠాలు మల్హర్ రావు హోల్కర్, మధుజీ హోల్కరు నాయకత్వంలో, మరియు నిజాంసేనలు సావనూరును ఓడించటానికి బయలుదేరాయి. నిజాం సేనలకు బాసటగా ఫ్రెంచి సేనాని బుస్సీ ఫిరంగులతో బయలుదేరాయి. 1756 లో ఏప్రిల్ లో ఇరుసేనలు ఎదురుపడ్డాయి. మరాఠిసేనలకు మురారిరావు మీద, నిజాం సేనలలోని పఠానులకు అఫ్ఘాని మీద సానుభూతి వుంది.అందువలన బుస్సీ కలిగించుకొని ఇరువర్గాలకు సంధి ఏర్పాటుచేశాడు. సంధిషరుతుల ప్రకారం సావనూరు ప్రభువు హకీం అఫ్ఘాని నిజాం కప్పం చెల్లించటానికి, మురారిరావు పీష్వాలకు చౌత్ చెల్లించటానికి ఒప్పుకొన్నారు. చౌత్ అంటే మరాఠా అధికారానికి  వారి సామంతులు తమ ఆదాయంలో నాలుగవ వంతును పన్నుగా చెల్లించాలి.

అశ్రయమిచ్చిన మైసూరు వడయారులను హైదర్ అలీ  మోసగించి రాజ్యాన్ని కబళించాడు. అంతేకాకుండా ఇరుగుపొరుగు రాజ్యాలపై దాడి చేసి అక్రమించుకొని బలవంతుడు కాసాగాడు. హైదరాలీని అణచటానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెని, మరాఠాలు, హైదరాబాద్  నిజాంలు  కూటమిగా ఏర్పడి శ్రీరంగపట్నంపై దాడి చేశాయి.మరాఠాసేనలో మురారిరావు ముఖ్య భూమిక పోషించాడు. 1765 లో జరిగిన ఈ యుద్ధాన్ని మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధమని చరిత్రకారులు పిలిచారు.ఈ యుద్ధంలో హైదరాలీ ఓడి మిత్రసేనలకు భారీగా కప్పం చెల్లించాడు.

హైదరాలీ త్వరలో కోలుకొన్నాడు. మిత్రపక్షంలో స్వల్ప అభిప్రాయబేధాలు పొడసూపినాయి. ఇదే అదనుగా హైదర్ 1775 లో బళ్ళారిపై దాడిచేసి అక్రమించినాడు. అదే సంవత్సరం గుత్తికోటపై దాడి చేశాడు.మూడు నెలలపాటు మురారిరావు గట్టి ప్రతిఘటన ఇచ్చాడు. బయటి మిత్రులనుండి సాయం అందలేదు. కోటలో అహారధాన్యాల కొరత ఏర్పడింది.

1776 జనవరి 10వ తేదీన గుత్తి లొంగిపోయింది. హైదర్ మురారిరావును బంధించి శ్రీరంగపట్టణానికి బందీగా తీసుకుపోయాడు. బందీగావున్న మురారిరావును హైదర్ అలీ భద్రతాకారణాల దృష్ట్యా కర్ణాటకలోని కబ్బాల దుర్గానికి మార్చినాడు.

 అప్పటికే మురారిరావు వయసు 70 సంవత్సరాలు. బందీఖానాలో హింసలకు భరించలేక వృద్ధాప్

యం చేత మురారిరావు కబ్బాలదుర్గంలోనే మరణించాడు.

 విజయనగర సామ్రాజ్య పతనం తరువాత అనంతపురం, కర్నూలు, బళ్లారి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను నైజాంలను ఎదిరించి సమర్థవంతంగా పాలించిన ఏకైక హిందూమరాఠా యోధుడు మురారిరావు ఘోర్పడే.

ఎందుకో ఆంధ్రచరిత్రకారులు ఇతని చరిత్రపై సరైన దృష్టి సారించలేదు. సారిస్తే పరిపాలనా, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు బయటకు వస్తాయి.
---------------------------------------------------------------------------- 

Post a Comment

0 Comments