23 ఏప్రిల్ ప్రపంచ పుస్తకదినోత్సవం సందర్భంగా* ...

*23 ఏప్రిల్  ప్రపంచ పుస్తక* *దినోత్సవం సందర్భంగా* ...

ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తోంది. పుస్తకాన్ని చదవడం కనుక మనం అస్వాదించగలిగితే అది తృప్తినిస్తుంది.. 

పుస్తకం అమ్మలా లాలిస్తుంది.. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది.. ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది... బాధపడే వారిని ఓదారుస్తుంది . అలసిన మనసులను సేద తీర్చుతుంది.. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, నేస్తంగా సమస్తంగా అన్ని తరాలవారినీ అలరిస్తోంది .
 
‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో...కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ అని కందుకూరి ‍వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు నేటికి పుస్తక ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి.

కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు కొదవేలేదు. సినిమాలు, టెలివిజన్‌, ఇంటర్నెట్, మొబైల్ మాయలెన్ని దరిజేరినా పుస్తకం విలువ చెక్కుచెదరలేదు.

‘మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం తలపై ఓ మొట్టికాయవేసి మనల్ని మేల్కొలపాలి . లేనిపక్షంలో అసలు చదవడం ఎందుకు ? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచివేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మనలో గడ్డకట్టిన
సముద్రాల్ని గొడ్డలిలాగా పగలగొట్టాలి’ అంటాడు ప్రముఖ రచయిత కాఫ్కా. .
 
 ప్రపంచంలో అందరికన్నా ఎక్కువసేపు పుస్తకాలు చదివేవారు భారతీయులేనట. అవును.. ఇండియన్లు వారానికి సగటున 10.2 గంటలపాటు పుస్తకపఠనం చేస్తారని దశాబ్దం క్రితమే చేసిన ఒక అధ్యయనం తేల్చింది.ఈ సంఖ్య మరింత పెరగాలని పుస్తకాలు చదవడంలో ఎప్పటికీ భారతీయులే అగ్రస్థానంలో ఉండాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు.
 
మనిషి మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే తుదివరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మహోన్నత విజ్ఞానాన్ని అందించేది పుస్తకం. అందుకే పుస్తకం ఎప్పుడూ మన చేతిని అలంకరించి ఉండాలని చెప్పారు పెద్దలు. కాలక్రమేణా పుస్తకాలలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ బుక్స్‌ వచ్చాయి. కానీ పుస్తక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు.

పుస్తక పఠనంతో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. మేధస్సు సక్రమంగా పని చేసి ఆలోచనలు నియంత్రించేందుకు పఠనం దోహదం చేస్తుంది. అనవసర ఆలోచనల్ని నియంత్రించి శారీరక ఆరోగ్యం చేకూరుస్తుంది. ఒత్తిడి నుండి విముక్తి చెందాలంటే, రాత్రి పడుకోబోయే ముందు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివడం మంచిది. గాడ నిద్ర పట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఏకాగ్రత చేకూరి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. టీవీలు, ఇంటర్నెట్ వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటే లేకుండాపోతోంది. ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో తరహ పుస్తకం అవసరం. ప్రారంభంలో బోమ్మలు, కథల పుస్తకాలతో మొదలుపెట్టి ప్రపంచ నాగరికతలు, వింతలు, శాస్త్రవేత్తలు, పరికరాలు, సాహసగాథలు ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క కొత్త విషయాన్ని తెలియజేసే పుస్తకాలు చదివించాలి. వారికి అసలు పుస్తకాలు చదవాలన్న ఆలోచనే రావటం లేదు. అయితే వారితో పుస్తకాలు చదివించటాన్న నెమ్మది నెమ్మదిగా అలవాటు వేయించాలి. అలా చదివించి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని కనీసం వార్తాపత్రిక కూడా కొనుక్కోకుండా ఇంటర్‌నెట్‌లోనే అన్నీ ఫ్రీగా చదివేస్తున్నాం. కానీ దానితో పాటే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అదేపనిగా కూర్చుని ఇంటర్‌నెట్‌లో చదవడం వల్ల కళ్ళు పాడవడం, ఊబకాయం వంటి సమస్యలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పైగా కంప్యూటర్‌పై చదవడం వల్ల ఊహాశక్తికి తావు ఉండదు, అదే పుస్తక పఠనం ద్వారా చిత్రాలను మనసులో ఊహించుకోగలం తద్వారా ఊహాశక్తి పెంపొందు తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments