మంచి పేరు

మంచి పేరు

SHYAMPRASAD +91 8099099083
0
మంచి పేరు:
•~~~~~~~•

“ప్రతి మనిషికీ ఓ పేరు” ఉంటుంది. అది వ్యవహార నామం- గుర్తింపు కోసం, పిలవడం కోసం. అది సర్వసాధారణం. తల్లిదండ్రులు పెట్టిన ఆ పేరును నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. పేరు తెచ్చుకోవడమంటే కీర్తి సంపాదించడం, ప్రసిద్ధి పొందడం. *మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి మనిషికీ ఉంటుంది. ఆశించినంత మాత్రాన కీర్తి రాదు. ధర్మాచరణ, చిత్త శుద్ధి, సచ్ఛీలం వల్ల మంచి పేరు వస్తుంది.*

“మంచి మనసులేని అందం, వాసన లేని పువ్వు, క్రమశిక్షణ లేని చదువు, సదాశయం లేని యుద్ధం, ఆచరణలేని సూక్తులు, మనిషికి ఖ్యాతి తెచ్చి పెట్టలేవు'* అంటారు. స్వామి వివేకానంద. 

కోరుకుంటే, డబ్బు ఖర్చు పెడితే, పరులను స్తోత్రపాఠాలతో సంతోష పెడితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రచారాలు చేసుకుంటే వచ్చే కీర్తి, అభినందన, స్తుతి అర్ధవంతమైనవి కావు. తన సాధన, కృషి, విజయం , దీక్ష, అధ్యయనం ఇతరులకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగిస్తే అది తప్పకుండా మనిషికి ఖ్యాతిని తెచ్చి పెడుతుంది. అది ప్రాచుర్యానికి, పదిమందికి చెప్పుకోవడానికి అర్హత కలిగినదే అవుతుంది. 

*మంచిమాట, మంచిపని, ఇతరులకు సేవచేసే లక్ష్యం శాశ్వత కీర్తిని సంపాదించి పెడతాయి.*
 
అల్పాయుష్కులైనా ఆదిశంకరులు జీవించినంత కాలం మానవాళికి మహత్తరమైన ప్రబోధాలు చేశారు. ప్రచారం కోసం చేసే దానధర్మాలకంటే మనః పూర్వకంగా చేసే గుప్తదానాలే మనిషికి అఖండఖ్యాతిని తెచ్చి పెడతాయంటారు. వాల్మీకి, వ్యాసుడు, పోతన వంటి మహానుభావులు కీర్తికోసం గ్రంథ రచన చేయలేదు. లోక కల్యాణమే పరమావధిగా భావించి పరమ విధిని నిర్వర్తించిన యశఃకాయులు వారు. అరవిందుడు, సిస్టర్ నివేదిత లాంటి వారు జాతిహితం కోసం తమ జీవితా అలనే అంకితం చేశారు. ఖ్యాతి వారిని వరించింది. చరిత్ర తన స్వర్ణపుటల మీదకు వారిని ఆహ్వానించింది. 

*జాతికి ప్రయోజనకరమైన ఏ పని అయినా మనిషికి కీర్తి తెచ్చి పెడుతుంది.*  సాటి మనిషికి స్ఫూర్తిని, ఉత్సాహాన్ని, సత్సంకల్పాన్ని కలగజేయలేని ఏపనీ ప్రచారానికి అర్ధమైంది కాదు. అటువంటి పనుల గురించి మనిషి బయట చెప్పుకోవడమూ అలజ్ఞతే అవుతుంది.
*మనిషి తనను తాను తెలుసుకోగలగాలి. అర్థకామాలకే ప్రాధాన్యమిచ్చి ధర్మాన్ని విస్మరిస్తే మోక్షప్రాప్తికి అర్హతే ఉండదు. శాశ్వతమైన ఖ్యాతి పొందని దేహం దేహమే కాదు.* దేహాన్ని తొమ్మిది ద్వారాలున్న దేవతల నగరిగా అధర్వణవేదం అభివర్ణించింది. నిరంతర సాధన ఆధ్యాత్మిక శక్తిని ఉద్దీప్తం చేసినప్పుడు మనిషి సత్కర్మలు, సదాచరణ, మిత భాషణం వల్ల సత్కీర్తి పొందుతాడు. అనుకరణీయం, అనుసరణీయమైన కార్యాలను నలుగురికీ చెప్పి చైతన్యపరచడానికి ధర్మాన్నే మూలంగా తీసుకోవాలని తైత్తరీయారణ్యకం' చెబుతోంది.

చిత్త శుద్ధిగల ధర్మాచరణ, మౌలికమైన ప్రజ్ఞ, ప్రతిభ, సృజనాత్మకత లేకుండా ఏదోవిధంగా సంపాదించే సత్కారాలు, సన్మానాలు, బిరుదులు కీర్తికండూతిని బహిర్గతం చేసుకోవడానికే తప్ప అన్యులకు ఉపకరించేవి కావు. అభినందనలు అందుకునేవీ కావు. కీర్తి వైపు చూస్తూ కృషి చేయడం కాదు, కృషిని చూసి కీర్తి పరుగెడుతూ రావాలి. చరిత్రకెక్కిన మహనీయులంతా అలాగే చేశారు. చిరస్తాయిగా మన గుండెల్లో నిలిచిపోయారు. ఇతరుల ప్రవర్తన ఎలాఉంటే తాను సంతుష్టి పొందగలడో మానవుడు ఇతరుల పట్లా అలాగే ప్రవర్తించాలన్నది మహాభారత మహాసూత్రం. 

*'ఆశించకుండా లభించే కీర్తి అపురూప వస్తువు వంటిది'.* 

'పేరు ప్రతిష్ఠలు కావాలంటే చాలా కాలం పడుతుంది. పోగొట్టుకోవడానికి క్షణం పట్టదు'. ఆశించినకొద్దీ కీర్తి దూరమవుతుంటుంది. దాన్ని మరిచిపోయిన కొద్దీ మనకు అది దగ్గరవుతుంటుంది. కాబట్టి చేసే పనులన్నీ ఖ్యాతికోసం కాక సమాజ ఉద్దరణ, దైవప్రీతి కోసం చేయాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!