నాలుగు వేలేనా ఇచ్చేది ! అంతేనా!

నాలుగు వేలేనా ఇచ్చేది ! అంతేనా!
...................................................

అనవేమమహిపాల్ స్వచ్త్యు స్తు తవ బహవే
ఆహావే రిపుర్దోర్ధండచంద్ర మరడాలసహవే.

ఇదో శ్లోకం. అనవోతారెడ్డిని కీర్తిస్తూ శ్లాఘిస్తూ చెప్పిన శ్లోకమిది. అనవోతుడు గొప్ప కవేకాక అనేకమంది కవి పండితులను పోషించాడు. కవి పండితులకు అనేకదానాలు చేసి తన ఒౌదార్యాన్ని చాటుకొన్నాడు.ఇతని దాతృత్వం గురించి అనేక చాటువులు ఉన్నాయి. అలాంటి చమత్కార చాటువే పై శ్లోకం.

ఒకసారి ఓ తెలివైన సంస్కృతకవి అనవోతుని ఆస్థానానికి వెళ్లి అతనిని శ్లాఘిస్తూ పై శ్లోకం చెప్పాడు.

జాగ్రత్తగా చూడండి పై శ్లోకంలో నాలుగు "వే" లున్నాయి.

అనవోతారెడ్డి సంతుష్టుడై మూడువేల సువర్ణాలను ఇవ్వబోయాడు. అందుకా కవి రాజా నేను ఇచ్చిన శ్లోకంలో నాలుగు వే లున్నాయి. నేను నాలుగు వే లు ఇచ్చినపుడు ఒక వేయి తక్కువగా ఇవ్వడం భావ్యంగా లేదు కదా! అంటు విన్నవించాడు. రాజు అతని చమత్కారానికి ఆనందపడి నాలుగు వేలు సువర్ణాలు ఇవ్వబోయాడు. 

అందుకా కవి రాజా నేను నాలు వేలు ఇచ్చాను నా నాలుగు వేలు నాకే ఇవ్వడం సమంజసమా అంటూ అడిగాడు. అందుకు అనవేముడు నవ్వి ఐదువేలు ఇవ్వబోయాడు. అందుకా పండితుడు నేను జన్మత: ఆర్వేల నియోగిని నాకు మీరు ఐదువేలు ఇవ్వడం న్యాయంగా లేదన్నాడు. అనవోతుడు ఆరువేలు ఇవ్వబోయాడు. అందుకా కవి నేను పుట్టుకతోనే ఆరువేలనియోగి వంశం వాడినని చెప్పాను కదా! పుట్టుకతోనే ఆరువేలు ఉన్నవాడికి మీరు ఆరువేలు ఇవ్వడంలో ఒౌచిత్యమేముందని చమత్కరించాడు. రాజు మందహాసం చేసి ఏడువేలు ఇవ్వబోయాడు. అందుకా కవి ప్రభు ఏడు శుభప్రదం కాని సంఖ్య. ఇచ్చినవారికి పుచ్చుకొన్నవారికి మంచిది కాదంటూ సందేహం వ్యక్తం చేశాడు.

అనవోతుడా కవి చమత్కార కళకు అబ్బురపడి ఏకంగా తొమ్మిది వేలిచ్చాడు. కవి తొమ్మిదివేల సువర్ణాలను తీసుకొని రాజును ఆశీర్వదించి పయనమైపోయాడు.
............................................................................................... 

Post a Comment

0 Comments