స్టీవ్‌ జాబ్స్‌ ఆస్పత్రిలో, తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు | Steve Jobs writes in diary about his last days in hospital

వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పనితప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు, ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్లూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది. ఈ నిశిరాత్రిలో- నా ప్రాణాల్ని నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత వూపిరిచప్పుడు వినిపిస్తోంది.

నాకిప్పుడనిపిస్తోంది... జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక, మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలూ, అనుబంధాలూ, చిన్నప్పటి కలలూ, కోరికలూ, సేవ... ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్లగలిగేది ప్రేమానుభూతులూ, అందమైన జ్ఞాపకాలూ మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి. మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. నిజం, అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది.

ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?... నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్‌ని నియమించుకోగలవు. నీ కోసం సంపాదించిపెట్టే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బునూ, నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వుదేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా - కథ ముగిసే రోజు, తెర పడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు- ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మళ్లదు. అందుకే... కాస్త ముందే కళ్లు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ స్నేహితులను ప్రేమించు. ఆనందంగా జీవించు. అందరినీ ఆనందంగా ఉంచు.

(ఆపిల్‌ కంపెనీ సృష్టికర్త, ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్‌ జాబ్స్‌ ఆస్పత్రిలో, తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు)

Post a Comment

0 Comments