Responsive Advertisement

కథ-ఏ క్షణమూ కోల్పోవద్దని ముగిసే ఒక ఆకురాయిలాంటి కథ

నిప్పుల కొలిమిలో జీవితాన్ని వెలిగించిన కథ
మానవీయతను ఏ క్షణమూ కోల్పోవద్దని ముగిసే ఒక ఆకురాయిలాంటి కథ ఇది.
సురేష్  బి. ఏ ఫైనలీయర్ స్టూడెంట్. పద్మావతిమ్మ అనే ఒక పేదరాలి కొడుకు. సురేష్కు ఏడాది వయసున్నప్పుడే తండ్రి చనిపోతాడు. వాళ్ళ నాన్న ఇచ్చిపోయిన చిన్న పెంకుటింట్లో ఉంటూ, పల్లెలో వాళ్ళకున్న పొలంలో పండిన పంటతో బతుకుతుంటారు. పద్మావతిమ్మ రాట్నం వడికి పై ఖర్చులు, సురేష్కు చదువుకయ్యే ఖర్చులను వెళ్లదీస్తుంది. కానీ ఈ మధ్య పద్మావతిమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రాట్నం వడకడం లేదు. ఈ దరిద్రంతో సురేష్ ఇక తాను చదవలేనని, ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని అంటాడు. ఉద్యోగం దొరికే వరకు చదువు మానవద్దని తల్లి పద్మావతిమ్మ చెప్తుంది. సురేష్  బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాసవుతాడు. మెరిట్ స్కాలర్ షిప్ కూడా వస్తుంది.

సురేష్ రోజూ నిద్ర లేకుండా చదవడం వల్ల ఒళ్ళు బాగా వేడి చేసింది. పొరుగింటి సీతమ్మ ఊళ్ళో అందరికీ పాలు వాడుకగా పోస్తుంది. ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగని సురేష్  సీతమ్మను ఒక గ్లాసు మజ్జిగ అడిగి లేదనిపించుకుంటాడు. కాలేజీ ఫీజు వంద రూపాయలు కట్టాల్సి ఉన్నది సురేష్ . ఈ వంద రూపాయలు కట్టి పరీక్షలు రాస్తేనే సురేష్ చదువు పూర్తవుతుంది. కానీ ఆ ఫీజు ఎలా కట్టాలో సురేష్కు బోధపడదు. తన ఇంటి ఎదురుగా ఉన్న ఈశ్వర్ రావు అనే న్యాయవాదిని ఒక వంద రూపాయలు అప్పుగా ఇమ్మని అడుగుతాడు. కానీ ఆయన తన దగ్గర లేవని ఐదు రూపాయలు దానం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ సురేష్  ఆ అయిదు రూపాయలు తనకు వద్దని అవమానంతో వచ్చేస్తాడు. దీనితో పద్మావతిమ్మ ఎలాగైనా కొడుకు కాలేజీ ఫీజు కట్టాలని సిగ్గు విడిచి తనతో పాటు రాట్నం వడికే శారదమ్మ ఇంటికి వెళ్ళి తన కొడుకు కాలేజీ ఫీజు కోసం వంద రూపాయాలు అప్పుగా ఇవ్వుమని అడుగుతుంది.

శారదమ్మ కూడా తన దగ్గర డబ్బులు లేవని చెబుతుంది. కానీ శారదమ్మ ఇంట్లో తాత్కాలికంగా నివాసముంటున్న శారదమ్మ పెద్దమ్మ పద్మావతిమ్మ బాధను చూడలేక తన కళ్ల ఆపరేషన్ కోసం దాచుకున్న మొత్తం లోంచి వంద రూపాయలు తీసి పద్మావతిమ్మకు ఇస్తుంది. శారదమ్మ చీర కొనుక్కుంటానని ఎన్ని సార్లూ అడిగినా రూపాయి ఇవ్వని పెద్దమ్మ తీరు చూసి శారదమ్మ విసుక్కుంటుంది. సురేష్  ఆ రోజు సాయంకాలం వెళ్ళి శారదమ్మ పెద్దమ్మకు కృతజ్ఞతలు చెప్తాడు.

సురేష్ కు పక్కింటి సవిత అంటే చాలా ఇష్టం. కానీ సవిత మాత్రం ఎప్పుడూ సురేష్ను ఇష్టపడేది కాదు. పైగా పీరు కట్టే అని ఏడిపించేది. కొన్నాళ్ళకు సురేష్కు ఫైనలీయర్ పరీక్షలు కూడా అయిపోతాయి. వెంటనే ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరిపోతాడు. జీతం మూడు వందలు. దీనితో సురేష్  తన జీవితంలోకి ఇప్పుడిప్పుడే కాస్త వసంతం తొంగి చూస్తుందనుకుంటాడు. సురేష్  ప్రైవేట్ ఉద్యోగంతోనే తృప్తి పడక IAS కు రాసి సెలెక్ట్ అవుతాడు. అప్పుడు సురేష్ను చిన్న చూపు చూసిన సీతమ్మ, ఈశ్వర్ రావు, సవిత పశ్చాతాప పడుతారు. సురేష్కు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత అదే ఊళ్ళో కలెక్టర్ గా పోస్టింగ్ వేస్తారు. సురేష్ కొద్ది రోజుల తరువాత తన చిన్న పెంకుటిల్లును కూలగొట్టి అక్కడే పెద్ద భవనాన్ని కట్టిస్తాడు. రమణ కృతజ్ఞతా భావంతో తనకు ఫీజు కట్టి ఆదుకున్న శారదమ్మ వాళ్ళ పెద్దమ్మకు కళ్ల ఆపరేషన్ చేయిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు కళ్ళు రావు. తన నూతన గృహ ప్రవేశానికి ఎంతో మందిని పిలుస్తాడు సురేష్ . వాళ్ళతో పాటు శారదమ్మ పెద్దమ్మను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఆరిపోతున్న దీపానికి నూనె పోసినట్లుగా ముఖ్య దేవతగా గౌరవిస్తారు. ఆమెకు కళ్ళు లేని లోటును సురేష్ , పద్మావతిమ్మ తీరుస్తుంటారు.

కష్ట పడితే నిప్పులాగా, సింహంలాగా బతకవచ్చునని నిరూపించిన కథ ఇది. చీకటిలో ఉన్న మనిషి ఇక తన జీవితం నిండా చీకటేనని అనుకోవద్దు. కష్టపడితే మన జీవితంలో కూడా వెలుతురు ప్రసరిస్తుందని ఉదాహరణ ప్రాయంగా చెప్పిన కథ. మనిషికి డబ్బుంటేనే విలువ. డబ్బు లేని సందర్భంలో కీటకం కంటే కడహీనంగా చూడబడుతాడు ఈ కథలో సురేష్ . అలాగే ఉన్నదాంట్లోనే పొదుపుగా ఎలా బతకాలో చెప్తుంది పద్మావతిమ్మ పాత్ర. మన చుట్టూ ఉన్నవాళ్లనెవర్నీ తక్కువగా చూడవద్దని ప్రతి మనిషికి ఒక రోజు తప్పకుండా వస్తుందని మౌనంగా చెప్తుందీ కథ.

మనల్ని ఆపదలో కాపాడిన వారిని జీవితాంతం మర్చి పోవద్దని కూడ బోధిస్తుందీ కథ. చదువు విలువ, డబ్బు విలువ, మనిషి విలువ, పేదరికపు స్పర్శ, తోటి మనిషికి సహాయపడే మనస్తత్వం, ఉన్నతమైన వ్యక్తిత్వం, స్వీయాభిమానం ఇలా ఎన్నో కోణాల మధ్య మనల్ని నిలబెట్టి జీవితాన్ని పరిచయం చేస్తుందీ కథ. కథ చాలా సరళ శిల్పంలో సాగినా చివరికొచ్చే సరికి మనలో ఒక గొప్ప ఆత్మ విశ్వాసం, జీవితాన్ని గెల్చి తీరాలనే ఒక పట్టుదలను, ఒక మానవీయ సంస్కారాన్ని కల్గిస్తుందీ కథ. సురేష్ పాత్ర ఇప్పటి యువతరానికి ఎంతో స్ఫూర్తినందించే పాత్ర. శారదమ్మ వాళ్ళ పెద్దమ్మ పాత్ర కూడా ఎప్పటికీ పాఠకుల మనసులో నిల్చిపోయే పాత్ర. తాను చదువుకోకున్నా, తన కొడుక్కు కూడా చదువు అబ్బక చివరికి జ్వరంతో చనిపోయినా ఆమెకు చదువు మీద మమకారం చావదు. అందుకే చదువులో ఫస్ట్ వస్తోన్న సురేష్కు అడగ్గానే డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంది.

వాస్తవిక జీవితం నుండి

కథాంశాన్ని ఎన్నుకోవడం వల్ల కథ ఎక్కడా అభూత కల్పనగా తోచకుండా ప్రతి సంఘటనలో జీవితపు తడి తాకుతుంది. ఆస్తిపాస్తులు లేకున్నా మధ్యతరగతి మనిషిని చదువే ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని ఇందులోని ప్రతి అక్షరం సాక్ష్యమిస్తుంది. కష్టాలెన్నెదురైనా పోరాడుతూ నిలబడాలని, విజయం సాధించగానే ఉబ్బి పోకుండా తాను ఎక్కి వచ్చిన మెట్లను మర్చి పోవద్దని, ప్రతి మనిషి అంతరంగంలో ఉండే మానవీయతను ఏ క్షణమూ కోల్పోవద్దని ముగిసే ఒక ఆకురాయిలాంటి కథ ఇది. కష్టాల పలుగు రాయికి మనల్ని మనం రాసుకొని జీవితంలో మిలమిలా మెరవాలని, బతుకులో పర్చుకున్న చీకటిని తిడుతూ కూర్చునే కన్నా ఒక చిరు దీపాన్ని వెలిగించి జీవితాన్ని కాంతివంతం చేసుకోవాలనే ఒక స్ఫూర్తిని మిగిల్చే కథ.

Post a Comment

0 Comments