కథ : కాకి ( తప్పకుండా చదవండి)

కథ : కాకి ( తప్పకుండా చదవండి)

SHYAMPRASAD +91 8099099083
0

*కథ : కాకి ( తప్పకుండా చదవండి)*



......నాపేరు "కాకి". నాకది మనుషులు పెట్టిన పేరు... "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు... ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.....

నాకు నలుగురు పిల్లలు..... అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి ....కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం తెలియదు... కానీ, *మాకు గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లి*
*బిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు*.....

ఆ రోజు ఆదివారం జోరువాన.. బంగాళాఖాతంలో వాయుగుండం అంట. ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను...

పిల్లలేమో ఆకలి అంటున్నాయి.. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో, డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది....

*"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా"*.. అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను....

ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరానికి తూట్లు పెడుతున్నాయి... కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను...

 సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు ...నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు ..వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ ...ముందు పచ్చడి, తరవాత కూర, ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ...

మొత్తం నలుగురు... ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి ...పాపం అతని కంచంలో మాత్రం అన్నం, ఎర్రటి రంగులో మామిడి పచ్చడి...

"అమ్మా, తాతయ్యకి కూర వేయొచ్చుగా".. అని ఆ పెద్దాయన  పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు...
 వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .."ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను ...తిండి పెట్టడమే ఎక్కువ... దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు... కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ...

ఆమెని అలా చూసి  సంబంధంలేని నాకే భయం వేసింది .....ఇంక ఆ పిల్లోడెంత....

అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .. 
"ఏవే ఇంకొంచెం సాంబారు పోయి "అని పోయించుకుని తింటున్నాడు ...
వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి, చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ....పాపం వాడి ముఖాన్ని వాడు రోజూ అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???

పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు... అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో... మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు... వెంటనే నీళ్లు తాగాడు ...బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి, మొఖం ఎర్రగా మారిపోయింది ...
ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ, అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు... అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన...
 వాళ్లు తినడం అయిపోయింది.. అందరూ లేచారు ...ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు ...అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు... ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి....

 "పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు ...నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని.. నేను కొన్ని మెతుకులు తిని, కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.....

సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా "ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా" ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు ...కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను... ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయనది...." ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి...

"అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి ...మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ... ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపోయింది".. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి....

 వార్నీ... మనుషులు!!! మీరేం మనుషులురా బాబు ... *బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??*

*పోవడం కోసం కోరికలు కోరుకొని, కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??*

*బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతిని, విసిరేసింది తిన

డానికి కాకుల్ని పిలుస్తున్నారా??*

*ప్రాణం ఉన్నంత కాలం పెద్దాయన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచె పెట్టారా... ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య...*

పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు.... అసలు వీడ్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి...

ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే  ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా ... కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??

ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి ..పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??

అలా మనసులో  వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది ...వెంటనే గాల్లోకి ఎగిరాను ...చుట్టూ ఉన్న నా  కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు...

గంటా ,రెండు గంటలు... అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి... పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు... చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది... "బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు" అని ఒకడు... "ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు" అని ఇంకొకరు... "నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు" అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ...
అవి విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది ...అలాగే ఉండిపోయాడు... కనీసం తన బాధ చెప్పుకోలేని పరిస్థితి... పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బ్రతికున్నా చచ్చిపోయినట్టు అనిపిస్తుంది అతనికి ... నా బిడ్డల ఆకలి  తీర్చినందుకు  ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను... ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను....

రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!
*" సెంటు పీలిస్తే మంచి వాసన వచ్చిందని, తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం... అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం...*

అయినా "ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు"..

*"ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు" ..రేయ్ !మనిషి అర్థమైందా...*

"ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనులబట్టో, మంచినిబట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ "....త్వరగా బయటపడరా మనిషి....

చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వొచ్చు కానీ మనసు మాత్రం తెలుపు.... (ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది)

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!