కథ - సాధువు

కథ - సాధువు

SHYAMPRASAD +91 8099099083
0
సాధువు:

పేదవాడైన తిమ్మయ్య కామందు దగ్గర అప్పుచేసి, జీవితమంతా ఆ అప్పు తీరకపోవడంతో మంచం పట్టి  మనోవ్యాధి ఎక్కువైన తిమ్మయ్య,  కొడుకు సూరయ్యను కామందు దగ్గర పనికి అప్పగించి కన్నుమూస్తాడు. ఎలాంటి జాలీ, దయా, కరుణా లేని కామందు చిన్నవాడైన సూరయ్యను చిత్రహింసలు పెడుతుంటాడు.

ప్రతిరోజూ చాకిరి చేస్తున్నప్పటికీ, కడుపునిండా తిండి పెట్టకపోవడమే గాకుండా,  పసివాడని చూడకుండా సూరయ్యను రాచిరంపాన పెడుతుంటాడు కామందు. కామందు హింసను తట్టుకోలేని సూరయ్య చెప్పా పెట్టకుండా ఊరు వదలి పారిపోతాడు. ఎన్నో చిత్రహింసలను అనుభవించిన సూరయ్యకు మనుషులంటే తీవ్రమైన అసహ్యం ఏర్పడింది.

కామందు ఇంటినుంచి బయటపడ్డ సూరయ్య ఎటుబడితే అటు కొండలు, కోనలూ దాటుకుంటూ ఓ పెద్ద కారడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక జలపాతం కింద కొండ గుహ కనిపిస్తే అక్కడే ఆగిపోయి ఉండసాగాడు. అడవిలో దొరికే పండ్లూ, ఫలాలలను తింటూ జీవనం సాగించాడు.

అలా ఏడు సంవత్సరాలు గడిచాయి. గడ్డమూ, మీసాలూ పెరిగాయి. మౌనంలో మాటలే మరిచిపోయాడు సూరయ్య. పులులు, తోడేళ్ళు లాంటి క్రూరమృగాలు సైతం అతడితో సఖ్యంగా ఉండసాగాయి.

ఇలా ఉంటే ఒకసారి శివయ్య అనే అతను ఆ దారిలో తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా... పెద్దపులితో ఆడుకుంటున్న సూరయ్యను చూశాడు. ఆశ్చర్యపోయిన శివయ్య వెంటనే సూరయ్య దగ్గరికి వచ్చి కాళ్లపై పడి... "ఇంత పెద్ద అడవిలో తమరు ఏం చేస్తున్నారు మహాత్మా...!" అని అడిగాడు.

సూరయ్య బదులు చెప్పకపోయే సరికి, భయంతో... "స్వామీ...! నేను రాజ దర్శనానికి వెళుతున్నాను. మంచి జరిగేలా దీవించండి" అని వేడుకున్నాడు శివయ్య. తరువాత స్నేహితులతో కలిసి రాజదర్శనానికి సాగిపోయాడు.

తిరుగు ప్రయాణంలో మళ్ళీ సూరయ్య దగ్గరికి వచ్చిన శివయ్య బోర్లాపడి, సూరయ్య కాళ్లకు నమస్కరిస్తూ... "మీ ఆశీర్వాద బలం వల్లనే నాకు రాజానుగ్రహం లభించింది. ఈ చిరుకానుక స్వీకరించండి" అంటూ బంగారు నాణేలను అతడిముందు పోశాడు. వాటిని తీసుకున్న సూరయ్య విసిరి పారేయగా ఆశ్చర్యపోయిన శివయ్య "నిజంగా తమరు దేవుడికి ప్రతిరూపమే..." అంటూ పాదధూళిని తీసుకుని బొట్టు పెట్టుకున్నాడు.

ఇంకేముంది కొన్నిరోజులకే ఆ అడవిలో సూరయ్య పేరుతో శివయ్య ఒక ఆలయాన్ని కట్టించాడు. భక్తుల రాకపోకలు కూడా మొదలయ్యాయి. సత్రాలూ, దుకాణాలు వెలశాయి. వ్యాపారాలు కూడా మంచిగా ఊపందుకున్నాయి. అడుగడుగునా హుండీలు, నౌకర్లు, సేవకులు ఎందరో తయారయ్యారు.

మొక్కుబళ్లతో నానాటికీ పెరిగిపోతున్న భక్తులతో ఆ మహారణ్యమంతా జనసముద్రమైంది. దీంతో సూరయ్యకు క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. అతడికున్న ప్రశాంతత అంతా మటుమాయమైపోయింది. మనుషుల అంతరాలు, అత్యాశలు, కోరికలను చూసిన అతడికి మనుషులంటే వెగటు పుట్టింది. అంతే... ఒకరోజున అక్కడ్నించీ కూడా చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!