ఆపదలను ధైర్యంతో ఎదురుక్కోవాలే కాని భయపడకూడదు

ఆపదలను ధైర్యంతో ఎదురుక్కోవాలే కాని భయపడకూడదు

SHYAMPRASAD +91 8099099083
0
ఆపదలను ధైర్యంతో ఎదురుక్కోవాలే కాని భయపడకూడదు

చాణక్య నీతి 5-3
తావద్ భయేషు భేతవ్యం యావత్ ద్రయమనాగతమ్
ఆగతంతు భయం దృష్ట్వా గ్రహర్తవ్యమశంకయా!
                                                                  
ఆపదలు సంభవిస్తాయని ఖచ్చితంగా తెలిసిన వేళ అవి దూరంగా ఉన్న సమయంలో కొద్దిగా భయపడినా ఆ ఇబ్బందులు క్రమ్ముకు వచ్చినప్పుడు మనసులో ఏ విధమైన శంకను అంటే అనుమానాన్ని పెట్టుకోకుండా వాటిని అధిగమించే ఉపాయాలు ఆలోచించాలి ధైర్యంతో వాటిని ఎదురుక్కోవాలే కాని భయపడకూడదు అంటారు ఆచార్య చాణక్యులు.

ఈ ప్రపంచంలో విపత్తులు లేని ప్రదేశము ఉండదు. మనలో కూడా ధైర్యము, భయము రెండూ ఉన్నాయి. ఈ రెండూ మనస్సుకు సంబంధించిన భావోద్వేగాలే. ఒకదానిని అంటిపెట్టుకోని మరొకటి ఉండే ఈ క్రమంలో దేనిని మనమాదరిస్తామనే దానిపై మన పురోగతి లేదా తిరోగతి ఉంటుంది. ఆపదలు దూరంగా ఉన్నప్పుడు అవి మనల్ని పలకరించే అవకాశం ఉన్నదని మనం భావించినప్పుడు అయ్యో అవి మనల్ని చుట్టుముడుతాయేమో ననే భయం కొద్దిగా ఉంటే ఉండవచ్చు గాక, కాని ఎప్పుడయితే ఆపదలు ముంచుకొస్తాయో అప్పుడు భయపడి ప్రయోజనం లేదు. మనముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి ధైర్యంతో ఎదుర్కోవడం లేదా పారిపోవడం. పారిపోతే అవేమీ వదలవు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భయంలేని ప్రదేశం లేదు. భయగ్రస్తుడైన వాడు ఒత్తిడికి లోనవుతాడు, ఒత్తిడి వల్ల నిర్ణయాలు సరిగా తీసుకోలేము. అసమంజసమైన నిర్ణయాల వల్ల అపజయం ప్రాప్తించవచ్చు. కాబట్టి భయాన్ని జయించాలి అంటాడు చాణక్యుడు. జయించడం అంటే అధిగమించడమే. అధిగమించాలి అంటే ఆ భయం యొక్క స్వరూపస్వభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మార్గాలు, ఉపాయాలను అన్వేషించాలి. అప్పుడు ఏ మార్గం ద్వారా దానిని అధిగమించడానికి అవకాశం ఉన్నదో అవగత మౌతుంది.

ఉత్సాహం ప్రేరణనిస్తుంది, సాహసం ముందడుగు వేయమంటుంది. ధైర్యం మానసిక సమతుల్యతను ప్రసాదించి సక్రమమైన ఆలోచనలను కలిగిస్తుంది. బుద్ధి మంచిచెడ్డలను వివేకాన్ని ప్రసాదిస్తుంది. ఏది యుక్తమో ఏది మనకు హానికరమో, దేని వల్ల తాత్కాలిక ప్రయోజనం కలుగుతుందో ఏది శాశ్వత ప్రయోజనకారియో తెలియచేస్తుంది. ఆసక్తిని రేపుతుంది. శక్తి వల్ల మనపై మనకు సాధించ గలమనే నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. ఏ అవాంతరాన్నైనా అధిగమించగలననే నమ్మకం ఎంతటి అసాధ్యమైన కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగే చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. పరాక్రమం అంటే ప్రయత్నం ఉద్యమించే మనో చైతన్యాన్నిస్తుంది.

బుద్ధి దారిని చూపితే, ఉత్సాహం ప్రేరణ నందిస్తే, ధైర్యం పరిణామాలను విశ్లేషిస్తే, సాహసం ఊపిరులూదితే, శక్తి వంతమైన చైతన్యం నేనున్నానని తోడుగా నిలిస్తే సాధించాలనే తపనతో ముందడుగు వేసే వారికి అపజయం, భయం లాంటివెన్నడూ ఎదురవవు, పలకరించవు. బుద్ధిమంతులకు, సాధించాలనే తపన కలిగిన వారికి ఇదే శక్తివంతమైన మార్గము, విపత్తులనధిగమిమ్చే మంత్రమని ప్రబోధిస్తున్నారు, చాణక్యులు.

చివరగా, భయాన్ని గూర్చి మా తాతగారు కీ.శే. గురజాల గోపాలకృష్ణయ్య శాస్త్రిగారు, మాతో ఒక మాట చెప్పేవారు. ఆపదలు రానంత వరకు వస్తాయని ఆలోచించడం, భయపడడం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ వస్తే... వచ్చాక అనుభవించాలి... వాటిని అధిగమించాలి అంతేకాని వచ్చాయని విచారించడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఎప్పుడూ ఎదో జరుగుతుందని భయపడుతూ కూర్చోవడం విజ్ఞతకాదు. ఉపాయాలు వెదుకు,  ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నం చేయి, ఫలితం భగవంతునికే వదిలేయమనేవారు.

🚩💐❤️💐🚩

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!