పస్తులుండి దాచారు... పంచేశారు!
నమ్మినవారు నట్టేట ముంచారు. డబ్బు పోయినందుకు బాధపడలేదా తండ్రి. కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాడు. తనకు తెలిసిన క్షౌర వృత్తినే నమ్ముకున్నాడు. పైసా పైసా కూడబెట్టాడు. బిడ్డ చదువు కోసం ఐదు లక్షల రూపాయలు జాగ్రత్త చేశాడు.నమ్ముకొని వచ్చిన వారికి సాయం చేయాలనుకుందా బంగారుతల్లి. తన భవిష్యత్తును త్యాగం చేసింది. తండ్రి దాచిన సొమ్మును సేవకు ఉపయోగించింది. నిరుపేదల ఆకలి తీర్ఛి. ఐక్యరాజ్యసమితి నుంచి పిలుపు అందుకున్న 13 ఏళ్ల నేత్రను వసుంధర పలకరించింది.
మదురైలో ఉంటుంది నేత్ర. మోహన్, పాండిసెల్వి దంపతుల ఏకైక కూతురు. తనను కలెక్టర్‌గా చూడాలనుకున్నాడా తండ్రి. స్నేహితులతో కలిసి వ్యాపారం చేద్దామని.. ఊళ్లో పొలం, ఇల్లు, నగలు అమ్మి 30 లక్షలు తీసుకొచ్చాడు. ఆ స్నేహితులు మోహన్ కుటుంబంపై దాడి చేసి సొమ్మంతా ఎత్తుకుపోయారు. ఒక్కరాత్రిలో ఆ కుటుంబం వీధిలోకి వచ్చిపడింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. తినడానికి తిండి లేదు. అప్పడు నేత్రకు ఐదేళ్లుంటాయి.అమ్మానాన్న ఎందుకు ఏడ్చేవారో అర్థమయ్యేది కాదు. ఆ రోజులను నాన్న ఇప్పటికీ గుర్తుచేస్తుంటాడు. పూట గడవడమే కష్టంగా ఉండేదట. గంజి తాగేవారట’ అని చెబుతుంది నేత్ర. కొన్నాళ్లకు మోహన్ ఓ సెలూన్‌లో పనికి కుదిరాడు. యాభై సంపాదించినా. వందొచ్చినా.. అందులో కొంత కూతురు పేరిట పొదుపు చేయడం ప్రారంభించాడు. ‘ఇప్పుడు మా పరిస్థితి కొంత కుదుటపడింది. నేను తొమ్మిదో తరగతికొచ్చాను. నా పేరిట పొదుపు చేస్తూ వచ్చిన మొత్తం ఇప్పుడు ఐదు లక్షలయ్యాయి. ఎంత కష్టమొచ్చినా.. నాన్న వాటిని ముట్టుకోడు. ‘అవి కలెక్టర్ చదువు కోసం’ అంటుంటాడు’ అని చెప్పుకొచ్చింది నేత్ర.
ప్లీజ్ నాన్నా.
మదురైలో కరోనా కలకలం మొదలైంది. లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. మా ఇంటి సమీపంలో కరోనాతో ఇద్దరు చనిపోయారు. దాంతో మేముంటున్న ప్రాంతమంతా క్వారంటైన్ చేశారు. ఏప్రిల్ నెలాఖరులో లాక్‌డౌన్ ప్రభావం ఎంతుందో తెలిసొచ్చింది. చేసేందుకు పనుల్లేక, చేతిలో డబ్బుల్లేక ఆకలికి అలమటించేవాళ్లను ఎందరినో చూశాను. కొందరు మా ఇంటికి వచ్చి సాయం అడిగారు. నా మనసు చలించిపోయింది. నాన్న దగ్గరికి వెళ్లాను. ‘నేనొకటి కోరుకుంటాను.. తీరుస్తావా నాన్నా!’ అని అడిగాను. నా చదువు కోసం దాచిన ఐదు లక్షల రూపాయలు అందరికీ పంచేద్దాం అన్నా. నాన్న ఏం మాట్లాడలేదు. ప్లీజ్ అని బతిమాలాను. అమ్మ కూడా మద్దతిచ్చింది. చివరికి నాన్న ఒప్పుకున్నారు’ అంటుంది నేత్ర.
తల్లి నగలనూ అమ్మి..
బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బులతో నిత్యావసర వస్తువులు తెప్పించి..మూటలుగా కట్టించింది. తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో అవసరార్థులకు ముందుగా టోకెన్లు పంచిపెట్టింది. టోకెన్‌తో వచ్చిన వారికి ఈ మూటలను అందించింది. ప్రతిరోజూ సుమారు 500 మందికి సాయం చేస్తూ వచ్చారు. పోలీసుల అండతో భౌతిక దూరం పాటించేలా చర్యలూ తీసుకున్నారు. ఐదు లక్షలూ అయిపోయాక.. తల్లి నగలు అమ్మించింది. ఆ మొత్తాన్నీ సేవకు వినియోగించేలా చేసింది. ‘శక్తికి మించి ఎందుకివన్నీ అని చాలా మంది అనేవారు. నాన్న మాత్రం నా కూతురిది పెద్ద మనసు..తను కోరితే తీర్చలేనా అనేవాడు. నాన్నది గొప్ప మనసు.అందుకే ఈ కూతురు కోరిక మన్నించాడు’ అంటుంది నేత్ర.
ఐక్యరాజ్యసమితి నుంచి పిలుపు.
ఈ తండ్రీకూతుళ్ల కథ తెలుసుకున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ‘మోహన్ కుటుంబం చేస్తున్న సేవ మరువలేనిది’ అని ప్రశంసించారు. నేత్ర త్యాగశీలతను ఐక్యరాజ్యసమితి గౌరవించింది.ఆమెను ‘గుడ్‌విల్ అంబాసిడర్’గా నియమించింది. అభినందన పత్రంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని అందించింది.
🙏🙏🙏🙏🙏🙏
సేకరణ......
Hi Please, Do not Spam in Comments