"సత్యమేవజయతే" ఎక్కడనుండి తీసుకోవడం జరిగింది ?

*సత్యమేవజయతే* ఎక్కడనుండి తీసుకోవడం జరిగింది.
----------------------------

సత్యమేవ జయతే  భారత ప్రభుత్వ నినాదం. నినాదమేకాదు సిద్ధాంతం కూడా.ఎల్లవేళల సత్యమే జయిస్తుందని అర్థం.

ఈ ప్రధానసూత్రాన్ని అశోకుడు వేయించిన సారనాథ స్థూపంనుండి తీసుకోవడం జరిగింది. ఈ నినాదం ఉత్తరప్రదేశ్ లోని సారనాథ స్థూపంలో దేవనాగరి లిపిలోవుంది. వాస్తవానికి  ఈ నినాదమూలాలు ముండకోపనిషత్తులో వున్నా యి.

సత్యమేవ జయతే పూర్తిపాఠం మరియు అర్థాన్ని తెలుసుకొందాం.

*సత్యమేవ జయతే నానృతమ్సత్యేన పంథా*
*వితతో దేవయాన:యేనాక్రమాంత్యా*
*బుుషయోహ్యాప్తాకామాయాత్ర*
*తత్సత్యస్య పరమం నిధానమ్*

అర్థం.
ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది, అసత్యానికి ఓటమితప్పదు.సత్యం ద్వారా సన్మార్గం తెలుస్తుంది. మహనీయులు ఈ మంచి మార్గంలోనే నడచి స్వర్గాన్ని చేరుకొన్నారు.

*తమసోమా జ్యోతిర్గమయ*
*అసతోమా సద్గ మయా*
*మృత్యోర్మా అమృతంగమయా*

అన్నివర్గాలవారిని మంచిసందేశంతో ఆకట్టుకొన్న ఈ శ్లోకం బృహదరణ్యకోపనిషత్తులోనిది.

అర్థమేమిటంటే ఓదేవుడా! నన్ను బలహీనత (చెడు) నుండి బలానికి ( మంచికి) తీసుకుపో.చీకటినుండి వెలుగుకు తీసుకువెళ్లు. మృత్యువునుండి అమృతత్వానికి తీసుకుపో.

ఎవరు ఎవరిని తీసుకుపోవాలంటే నిన్ను నువ్వే సన్మార్గంలో తీసుకువెళ్ళాలి.నాటి బుుషులు పరమాత్మను ప్రార్థించి తమను తాము నడిపించుకొనుటకు జవసత్వాలను ఇవ్వాలని ఇలా కోరుకొన్నారు.

ఇక గురుశిష్యుల మేలుకోరే క్రిందిశ్లోకం కేనోపనిషత్తులోనిది.ముఖ్యంగా గురువులు గుర్తుంచుకోవాల్సిన శ్లోకమిది.

*ఓం సహనా వవతు సహనౌ భునక్తు*
*సహవీర్యం కరవావహై*
*తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై*

ఓం శాంతి శాంతి శాంతి:

దీని తాత్పర్యమేమిటంటే
భగవంతుడు మనలిద్దరిని రక్షించుగాక. మన ఇద్దరికి అన్నివిధాలా వృద్ధికలుగుగాక. చదువుకోటానికి చదువు చెప్పటానికి అవసరమైన బుద్ధికుశలత శక్తిసామర్థ్యాలు మనకు లభించుగాక. విద్యనేర్వటానికి నేర్పటానికి అవరసరమైన వెలుగు (జ్ఞానం ) ప్రసరించుగాక. మన ఇద్దరిమధ్య ఏలాంటి మనస్పర్థలు పెరగకుండుగాక.

ఎంతగొప్ప శ్లోకమిది. ఇలా గురుశిష్యులు ప్రవర్తిస్తే లోకంలో జ్ఞానసంపదలు పెరగవా!
*జనని జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసి*

రామరావణయుద్ధం ముగిసింది.రావణుడు నిర్జీవుడైనాడు. శ్రీరామచంద్రుడు లంకలోప్రవేశించి సీతామాతను చెరవిడిపించి, విభీషణుడికి పట్టంకట్టి తిరుగు ప్రయాణమైనాడు.

 లక్ష్మణుడు లంకలోని అందాలకు ముగ్ధుడైనాడు. బంగారుతాపడంతో వజ్రాలు పొదిగిన ఆకాశహర్మాలను చూచి సంతోషపడి అన్నా శ్రీరామచంద్రా! ఎంతో సుందరమైన ఈ లంకలోనే మనంవుండిపోదామా అని అన్నపుడు సకలగుణాభిరాముడు ఏమన్నాడో తెలుసా! తమ్ముడా లక్ష్మణా! కన్నతల్లి పుట్టినగడ్డ రెండు స్వర్గం కన్నా ఎంతోగొప్పవి. నువ్వు కోరుకొంటున్న సంపదైశ్వర్యాలేవి మనవి కావు.మనవి కానపుడు వాటిని కోరడం అసంబద్ధం, కనుక మనం తక్షణమే ఇక్కడనుండి వెళ్ళిపోదామని అన్నాడు.

 ఆ సందర్భంలోనిదే ఈ శ్లోకం.రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి మహానుభావుడికి శిరసా నమామి.విన్న మనం తరించిపోదుముగాక.
------------------------------------------------------------------

Post a Comment

0 Comments