🌹🌹1. బిచ్చగాడు — చక్రవర్తి.🌹🌹
ఒక రాజ్యంలో ఆ రోజు కూడా తెల్లారింది. మేల్కొన్నాడు చక్రవర్తి. ఒళ్ళు విరుచుకుని, అంతఃపురం పైనుంచి కిందికి చూశాడు. చెట్టుకింద కూర్చుని ఓ బిచ్చగాడు కనిపించాడు. తట్టుకోలేకపోయాడతను. తన రాజ్యంలో బిచ్చగాడంటూ ఉండకూడదు. అందరూ సిరిసంపదలతో వర్ధిల్లాలి. వర్ధిల్లుతున్నారనే భావిస్తున్నాడతను. ఆనందంగా ఉన్నాడు.
ఆ ఆనందాన్ని పటాపంచలు చేస్తూ బిచ్చగాడు కనిపించేసరికి కోపం కలిగింది చక్రవర్తికి. గబగబా కిందికి దిగాడు.
అమాత్యులు అనుసరించారతన్ని. అంతా బిచ్చగాణ్ణి చేరారు. సాక్షాత్తు చక్రవర్తే ఎదురుగా నిలబడడంతో భయం భయంగా లేచి నిల్చున్నాడు బిచ్చగాడు.
‘ఏం కావాలో కోరుకో’ అడిగాడు చక్రవర్తి. నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు బిచ్చగాడు. రెట్టించాడు చక్రవర్తి. కోరుకో అన్నాడు. జోలె నుంచి చిప్పను తీశాడు బిచ్చగాడు. ఖాళీ చిప్పను చక్రవర్తికి చూపించాడు.
ఈ చిప్ప నిండుగా దానం చెయ్యండి చాలు అన్నాడు. వెండి వరహాలను తెచ్చి నిండుగా పొయ్యండి అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. మంత్రులు దోసిళ్ళతో వరహాలు తీసుకు వచ్చారు. నేనంటే నేనంటూ దానం చెయ్యబోతే ఒక దోసెడు చాలు! చిప్ప నిండిపోతుంది అన్నాడు చక్రవర్తి.
ఓ మంత్రిని దానం చెయ్యమన్నట్టుగా చూశాడు. ఆ మంత్రి ఆనందంగా చిప్పలో వరహాలు పోశాడు. దోసెడు వరహాలకి చిప్ప నిండిపోవాలి. కాని నిండిపోలేదు. పోసిన వరహాలు పోసినట్టే మాయమైపోయాయి.
చిప్ప ఖాళీగానే ఉంది. ఆ ఖాళీని భర్తీ చేసేందుకు మంత్రులంతా దోసిళ్ళతో వరహాలు గుప్పించారు. ఎన్ని వరహాలు పోసినా చిప్పలో నిలవడం లేదు. మాయమైపోతున్నాయి. ఆశ్చర్యపోసాగారంతా.
ఆసరికే అక్కడ సామంతులూ, పౌరప్రముఖులూ గుమిగుడారు.
నువ్వు కోరుకున్నది నేను ఇవ్వలేనని చెప్పండి మహారాజా!
ఓడిపోయానని ఒప్పుకోండి. నా మానాన నేనూ, మీ మానాన మీరూ హాయిగా ఉండొచ్చు అన్నాడు బిచ్చగాడు. ఒప్పుకోలేదు చక్రవర్తి. తను ఓడి పోవడం మరణంతో సమానం అన్నాడు.
కోశాగారం మొత్తం తీసుకొచ్చి, చిప్పలో ఉంచమన్నాడు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, బంగారు, వెండి అభరణాలు...అన్నీ తెచ్చి చిప్పలో పోశారు. ఎన్ని పోసినా, ఎంత పోసినా చిప్ప ఖాళీగానే కనిపిస్తున్నది.
చిప్పను వెనక్కి తిప్పి చూపించమన్నారు ప్రముఖులు. చూపించాడు బిచ్చగాడు. దానికి ఎలాంటి రంధ్రమూ లేదు. బాగానే ఉంది. కోశాగారం ఖాళీ అయిపోయింది. సామంతుల కోశాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు. ఇంతటితో ఈ పందెం నిలిచిపోతే బాగుణ్ణనిపించినా పట్టు వీడలేదు చక్రవర్తి.
నా సామ్రాజ్యం సర్వం పోయినా బాధపడను కాని, ఈ బిచ్చగాడి ముందు ఓడిపోవడం నేను భరించలేనన్నాడు. ముష్టిచిప్పను నింపేందుకు అందులో రథాల్ని ఉంచాడు. ఏనుగుల్ని ఉంచాడు. గుర్రాల్నీ, సైనికుల్నీ, బలాలన్నిటినీ ఉంచాడు. అయినా ఫలితం లేకపోయింది. చిప్ప ఖాళీగానే మిగిలింది. చివరి ప్రయత్నంగా అంతఃపురంలోని రాణుల్నీ, దాసీల్ని ఉంచాడు అందులో. సామంతరాజుల్నీ, మంత్రుల్ని కూడా ఉంచాడు. చిప్ప నిండలేదు.
ప్రజలంతా స్వచ్ఛందంగా చిప్పలోకి ప్రవేశిస్తామంటే వద్దని వేడుకున్నాడు చక్రవర్తి. అప్పటికి సూర్యాస్తమయం అయింది.
చేతులు జోడించి, బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు చక్రవర్తి. ఓడిపోయానని ఒప్పుకున్నాడు. నువ్వే గెలిచావంటూ బిచ్చగాణ్ణి మెచ్చుకున్నాడు.
ఒక్కమాట అన్నాడు. దయచేసి చెప్పాలన్నాడు.
ఈ చిప్ప దేనితో తయారు చేశావయ్యా! ఇంత ఆస్తినీ, ఇంత మందినీ మింగినా నిండలేదని అడిగాడు.
ఆశలు!
మనిషి ఆశలతో తయారు చేశానన్నాడు బిచ్చగాడు.
ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజంతో తయారైన ఈ చిప్ప నిన్నూ నన్నే కాదు మహారాజా! యావత్తు ప్రపంచాన్నీ మింగేస్తుందన్నాడు బిచ్చగాడు.
ఆపై పెద్దగా నవ్వాడు.
మన ఆశలు అంతులేనివి.. అందుకే మనకు ఈ కష్టాలు, బాధలు..మన ఆశలను మనం నిగ్రహించుకుంటే మన ఆనందానికి అవధులు ఉండవు....
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
----------------------------------------------
2.😊 "ఉపనయనం"
(ఓ సరదా నవ్వుల కథ)
ఉమాపతి ఒక తెలుగు ఉపాధ్యాయుడు.అతను ఆంగ్ల పదాలను
మక్కికి మక్కి అనువాదం చేసి మాట్లాడుతుంటాడు.
ఉమాపతి సెల్ మోగుతోంది. అతను అది ఎక్కడ వుందో
కనపడక వెతుకుతూ "నా చరవాణి
ఎక్కడ?చరవాణీ ఎక్కడున్నావే?" అని గట్టిగఅరుస్తూ వుంటే,
కిచన్ లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా "చరవాణా
అదెవత్తీ?" అంటూనడ్డి మీద చేతులు పెట్టుకొని చేతిలో
గరిటతో సహా వచ్చింది.
"అదేనే కనకం! నా సెల్ ఫోను". "అలా అఘోరించ వచ్చుగా!"
అని, "మీ చొక్కా జేబులో వుంది" అని చెప్పి వెళ్లి పోయింది.
వెంటనే తెచ్చు కొని ఆకుపచ్చ మీట నొక్కి... ఎవరూ , అన్నాడు
"నేను బావా! రమాపతిని. మా అబ్బాయి గణపతి కి
ఈ నెల పదో తేదీన ఉపనయనం చేస్తున్నాము. మీరూ,చెల్లి తప్పక
రావాలి. ఏ ట్రైన్ కి వస్తారో చెప్తే స్టేషన్ కి కారు పంపిస్తాను".
"సరే వస్తాం లే బావా!" అని సెల్ పెట్టేసి భార్యను "కనకం! యిటు
రావోయ్" అని పిలిచాడు.
"మీ అన్న కొడుకు ఉపనయనం అట.తప్పక రమ్మన్నాడు.
అంచేత 'దరిద్ర రథం' లో రెండు శయనాలు పుస్తకం చెయ్యమని
సంతోషకర ప్రయాణాల వాడికి నీ చరవాణి లో చేప్పేయ్" అన్నాడు.
కనకం నెత్తి కొట్టుకుంటూ "మీ భార్య నైన పాపానికి 'దరిద్ర రథం'
అంటే 'గరీబ్ రథ్' అనీ 'శయనాలు' అంటే 'బెర్త్స్' అనీ అర్థ
మయింది. ఆ పుస్తకం చెయ్యడమేమిటో? ఆ సంతోష ప్రయాణాల
వాడెవడో? మీరే వివరించండి".
"అదేనే! మన వెనక వీధిలో ఆనంద్ ట్రావెల్స్ వాడికి బుక్ చెయ్యమని చెప్పు".
"అధికార భాషా చైర్మన్ గారూ! మీకో దండం" అని రెండు చేతులూ
శబ్దం వచ్చేలా కొట్టింది కనకం.
దోవకి పూరీ కూరా చేసుకొని బయల్దేరారు.
ట్రైన్ ఎక్కి సర్దుకొని కూచున్న తర్వాత, "కనకం! అసలే నీది
ద్విగవాక్ష శయనం,మెళ్ళో నగలూ గట్రా జాగ్రత్త" అన్నాడు
ఉమాపతి.
"ఈ ద్విగవాక్ష శయనం ఏమిటండీ ?" అంటే "సైడ్ లోయర్ బెర్త్"
వివరించాడు.
కనకం నిట్టూర్చి "నా రవ్వల గాజులూ, చంద్ర హారం పక్కింటి
పంకజం దగ్గర జాగ్రత్త చెయ్యమని ఇచ్చి వచ్చాను,మిగతావి నా బాగు
లో జాగ్రత్తగా వున్నాయి లెండి" అంది.
"అయ్యో! ఏ లెక్కా పత్రం లేకుండా వాళ్ళింట్లో ఎందుకు పెట్టావే?
రేప్పొద్దున ఆవిడ నా దగ్గర పెట్టలేదంటే ఏమి చేస్తావే?
అసలే ఆమె మొగుడు మన్మథరావు పానబోతూ, పరిభ్రమణ బోతూనూ"
అన్నాడు.
"పానబోతూ,పరిభ్రమణ బోతూ ఏమిటండీ?"
అంటే "తాగుబోతూ,
తిరుగు బోతూ" అని
వివరించాడు ఉమాపతి.
"మహానుభావా! ఇంగ్లీషు పదాలకే అనుకున్నా తెలుగు పదాలకు
కూడా పర్యాయ పదాలు కనిపెడు తున్నారా?"
అని తల బాదుకుంది.
"అది సరే కానీ! మనకు ఆ తెలుగు ఖాతా కార్యాలయం లో
తాళపేటిక ఒకటి విలపించింది కదా!
అందులో పెట్టి రావలిసింది" అన్నాడు.
కాసేపు ఆలోచించి "ఓహో! ఆంధ్రాబ్యాంక్ లో లాకర్ ఒకటి
ఏడిచింది కదా!" అని అర్థం చేసుకొని "మీరే పెట్టి వచ్చి ఉండవచ్చు
కదా!" అని దబాయించే సరికి నోరు మూసుకొని పడుకున్నాడు.
పొద్దున్నే హైదరాబాద్ చేరారు.
"మీ అన్న చతుశ్చక్ర వాహనం(కారు) పంపిస్తానన్నాడు. పంప లేదు
చూశావా?" అని సరే "ఈ త్రిశ్చక్ర వాహనం లో వెడదాం" అంటూ
(ఆటో)మాట్లాడాడు.
ఫంక్షన్ హాల్ దగ్గర దిగి లోపలికి వెళ్లి
"దరిద్ర రథం లో వస్తానని దూరవాణి లో చెప్పాను కదా!
చతుశ్చక్ర వాహనం పంపలేదేమిటీ?" అని బావ మరిదిని నిలదీశాడు.
రమాపతి తెల్లబోయి చూస్తూ వుంటే కనకం వివరించింది.
"సారీ బావా!మా అబ్బాయి కారు తీసుకొని వెళ్ళాడు .సమయానికి
కారు యింట్లో లేదు" అన్నాడు రమాపతి .
ఈ లోపల తమకిచ్చిన గదిలో సామాను సర్దేసి కనకం త్వరగా
స్నానం చేసి కనకాంబరం పట్టుచీర కట్టుకొని ముస్తాబై , నేను పెళ్లి
మండపం లోకి వెళ్తున్నాను" అంటూ, త్వరగా తయారై వెళ్ళిపోయింది.
ఉమాపతి తయారై "అరే నా ఉపలోచానాలు
(కళ్ళజోడు) ఎక్కడ?"
అని కళ్ళజోడు కోసం వెతికాడు. కనపడ లేదు.
అలాగే తడుముకుంటూ మండపం లోకి వెళ్ళాడు.
అంతా మసక మసక గావుంది ఎవరూ సరిగ్గా కనపడడం లేదు.
భార్య కోసం వెతుకుతున్నాడు.
'కనకం ఎక్కడుందీ?' అనుకుంటూంటే, అక్కడే కనకాంబరం
చీర కనపడింది. 'అదిగో కనకం ఇక్కడే వుంది' అనుకుంటూ వెళ్లి
కొంగు పట్టుకొని లాగాడు.
ఆవిడ తిరిగి చూసి ఉమాపతి గూబ గుయ్యిమని పించింది.
"ఏమిటీ తిక్క తిక్కగా వుందా?" అని అంటే ;ఏమైందంటే నా ఉపనయనాలు కనపడ లేదు" అని ఉమాపతి ఏదో చెప్పబోతూంటే
ఆవిడ భర్త వచ్చి కాలర్ పట్టుకొని "ఉపనయనానికి వచ్చి
ఉపనయనాలు కనబడ లేదంటా వేమిటి?" అంటూ కొట్టబోతుంటే,
కనకం చూసి పరిగెత్తు కొచ్చి ఆపి "అన్నయ్యగారూ!
ఆయన మా ఆయనండీ! క్షమించండి. ఏదో పొరబాటు అయింది" అంటూ "ఏమిటండీ! ఇదీ" అంటే,
" కనకం! నీవు కనకాంబరం చీర కదా కట్టుకుంది. చీర ఎప్పుడు మార్చావు? నా ఉపనయనాలు కనపడక నేను చస్తుంటే?" అన్నాడు
.
"అబ్బా! ఫంక్షన్ లో గంట కొక చీర మారుస్తాము. ఇంతకీ
ఉపనయనాలేమిటి?" అంది. "నా కళ్ళజోడు కనపడ లేదు అన్నాడుఉమాపతి.
కనకం నెత్తి బాదుకొని "నిన్నరాత్రి రైల్లో నా బాగు లో పెట్టారుకదా!"
అని తీసి కళ్ళకు తగిలించి, అందరికీ సారీ లు చెప్పి వెళ్ళింది.
ఊరికి బయల్దేరి వెళ్ళేటప్పుడు, రమాపతి బావ గారిని ఆటపట్టిస్తూ "బావా! ఈ సారి వచ్చేటప్పుడు ఉప ఉపనయనాలు
దగ్గరుంచుకో! అంటే స్పేర్ కళ్ళజోడు అన్నమాట అన్నాడు.
💥మీలో చాలామందికి తెలియని తెలుగు పదాలు పరిచయం చేశాను అనుకుంటున్నాను💥
😊😊నవ్వుల ఉప ఉపనయనాలు 😀😃
🌹 సర్వేజనా సుఖినోభవంతు🌹
🌹శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 🙏🏻
Hi Please, Do not Spam in Comments