వ్యాసము: తెలుగు భాష ఉనికి

వ్యాసము: తెలుగు భాష ఉనికి

SHYAMPRASAD +91 8099099083
0
వ్యాసము: *తెలుగు భాష ఉనికి*
*కళ్యాణ్*

మనం అత్యంత వేగవంతమైన యుగంలో వున్నాము.  మనిషి తుమ్మినా భూమి అవతలి వైపుకు వినగలిగినంత వేగవంతమైన యుగము. ఈ స్థితి ఒక వంద యేళ్ళ క్రిందటి వారు ఎప్పుడైనా ఊహించారా? క్షణాల్లో సమాచారం ఎలా ప్రపంచమంతా వ్యాప్తమౌతుందని? 

*మన మాతృభాష మనుగడకు చాలా ప్రమాదకర పరిస్థితిలో వుంది.* ఇది మనందరం ఒప్పుకునే సత్యం. ఈ విషయం లో నాకు రకరకాల ఆలోచనలు వున్నాయి. ఒక క్రమంలో కాకపోయినా, సాధ్యమైనంత వివరణాత్మకంగా వాటిని మీ ముందుకి పెట్టే ప్రయత్నం చేస్తాను.

- ప్రతి రోజూ ప్రపంచం లో ఏదో ఒక భాష చనిపోతూ వుంది. 
అంటే? ఆ భాషను మాట్లాడే చివరి తరం చివరి మనిషి కూడా  చనిపోవటం / మాట్లాడటం మానేయటం. 

తెలుగువారు కొన్ని కోట్లమంది వున్నారు. ఆ క్రమంలో తెలుగు భాషకు ఇప్పటిలో వచ్చిన దుస్థితి ఏమీ లేదు కానీ, మనం మన భాషకు వచ్చిన ఈ స్థితిని కొంచం లోతుగా అర్థం చేసుకోవాలి. 

👉భాషను కేవలం సమాచార మార్పిడికి మాత్రమే వినియోగించటం. 

సాంకేతికంగా మానవులు కోతులనుంచి అభివృద్ధి చెందే క్రమంలో వారికి జంతువులను వేటాడటానికి రకరకాల సంజ్ఞలు అవసరం అయ్యాయి. కొన్ని రకాలైన కూతలతో కూడా వారు వారి భావాలను దూరంలో వున్న మరొక మనిషితో “సింహం వుంది, వస్తోంది” లాంటి సమాచారాన్ని దూరం నుంచే కనపడకుండా (వినపడేంత దూరంలో)  కూడా సమాచార మార్పిడి చేసుకోగలిగేవారు. 2020 లో కేవలం “ఈల వేయటం” తో మాట్లాడుకోగలిగే భాష ఒకటుందని మీకు తెలుసా? 

మొట్ట మొదటి మానవుడు ఉపయోగించిన సంజ్ఞా భాష అంతగా అభివృద్ధి చెందనిదే కావచ్చు. కానీ, అదిప్పుడు వాడుకలో లేదు. 

👉మరోక కోణంలో , ఒక ఊహ/అంచనా వేసుకుంటే, దాదాపు రెండున్నర వేల ఏళ్ళ క్రితం తెలుగు భాష లేదు. అంటే, పిరమిడ్ లు కట్టే కాలంలో, సరే, మన భారత దేశంలో అశోకుడికీ, చంద్రగుప్త మౌర్యుడికీ , తక్షశిల వాసులకీ, హరప్పా మొహంజదారో వాసులకీ మహా జానపదులకీ, జైనులకీ,  అమరావతిలో విలసిల్లిన బుద్ధులకీ తెలుగంటే తెలియదు. 
గమనించారా? తెలుగు నేలపై బౌద్ధం విలసిల్లలేదు. బౌద్ధనేలపై తెలుగు విలసిల్లింది.

👉మరి తెలుగు భాష ఎందుకేర్పడింది? (ఎలా కాదు, ఎందుకు?) నా బుర్రకు తోచిన ఆలోచనే చెబుతున్నాను. సంతతి ఎక్కువయిన చాలా కోతులు వాటిలో తరవాతి తరంలోని కోతి నాయకత్వాంకోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆల్ఫా మేల్ (Alpha Male, aggressive head స్థానం) కోసం తయారుగా వుంటే, అవి వేర్వేరు గుంపులను పెట్టుకోవటానికి చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. అప్పుడు ఒకే సంజ్ఞలను సమాచార మార్పిడి కోసం వాడాలని లేదు. వేరే వేరే జట్టుకి వేరే వేరే సంజ్ఞలు అభివృద్ధి చెంది వుండ వచ్చు. అదే ఆధునిక భాష విషయం లో జరిగింది. వేరే ప్రాంతంలో అదే భాషకు వేరే యాస, క్రమ క్రమంగా తరతరాలతర్వాత, రకరకాలమార్పుల తర్వాత వేరే భాష!
కన్నడ, తెలుగు ఈ విధంగా ఒకే కాలమానం లో ఏర్పడిన తోబుట్టువు భాషలు. 

👉ఏభాషకయినా, దాని ఉనికి ఎప్పుడు ప్రశ్నార్థకమవుతుంది? దాని ఉపయోగం ఎక్కువగా లేకపోవటం వల్ల, ఇంక పెద్దగా ఉపయోగించటం అవసరం లేకపోవటం వల్ల. మనం గమనిస్తే, ప్రస్తుతం వ్యవహారమంతా ఇంగ్లీష్ లో జరుగుతోంది. వ్యవహారానికి తెలుగు అవసరం క్రమంగా తగ్గిపోతోంది. ఈ రకమైన భాషా సంహరం మన తెలంగాణ, ఆంధ్రల్లో కూడా కొత్తేమీ కాదు. మీరు గోండు, కొలామి, పార్జి, సవర, కుపియ, యెరుకల భాషల్లో కొన్ని పేర్లైనా కనీసం వినే వుంటారు. మరిప్పుడవి దాదాపు లేవే? ఏ? వ్యవహారం తగ్గిపోయింది.

👉అభివృద్ధికి కారణాలు: 
రాయల కాలంలో తెలుగులో మంచి సాహిత్యం రాస్తే మంచి బహుమతులిచ్చేవారు. కవిత్రయ యుగాలలో అఖండ కార్తి ప్రతిష్ఠలు కలిగేవి. కనీసం ముష్కరుల యుద్ధ అవకాశాలు లేక దేశం సస్యశ్యామలమై, ఏ తాకిడీ లేకుండా వుండటం కూడా భాషలో  అభివృద్ధికి తోడ్పడతాయి. వాటిలో అన్య భాషల తాకిడి కూడా ఒకటి. జయదేవుని గీతగోవిందం, తెలుగు భాషలో రకరకాల వ్యాకరణ పద్ధతుల అభివృద్ధి దేశం సుభిక్షంగా వున్న కాలంలోనే జరిగాయి.

భాష అభివృద్ధికి , భాష అభివృద్ధిచెందటం తప్ప వేరే దిక్కు లేనప్పుడు అది ఎదుగుతుంది. లేదంటే తరుగుతుంది. 

👉ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నేనెక్కడో చదివాను. బహుశా నిజం కాకపోనూవచ్చు. కేవలం ఒక సర్వే కామోసు. మరో నూటా యాభై , రెండు వందల సంవత్సరాల తరువాత భూమండలంపై రెండే వ్యవహారిక భాషలుంటాయి. ఇంగ్లీషు, మాండరిన్ (చైనీసు). అత్యంత వ్యవహారికం ఆంగ్లానికి బలమైతే, భాష మాయమవలేనంత జనాభా ఆ భాషను వాడటం మాండరిన్ కు బలం. 

👉మరి తెలుగు భాషకు అంత సత్తువ వుందా? మాధుర్యం , తీయదనం మాట ఇక్కడ బహుశా చెల్లకపోవచ్చు. రకరకాల కారణాలు విశ్లేషిస్తే, 
- మన గ్రామ ప్రాంతాల్లో ఎవరికి వారికి ప్రత్యేక యాసలుండటం, 
- అవి అంతటా వ్యవహారానికి పనికి రాకపోవటం, 
- మనలో మనకే ఒక యాసవాడికీ ఒక యాస వాడికీ తేడా చూసుకోవటం, చులకనగా చూడటం,
- కాస్త గ్రాంధికమైన తెలుగును అదేదో వింత వస్తువైనట్టు, గ్రహాంతరవాసుల భాషైనట్టు భావించటం, అదే నిజమైన తెలుగు అనిమనం అర్థం చేసుకోక మన భాషను మనమే అవమానించటం, 
- కంప్యూటర్లలో , ఫోన్లలో ఇప్పటికీ ఆంగ్లమే మాధ్యమంగా వాడటం, 
- కాలక్రమేణా కలిగిన మార్పుల్లోని కొత్త వస్తువులు, వృత్తులు, వ్వావహారిక నామాలకు సరిగా తెలుగులో పేర్లు లేకపోవటం, ఉదాహరణ: జీన్స్, సాఫ్ట్వేర్, ఇంజనీర్, టెఫ్లాన్, కాంక్రీట్, టైపింగ్ -  వీటికి నేరుగా తెలుగులో పదాలు లేవు/ వ్యవహారంలో లేవు. 
- ప్రభుత్వ , ప్రైవేటు సహా, తపాలా శాఖతో సహా విషయ మార్పిడి అంతా ఆంగ్లంలోనే చేయటం, 
- ఇదివరలో సినిమా నాటకం అనే ప్రక్రియను సాంతం ఓవర్ టేక్ చేసింది. క్రమంగా పుస్తక పఠనాన్ని కూడా మింగేస్తోంది. బుర్రపెట్టి ఒక పుస్తకం చదివే బదులు ఒక పాఠకుడు కళ్ళు పెట్టి ఒక సినిమా చూస్తున్నాడు. 
- మానవ ఏకాగ్రతా సమయం క్రమంగా క్షణాల్లోకి దిగజారిపోవటం, ఒక పుస్తకం చదవటానికి అంత ఏకాగ్రత చూపలేకపోయినన్ని సాధనాలు, అవతకవత జీవన విధానాలు
- సాహిత్యాభిలాష కలిగిన వారు కరవవటం, అలాంటి వారున్నా , సాహిత్యాన్ని , అభివృద్ధిని కాక తాత్కాలిక, ప్రత్యక్ష స్వప్రయోజనాలకోసం చూడటం, పరభాషా అనువాదాలకు ప్రాముఖ్యం ఇవ్వటం, తద్వారా తెలుగు రచయితకు ప్రోత్సాహకం కరువవటం, తద్వారా కొత్తరచనలు చేయలేకపోవటం, 
- చిన్న చిన్న పదాలు కూడా తెలుగులోవి వాడకపోవటం, ఆంగ్లములోనివి వాడటం, 
అన్నీ అన్నీ , అందరమూ  ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ భాషకు అన్యాయమే చేస్తున్నాయి. 


చైనా జపాన్ లలో ఇప్పటికీ , ఎంత పెద్ద సాఫ్ట్ వేర్ తయారు చేసినా, దానిని వారి ప్రాంతీయ భాషలో వారికి అర్థమయియేలాగా తయారు చేయాలి. అత్యధిక శాతం ప్రజలకి ఆంగ్లము తెలియదు, వారు నేర్చుకోరు.  కాబట్టి వారి స్వభాషా వ్యవహారానికేలోటూ వుండదు. (విచారకరంగా ఈ పరిస్థితి కూడా అక్కడ మారుతోంది)

అటువంటి పరిస్థితి మన తెలుగులోనూ కావాలి. చిన్న చిన్న వ్యాకరణాలూ డు ము వులు ప్రధమా విభక్తులు హాస్యాస్పదమైపోకూడదు. అవి పిల్లలకు తప్పనిసరి అని గౌరవంతో నేర్పాలి. అర అంటే సగమనీ, అఱ అంటే స్థలభాగమనీ అనీ మనం వాడి, తరువాతి తరానికి నేర్పాలి. 

విజయనగరాన్ని దోచుకోవటానికి ఆరు నెలలు పట్టిందిట. అలాగే మన తేట తెలుఁగుకు ఈ స్థితి పట్టించటానికి మన ఒక్క తరమూ, ఆ పై తరమే కాదు, రెండు దశాబ్దాల ఆంగ్ల మోజు కావలసి వచ్చింది. ఆంగ్లేయుడిచ్చే ఉజ్జోగమూ, తద్వారా వచ్చే కట్నమూ, కాలక్రమేణా “యునైటెడ్ స్టేట్స్ , యునైటెడ్ కింగ్డమ్..” “ కెనడా, ఆష్ట్రేలియా” లో మా వాడున్నాడనే పేరూ ఇవన్నీ భషకు గండి కొట్టేసాయి.  అయినా మన తెలుగు ఇంకా ఇలా వ్యవహారంలో వుందంటే గట్టిదే! 

వ్యవహారం లేదు కనుక, ఇంకొక రెండు లేదా మూడు తరాలు , పోనీ నాలుగైదు తరాలు అనుకోండి, మన తెలుగు భాష కేవలం మన ఆసక్తి, ప్రేమ, భక్తి అభిమానాలపై ఆధారం చేసుకుని మననం సాగించగలదు. ఆపై...?


-కళ్యాణ్

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!