Kavi Samrat Viswanatha Satyanarayana విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)

Kavi Samrat Viswanatha Satyanarayana విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)

SHYAMPRASAD +91 8099099083
0


Kavi Samrat Viswanatha Satyanarayana

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) “కవి సమ్రాట్” బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు – ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే “నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును ” . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును . విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు.

జీవిత విశేషాలు :

విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు.

 

బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ విధులు నిర్వర్తించాడు.

 

సాహితీప్రస్థానం:

1916 లో “విశ్వేశ్వర శతకము” తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే “ఆంధ్రపౌరుషము” రచించాడు. 1920నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

 

తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు – ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించాడు.

 

పాత్ర చిత్రణ:

విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాధ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!

 

ముఖ్య రచనలు:

విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి – ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాషన్నా విశ్వనాధకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాధ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రిక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.

 

వీరి రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు.

 

వ్యక్తిత్వం:

విశ్వనాధ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది. తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఇందువల్ల విశ్వనాధను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు. ఛాందసుడు అనీ, “గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్” అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు. విశ్వనాధకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు. షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు.

 

పురస్కారములు:

 

ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను “కవి సామ్రాట్” బిరుదుతో సత్కరించింది.

1964లో ఆంధ్రా యూనివర్సిటీ “కళాప్రపూర్ణ” తో సన్మానించింది

1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో “గజారోహణం” సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలుకూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది

విశ్వనాథ మధ్యాక్కఱలు” రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.

1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.

1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.

జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత.  కల్పవ్రుక్షాలయిన సాహితీ సంపదని మనకి వారసత్వం గా అందించి 1976 అక్టోబరు 18న న పరమపదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!