కథ - నిర్ణయం

చిన్నప్పుడు నేను చాలా స్వార్థంగా వ్యవహరించేవాడిని. ఇంట్లో ఏది కనబడ్డా మంచివి, అందంగా కనిపించేవి, రుచిగా ఉండేవన్నిటినీ ముందుగా తీసుకునేసి తక్కినవాళ్ళసంగతి పట్టించుకునేవాణ్ణి కాను. నా సంగతి చాన్నాళ్ళుగా గమనించినాడో ఏమో.. మా నాన్నొకసారి పొద్దున్నే స్కూలుకెళ్ళే టైములో రెండు కప్పుల నూడిల్స్ చేసి తీసుకొచ్చి ఒకదానిమీద పైకి కనబడేలా కోడి గుడ్డు ఒకదాన్ని ఉంచి టేబిల్ మీద పెట్టాడు. ఏది కావాలో తీసుకోమన్నాడు. షరా మామూలుగా కోడిగుడ్డున్న బౌల్ ని తీసుకున్నా. రెండో గిన్నె మా నాన్న తీసుకుని తింటూంటే అందులో రెండు కోడిగుడ్లు కనబడ్డాయి. ఆశ్చర్యపోవడం అటుంచి నన్ను నేను తిట్టుకున్నా సరిగ్గా గమనించనందుకు. మా నాన్నన్నాడు, ' కనిపించేదంతా నిజం కాదు, నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయని గుర్తుపెట్టుకో' అని.

మరుసటిరోజు పొద్దున్న స్కూలుకి బయలుదేరుతూంటే టేబిల్ మీద రెండు గిన్నెలు, షరా మామూలుగా ఒకదాని మీద కోడిగుడ్డు. నిన్నటి సంగతి గుర్తుకొచ్చి కోడిగుడ్డులేని బవుల్ ని తీసుకుని తినడం మొదలుపెట్టా. నాన్న కోడిగుడ్డున్న గిన్నెని లొట్టలేస్తూ లాగించాడు. నా గిన్నెలో గుడ్లేమీ లేవు. రెండుంటాయనుకున్న నాకు అసలేమీ లేకపోవడంతో పాలిపోయిన నా మొహంలోకి చూస్తూ నాన్న చెప్పాడు - ' అబ్బాయీ, జీవితంలో అనుభవాన్నే ఎప్పుడూ నమ్ముకోకూడదు. గత జ్ఞాపకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు, ఎందుకంటే జీవితం చాలాసార్లు మనతో జిత్తులమారిగా ప్రవర్తిస్తూ దాని ఉచ్చులో పడేలా చేస్తుంది. అలా అని జరిగినవాటి గురించి బాధపడుతూ కూర్చోకూడదు. పుస్తకాల్లో ఇవన్నీ ఎవరూ నేర్పరు, ఇది కూడా గుర్తు పెట్టుకో' అన్నాడు.

మూడోరోజు పొద్దున్న టేబిల్ దగ్గరికి రెండు గిన్నెల్తో ప్రత్యక్షం అయ్యాడు నాన్న. ఒక గిన్నెలో నూడుల్స్ మీద కోడి గుడ్డు, ఇంకోదానిమీద పైకి తేలుతూ ఉన్న నూడిల్స్. ఈసారి ఉదారంగా ' నాన్నా, నువ్వీ ఇంటికోసం చాలా కష్టపడుతున్నావు. నువ్వే ముందు ఎంచుకో ఏ గిన్నె కావాలో. మిగిలింది నేను తీసుకుంటా ' అని చెప్పా. నాన్న మౌనంగా కోడిగుడ్డున్న గిన్నెని తీసుకుని బ్రేక్ ఫాస్ట్ మొదలుపెట్టాడు. నా వంతులో మిగిలిన గిన్నె దగ్గరికి లాక్కుని తినడం మొదలుపెట్టా. గుడ్లేమీ ఉండవనుకున్న నాకు దాన్లో మసాలా కూరిన కోడిగుడ్లు  రెండు కనబడ్డాయి. పైకెత్తి నాన్న వైపు సంబరంగా చూశా. నవ్వుతూ ప్రేమగా నాన్న ' బాబూ, ఎప్పుడైతే నువ్వు ఇతరుల కోసం మంచిగా ఆలోచించడం మొదలుపెడతావో, అప్పుడు లోకంలోని మంచి సంగతులన్నీ నీ దగ్గరికి చేరతాయి. అవి మంచి వస్తువులు కావచ్చు, మంచి మనుషులు కావచ్చు. నవ్వుతూ బతికేయగలిగే మంచి జీవితం కావచ్చు. గుర్తుపెట్టుకుంటావు, నాకు తెలుసులే' అని ముగించాడు.  

చైనా ప్రెసిడెంటు Xi Jinping చెప్పిందని ఇంటర్నెట్టులో ప్రచారంలో ఉందీ కథ.

Post a Comment

0 Comments