Narasarao peta maḍata paḍakkurcī Written by: Sujatha Velpuri

నరసరావు పేట మడత పడక్కుర్చీ 

 రచన: సుజాత వేల్పూరి 


“అమ్మగారో” బయటి నుంచి కనకం దబదబా తలుపు బాదుతుంటే  గబుక్కున మెలకువ వచ్చింది రాజ్యలక్ష్మికి. ఒక్క క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు. ఇంత మొద్దు నిద్ర, కలలైనా రాని మొద్దు నిద్ర  ఎలా పట్టిందో.


విశ్రాంతి గా మంచం దిగి తలుపు తీసింది


“ఎన్ని సార్లు పిలిచానమ్మా? ఇంత నిదర ఎపుడూ పోవు. నేనొచ్చే తలికే లేసి కూకుంటావాయె. ఏడిసేడిసి పొణుకున్నావా ఏందమ్మా?” కొంచెం జాలి పడింది కనకం


రాజ్యలక్ష్మి  మాట్లాడలేదు.


డబ్బాలో కుక్కినట్టు ఇరుకుగా , ఊపిరాడనట్టు ఉండే జీవితం కాస్త ఖాళీ అయినట్టు ఉందంతే

ఏడుపు రావట్లేదంటే  కనకం ఏమంటుందో


రాఘవరావు పోయి ఇరవై రోజులైంది. విశాలమైన పందిరి మంచం మీద ఒక్కతే పడుకోవడం వింతగా ఉంది.  దిగులుగా ఉందో లేదో తేల్చుకోలేక పోతోంది. ఒంటరితనం కొత్తగా ఉన్నా, భయంగా అయితే లేదు


మేడమీద గదుల్లో పడుకున్న కొడుకులూ కోడళ్ళూ ఇప్పుడే లేవరు. అసలే ధనుర్మాసం. పొలాల్లోనుంచి చలిగాలి విసిరి కొడుతోంది


కనకం వాకిట్లో ఒత్తుగా పేడ కళ్ళాపి చల్లుతోంది. రాజ్యలక్ష్మి ఇద్దరికీ కాఫీ పెట్టి కనకం గ్లాసు అరుగు మీద పెట్టి “చేతులు కడుక్కుని రావే” అంది వరండా మెట్ల మీద కూచుంటూ


తల చుట్టూ కొంగు కప్పుకుని వేడిగా కాఫీ తాగుతూ  “కళ్ళాపి ఆరాక, తామర పూల ముగ్గెయ్యి. బాగుంటది ” అంది


“ఒద్దులేమ్మా, రెండు ముగ్గర్రలు గీత్తా. వొచ్చే ఏడాది ఏసుకుందాం లే పెద్ద ముగ్గులు”


గీజర్ లోని వేడి నీళ్ళతో తల  స్నానం చేసి, నీలి రంగు గుంటూరు జరీ చీర కట్టుకుని, నందివర్ధనాలు కోసి దేవుడి దగ్గర దీపం పెట్టి బయటికి వచ్చింది.

ఆ రోజు సాయంత్రమే కొడుకులూ కోడళ్ళూ, కూతురూ, పిల్లలూ కాశీ బయలుదేరుతున్నారు  అస్తికలు గంగలో కలపడానికి


కొడుకులిద్దరే వెళ్దామనుకుంటే కోడళ్ళు, కూతురూ దాని పిల్లలూ  మేమూ వస్తాం కాశీ  చూళ్ళేదన్నారు. పెద్ద కొడుకు కొంచెం కోప్పడుతూ “వెకేషన్ కి వెళ్తున్నామా ఏంటి ? అన్నాడు అమ్మ నొచ్చుకుంటుందేమో అన్నట్టు చూస్తూ


“ఏం పర్వాలా  పెద్దబ్బాయ్, యాణ్ణో అంత దూరం నుంచి వచ్చారు. విడిగా వెళ్లడం  మళ్ళీ ఎప్పుడు కుదురుద్ది ? పోయి అన్నీ చూసుకోని రాండి”  నిబ్బరంగా అంది . ముందు రాత్రే బాగ్ లు సర్దుకుని, ఎక్కడెక్కడ తిరగాలో ఫోన్లో చూసుకున్నారు


బంతిమొక్కలు విరగబూశాయి. ” బంతి పూల వాసన ఎంత బాగుంటది,ఘాటుగా” ఒక తెల్లబంతి పువ్వుని తడిమి ఇంట్లోకి నడిచింది


ఎత్తు అరుగులు దాటి విశాలమైన వరండాలోకి రాగానే ఎదురుగా  గా ఉందది.


ఖాళీ గా, బోసి గా!


నరసరావు పేట మడత పడక్కుర్చీ!!!


రాఘవరావు తాత మంచి టేకు కర్రతో , పని మంతుడైన వడ్రంగి తో చేయించుకున్న బలమైన పడక్కుర్చీ. హాయిగా వెనక్కి జారగిలబడి కూచున్నా, నిటారుగా కూచున్నా సౌకర్యంగా ఉండే కుర్చీ


విశాలంగా చేతులు చాపుకోడానికి వీలుగా రెండు వైపులా నున్నని పాలిష్ పెట్టిన పొడుగాటి చెక్కలు. పక్కకి మడిచి పెట్టిన చెక్క ప్లాంక్. ఏదైనా రాసుకోవాలంటే ఆ ప్లాంక్ ని రెండు చెక్కల మీదుగా వాల్చుకుంటే చాలు. ఎంత సేపైనా కూచుని రాసుకోవచ్చు


రాఘవరావు తండ్రి పెద రామయ్య, రాఘవరావు ఇద్దరూ  ఉత్తరాలు రాసుకోడానికి కాక పోయినా, తాకట్టు పెట్టుకున్న పొలం కాయితాలు, ప్రామిసరీ నోట్ల వివరాలన్నీ ఆ ప్లాంక్ మీద సరి చూసుకుని డబ్బు లెక్కలు రాసుకునే వాళ్ళు


ఆ కుర్చీ మీద ఇంటి యజమానులు అంటే మగవాళ్ళే  తప్ప ఆడవాళ్ళెవరూ కూచోరు.


కుర్చీ వంకే చూస్తూ, దాని ఎదురుగా ఉన్న పేము సోఫాలో కూచుంది

పడక్కుర్చీ విశ్రాంతి తీసుకుంటున్నట్టు తోచింది


ఆ కుర్చీ లో  కాళ్ళు చాపుకుని వెనక్కి వాలి పడుకోవాలని ఎన్నో సార్లు అనిపించింది తనకి.


ఇంట్లో సోఫాలూ, మంచాలూ బొచ్చెడన్ని ఉన్నాయి.


కానీ ఆ కుర్చీ చరిత్రంతా వింటున్న కొద్దీ అందులో ఒక్కసారి కూచోవాలనే కోరిక కొండలా పెరిగి పోయింది


పేటలో హాయిగా ఇంటర్మీడియేట్ చదువుకుంటుంటే  బాగా డబ్బున్న సమ్మంధమని రాఘవరావుకిచ్చి పెళ్ళి చేశారు.


పెళ్లయ్యాక కాలేజీలు ,చదువుకోడాలు ఉండవని ముందే చెప్పారు.  పుట్టింటి నుంచి నవలలు తెచ్చుకు చదివినా వింతగా చూసే వాళ్ళు . ఏదో ఒక పని చెప్పి లేవగొట్టేసేవాళ్ళు


లంకంత ఇల్లూ, బోల్డన్ని పొలాలూ, పాడీ ఇవన్నీ హడావుడిగా ఊపిరాడనట్టు గా ఉన్నా, ఏడాది గడిచే సరికి అలవాటు పడింది. “రాజీ అత్తగారిల్లు వైకుంఠమే” అని పుట్టింటివైపు బంధువుల్లో అందరూ చెప్పుకుంటుంటే మొదట్లో గొప్పగా ఉండేది గానీ రాను రాను ఆ వైకుంఠంలో ఆడవాళ్లకు చాకిరీ బాధ్యత తప్ప మిగతా విషయాల్లో బొత్తిగా చోటు లేదని అర్థమై దిగులు ముంచుకొచ్చేది


పెళ్ళయిన కొత్తలో చేతికందిన పుస్తకమేదో చదువుతూ చటుక్కున ఆ పడక్కుర్చీ లో కూచుంది రాజ్యలక్ష్మి. వంటింట్లోంచి చూసిన అత్తగారు, పక్క గదిలోంచి చూసిన రాఘవరావు సుడి గాలి తరంగాల్లా దూసుకొచ్చి చెరో రెక్కా పట్టుకుని లేపేశారు


తెల్లబోయింది


“ఆ కుర్చీ లో మా నాన తప్పితే ఎవురూ కూచోరమాయ్. అడిగే పన్లా? అట్ట కూసోటమేనా” మండి పడ్డాడు రాఘవరావు


“ఏమైంది కూచుంటే? ఎందుకు కూచోకూడదు?” అడిగింది పదిహేడేళ్ళ అమాయకత్వంతో . పుట్టింట్లో ఇలాటి కట్టళ్ళు, నియమాలు ఎన్నడూ చూసెరగదు


“ఏమైందా?” అంతకంటే తెల్లబోయింది అత్తగారు


“మాయ్, అది మా మావగారు చేపిచ్చుకున్న కుర్చీ. ఇంట్లో మొగోళ్ళు యవ్వారాలు చేసేటప్పుడు కూచోటానికి చేపిచ్చుకున్నాడాయన. వొడ్డీ లెక్కలూ, సేలూ, గెనాల కొలతలు, ఊళ్ళో పంచాయితీలూ, కులాల గొడవలూ ఇయ్యన్నీ మనింటోళ్ళే గదా చూసేది?  గనంగా ఉండాలని ఆర్డరిచ్చి చేపిచ్చుకున్నాడాయన. అందులో ఆయన కూసోని ఉంటే ఎంత గరానాగా ఉండేదనుకున్నావ్? ఊళ్లో జనమంతా ఉచ్చ బోసుకోవాల. పెద్ద పులి లాగా ఆయన కూచోనుంటే, మంచి నీళ్లు ఇచ్చేదానిగ్గూడా  ఒచ్చే దాన్ని కాదు ఈడకి. రాగి మరసెంబులో ముందే పోసి ఈడ పెట్టేసి పొయ్యేదాన్ని.  అట్టాటి కుర్చీ లో ఆడోళ్ళం మనమెట్టా కూసుంటాం?  ” అత్తగారు భక్తిగా తన మామగార్ని తల్చుకుంటూ చెప్తుంటే విచిత్రంగా  చూసింది


ఎప్పటికైనా ఆ కుర్చీలో ఇంటి వ్యవహారాలు, వూరి వ్యవహారాలు చూసే తమ ఇంటి మగవాళ్ళే కూచుంటారని అర్థమైంది. పైగా , మామ, అతని తర్వాత భర్త ఊరి సర్పంచు లు .


రాఘవరావు తండ్రి పెద రామయ్య బతికున్నాళ్ళూ ఆ కుర్చీలోనే కూచునే వాడు. వందెకరాల పొలం గల ఆసామీ కావాలన్నమాట ఆ కుర్చీ లో కూచోడానికి


రామయ్య వందెకరాల్ని నూట యాభై ఎకరాలు చేస్తూ రాఘవరావు కూడా అదే కుర్చీ లో


ఆ ఇద్దరూ ఇంట్లో లేనపుడు రాజ్యలక్ష్మి కుర్చీ ని అబ్బురంగా చూస్తూ కూచునేది దానెదురు గా. నున్నగా జారిపోయే పాలిష్ తో, అదేదో రాజుగారి సింహాసనం లా దానికదే ఫీలవుతుందేమో అనిపించేది .


పట పటా నాలుగు దెబ్బలు కొట్టాలనిపించేది దాన్ని . “ఎందుకంత పొగరు నీకు ?ఏం చూసుకుని?” అని అడగాలనిపించేది


“నీకు కొట్టాలనిపిచ్చేది కుర్సీని కాదులే” లోపలి నుంచి ఏదో గొంతు ఎగతాళిగా నవ్వేది


దానికి వేసే పట్టా చాలా గొప్పగా, మందంగా, మంచి నాణ్యత తో ఉండేది. ముత్యపు రంగు చెప్పి  మరీ మంగళగిరిలో నేయించేవాడు రామయ్య. ఆ మనిషికి చాలా శుభ్రం. అందుకు తగ్గట్టే ఆ పడక్కుర్చీ పట్టా, గోరెడు మురికి లేకుండా మిల మిల లాడుతూ ఉండాల్సిందే . మూడో నాలుగో ఉండేవి ఆ పట్టాలు . ఒక పట్టా ఉతుక్కి పంపితే ఇంకోటి తొడిగే వాళ్ళు


దాన్ని ఉతకడానికి చాకలి కి వేసే వాళ్ళు కాదు. పేట కి పంపి జాగర్తగా ఉతికించి, చలువ చేయించే వాళ్ళు


మనుషుల కంటే ఆ కుర్చీకి ఇంట్లో విలువ ఎక్కువని రాజ్యలక్ష్మి గ్రహించింది.


కానీ ఒక్కసారైనా ఆ కుర్చీ లో కూచోవాలనే కోరిక అలా పెరుగుతూనే పోయింది.


మామ పెద రామయ్య పోయాక, రాఘవరావు తండ్రి స్థానాన్ని, కుర్చీ లో స్థానాన్ని తీసుకున్న తర్వాత కూడా, రాజ్యలక్ష్మి కి ఆ కుర్చీ లో కూచోవాలనే కోరిక తీరలేదు.


ఆ కుర్చీ ఇంటి పెద్ద కీ, వ్యవహారాలు చూసే  మనిషికీ అన్న అభిప్రాయం ఆ ఇంటి గోడలు తలుపులతో సహా, ఆ ఇంటి గాలిలో కూడా ఇంకి పోయింది.


ఇవాళ తన కొడుకులిద్దరూ ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ, ఆ కుర్చీ మీద పట్టింపు లేని భావాలతో ఉన్నారు.  కూతురికి ఇవన్నీ పట్టవు. దానికి పెట్టుపోతలు సరిగ్గా ఉంటే చాలు


ఆ కుర్చీ గొప్పతనం పట్టించుకునే దానికి పూజ చేసే దానికి టైమ్ వాళ్లకి లేదు .వాళ్ళసలు పట్టించుకోరు దాన్ని


ఇపుడు ఆ కుర్చీలో కూచుంటే?


ఎందుకు? ఏముందా కుర్చీ లో? కూచుంటే ఏం? కూచోక పోతే ఏం?


నిజానికి తన కోరిక ఆ కుర్చీలో కూచోవాలనా? లేక రామయ్యో రాఘవరావో ఉండగా కూచోవాలనా?


“మా? ఇంత పెందాలాడే లేవక పోతే ఏం? పడుకోవచ్చు గా కాసేపు” కూతురు మెట్లు దిగి వచ్చింది.


“కాఫీ తెచ్చేదా?” గబుక్కున లేచింది నిత్యమూ అందరికీ అన్నీ అమర్చిపెట్టే అలవాటు  అరవై దాటినా పోలేదు


“నేను తెచ్చుకుంటాలే కూచో. ఓ.. .పనంటే చాలు పరిగెత్తి పోతావు” విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది లత


###


రాఘవరావు తాత చేయించుకున్న ఆ పడక్కుర్చీ లో వెనక్కి జారగిల బడి ఆ రోజు పేపర్ చేతిలోకి తీసుకుంది రాజ్యలక్ష్మిసందులో పేడ ఎత్తేసి దిబ్బలో పడేసి చేతులు కడుక్కోడానికి ముందు వాకిలి వైపు వచ్చిన పాలేరు, కుర్చీలో రాజ్యలక్ష్మిని చూసి ఒక్క క్షణం  ఆగి , ముందుకు కదిలాడు. పాలేరుకీ అభ్యతరమే కాబోలు తనా కుర్చీలో కూచోడం.


మామగారు, భర్త సర్పంచులు గా ఆ కుర్చీ లో కూచుని ఊళ్ళో వ్యవహారాలు చక్కదిద్దిన సందర్భాలు గుర్తొచ్చాయి.  వంద ఎకరాల చేను నూటయాభై ఎకరాలు తన కళ్లముందే ఎలా అయిందో గుర్తొచ్చింది. ఎవరెవరి నగలో తన ఇనప్పెట్టెలోకి ఎలా చేరాయో గుర్తొచ్చింది


కనకం మొగుడు ట్రాక్టర్ మీద నుంచి పడి చావు బతుకుల్లో ఉంటే, దాని పూరింటి దస్తావేజులు. అరెకరం సేను కాయితాలూ చేతిలో పడితే తప్ప డబ్బులివ్వలేదు రాఘవరావు. అతను పోయి ఆరేళ్ళయినా ఆ కాయితాలు ఇక్కడే ఉన్నాయి.


ఏడుకొండలు తమ్ముడి ఎకరం పొలమూ తమ దగ్గరే ఉంది. వెన్న పూస అమ్మే మాణిక్యం నాంతాడూ తమ ఇనప్పెట్టెలోనే ఉంది


నాలుగు తాళాలతో స్పెషల్ గా చేయించిన ఇనప్పెట్టె లోంచి తీసిన దస్తావేజులు  బొత్తులు  గా ఒళ్ళో పెట్టుకు కూచుంది రాజ్య లక్ష్మి.

ఇనప్పెట్టె లో నుంచి పెళ్ళి పేరంటాలకి తన నగలు తీసుకోవడం తప్ప మిగతా వాటి సంగతి ఎప్పుడూ తను చూడలేదు అవన్నీ పెట్టెలోనే వేరే లాకర్ లో ఉండేవి


ఎవరెవరివో చేను కాయితాలు, ఇంటి దస్తావేజులు , అన్నీ తాకట్టు పెట్టుకున్నవే


ప్రామిసరీ నోట్లు. వాటిలో కొన్ని మురిగి పోయాయి కూడా.


కుర్చీ కింద మంట పెట్టినట్టు, మండి పోతోంది ఆ కుర్చీలో కూచుంటే


లేచి  పెన్ను తెచ్చుకుని ఆ కాయితాలు  ఎవరెవరివో అందరి పేర్లూ నోట్సు లో రాసుకుంది.


పాలు తీయడానికి గిన్నె పుచ్చుకుని వెళ్తున్న ఏడుకొండల్ని పిల్చింది


“కొప్పుల సురేష్ అంటే మీ తమ్ముడేగా?”


భయంగా ఆగాడు “ఏమైందమ్మా, మళ్ళీ డబ్బులేమైనా తీసుకున్నాడా?”


“ఇట్టా రా, ఆ ఎకరం కాయితాలు పెట్టి డబ్బులు తీసుకున్నట్టున్నాడు. తీసుకున్న దానికి ఎక్కువే కట్టాడు. ఇయిగో, తీస్కపో.. ఇచ్చెయ్ ఈ కాయితాలు ఆడికి”


కట్రాట లా నిలబడి పోయాడు .  సంతోషమో, దుఃఖమో , సంభ్రమమో తెలియని భావంతో స్థంభం పట్టుకుని మెట్ల మీద కూచుండి పోయాడు


గంట తర్వాత మెట్ల ముందు మూగిన పదిహేడు మందికీ ఎవరి దస్తావేజులు వాళ్ళకిచ్చేసింది, తాతల నాటి ఆ పడక్కుర్చీ లో కూచుని.


ఈ రోజు సాయంత్రం పంచాయితీ ఆఫీసు దగ్గర దీని గురించే మాట్టాడుకుంటారు, తనకి తెలుసు. అన్నీ అయినాక “రాగవరావు కుర్సీ లో కూసోవాలని ఎన్నాళ్లనుంచి మదన పడిందో రాజమ్మ. మొగుడు సచ్చినాక తీరిందిలే ఆ కోరిక” అంటాడు ఎవడో పెద్ద మనిషి. తనకి తెల్సు


“భోగి పండగ వస్తంది గదా , కొండా .  ఈ  కుర్చీ ని మంటలో పారెయ్”  చెంగు దులిపి దోపుకుంటూ లోపలి గడప దాటబోతూ ఆగింది


కనకం, ఏడుకొండలూ గుడ్లు తేలేసి చూస్తూ నిల్చున్నారు. కనకం చేతిలో  దస్తావేజులు ఉన్నాయి


“ఉండనీమ్మా! కుర్సీ ఏం జేసిందమ్మా? ఆ కుర్సీ లో కూకునే నువ్వు ఇయాల ఇందరి బతుకులు నిలబెడితివే. రావని ఆశలొదిలేసుకున్న కాయితాలమ్మా అయ్యి. మా సేలో మేమే కూలికి పోతంటిమే నిన్నటి దాకా. ఇయాల కడుపు నిండా తిని, ఆయి గా నిదర పోతాం రాజమ్మా నీ పుణ్ణాన . నీ బిడ్డలు సల్లగుంటారు సూడు” కనకం కళ్లలో నీళ్ళు పమిట మీదికి ధార కట్టాయి


కుర్చీ ఏం జేసిందమ్మా…..


అవును! కుర్చీ ఏం చేసింది??


వెనక్కి వచ్చి హాయిగా జారగిల బడి కూచుంది.”కనకం, మన ముగ్గురికీ టీ పెట్టి తే పోవే”


ఇప్పుడా కుర్చీ హాయిగా సౌకర్యంగా ఉంది


“నాకిప్పుడు ఎంత బావుందో తెల్సా?” గుస గుసలాడింది పడక్కుర్చీ రాజ్యలక్ష్మి చెవిలో.


కనకం కళ్ళ నీళ్లతో నవ్వింది.

Post a Comment

0 Comments