Responsive Advertisement

ఏది శవం ? ఏది జీవచ్ఛవం ? ఇంత పెద్దకరవా ?

ఏది శవం ? ఏది జీవచ్ఛవం ? ఇంత పెద్దకరవా ?
...................................................

1832 -33 వ సంవత్సరం.

గుంటూరు జనాభా 5 లక్షలు.
కరువు, పనుల్లేవు. ఎక్కడ చూచినా ఆకలి ఆకలి. త్రాగటానికి నీల్లు కూడాలేవు. 5 లక్షలలో రెండు లక్షలమంది అన్నంలేక ఆకలికి తట్టుకోలేక చనిపోయారు. గాలివార్త గుప్పుమంది. మదరాసులో అన్నం దొరుకుతుందట.

ఇంకేం సర్కారు ప్రాంతప్రజలు పల్లెలు ఖాళీచేసేశారు. మోయగలిన సామానులు నెత్తికెక్కించుకొన్నారు. పిల్లలను చంకనేసుకొన్నారు.నడవగలిగిన ముసలివారిని వెంట తీసుకొన్నారు. నడవలేని వృద్ధులను రోగులను వారి మానానవారిని వదిలేసి బయలుదేరారు.

దారిలో తిండిలేక ఆకలికి తట్టుకోలేక మూర్ఛపోయినవారు కొందరు.
నడవలేక రోగాలపాలైనవారు  కొందరు.
ఆకలిని తట్టుకోలేక దిక్కులేక చనిపోయినవారు కొందరు.
దారివెంబడి ఎక్కడ చూచినా ఆకలికేకలే, అన్నమో రామచంద్ర అంటూ ఆక్రందనలే.
పట్టించుకొనే వారేరి.

 పీక్కుపోయిన కళ్ళు, ఎండిపోయిన డొక్కలు, ఏదికాలో ఏది చేయో తెలుసుకోనంతగా సన్నబడ్డ కాల్లుచేతులు. నడవలేక కొందరు, తనవారిని ఎత్తుకోలేక కొందరు, ఏం తినాలో ఎలా నడవాలో తెలియనివారు కొందరు.

నా అన్నవారందరిని కోల్పోయి కొందరు. అమ్మనాన్నలు చనిపోయి దీక్కులేక ఎక్కడ పోవాలో ఏం చేయాలో తెలియని పిల్లలు మరికొందరు.
సందట్లో సడేమియాగా ఆడపిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకొనే వ్యాపారులు కొందరు.

చచ్చినవారిని ఖననం చేసే ఓపిక లేదు. ఏడ్చేందుకు కన్నీల్లు లేవు.పక్కవాడు చచ్చాడేనన్న సానుభూతి లేదు.
సొమ్మసిల్లి పడిపోయినవారిని ఓదార్చిసాయం చేసేవారు లేనేలేరు.

అందరిది ఒకటే రోదన ఆకలి, ఆకలి. క్షుద్భాద ఆర్చేవారేరి తీర్చేవారేరి.

అమ్మనాన్నలపైన, పెద్దల పైన కన్నవారిపైన,  కట్టుకొన్నవారిపైన ప్రేమను చంపుకోలేక చచ్చినవారిని వదులుకోలేక చిన్నచిన్న గుంతలు తీసి పూడ్చిపెడుతున్నవారు కొందరు.
చచ్చినవారిని
చచ్చిన వారినేం ఖర్మకు వదిలేసి పయనం సాగిస్తున్నవారు కొందరు. సొమ్మసిల్లి జీవచ్ఛవాలుగా మారిన అల్పప్రాణులపై రాబందుల రెక్కల రెపరెపలు, మనిషి మాంసఖండాల కోసం  అడవికుక్కల కొట్లాటలు. వాటిని అదిలించేందుకు సత్తువలేని జనం. దారి వెంబటా శవాల గుట్టలు పుర్రెలు ఎముకల పోగులు. ఇది నాటి గుంటూరు నుండి మదరాసు రహదారిపై పరిస్థితి.

అందరికి ఒకటే బాధ అదే ఆకలి, ఆకలి. ఎంతత్వరగా మదరాసు చేరితే అంత త్వరగా గుక్కెడు గంజి తాగవచ్చునన్న తపన.

చచ్చిచెడి మద్రాసు చేరి ఎక్కడకు పోవాలో ఎవరిని అడగాలో తెలియక దిగులుగా కూర్చున్నవారిని గుర్తించి గంజి కేంద్రాలకు పంపిన దాతలు కొందరు.
అలాంటివారిలో మదరాసు సుప్రీంకోర్టులో ఇంటర్ ప్రిటర్ గా పనిచేస్తున్న ఏనుగుల వీరాస్వామి ప్రథముడు.

మొదటిరోజు గంజి కేంద్రాలకు చేరిన వారి సంఖ్య 1500. అందరికి గంజన్నం పోశారు. మదరాసులో గంజిపోస్తున్నారన్న వార్త సుదూర ప్రాంతాలకు పాకిపోయింది. జనాలు తండోపతండాలుగా ప్రయాణం కట్టారు. 1833 మే నెలలో ఒకరోజుకు 12 వేలమంది చొప్పున అన్నార్థులు రాసాగారు. సత్రాలన్ని గుళ్ళు గోపురాలు నిండిపోయాయి.

జూన్ నెలలో ఈ సంఖ్య బాగా పెరిగింది. రోజుకు 33వేలు పెరిగింది. ఎంతమందికి అన్నం పెట్టగలరు. దాతలు ప్రభుత్వం కిందామీదా పడి రోజుకు 17 వేలమందికి అన్న సదుపాయం కల్పించారు.

ఆకలికి తట్టుకోలేక ప్రజలు గోదాములపై దుకాణాలపై, ఇండ్లపై దాడిచేశారు దోచుకొన్నారు. 
శాంతిభద్రతల పేరుతో ఎందరో బక్కచిక్కన ప్రాణులు బలైపోయారు.

దీనికంతటికి కారణం.
1830 లో వర్షాలు కురవలేదు పంటలు పండలేదు. ఆకలికి తట్టుకోలేక విత్తనధాన్యాన్ని తినేశారు. 1831 లో వర్షాలు పడ్డాయి, రైతులు ఎలాగో ఒకలా పంటలు పెట్టారు. అదే సంవత్సరం విపరీతమైన అతివృష్టి, చేతికొచ్చిన పంటలు కొట్టుకుపోయాయి, మునిగిపోయాయి. వరదలలో చిన్నాపెద్ద అందరూ బజారున పడిపోయారు.1832 సంవత్సరంలో మరలా పెద్దపెద్ద వర్షాలు మహాఉప్పెనలు. వాగులు వంకలు చెరువులు కుంటలు తెగిపోయాయి. నదులకు వరద సముద్రానికి ఉప్పెనలు. 

ఈస్టిండియా ప్రభుత్వం నిరాసక్తత నిర్లక్షం. ప్రకృతి ప్రభుత్వం దాడితో రైతు సర్వం కోల్పోయి కోలుకోలేక బికారై వీధిన పడ్డాడు.

ఈ భయంకర కరువుకే పెద్దకరవని *నంద న కరువని పేరు*

1876 - 78 కాలంలో ప్రజలను భయపెట్టి సర్వనాశనం చేసిన మరో కరవుపేరు *ధాతు కరవు*

ఈ కరవులలో ఎంతమంది చచ్చారో నిరాశ్రయులైనారో లెక్కపెట్టటానికి సుమారు సంవత్సరకాలం పట్టింది.
.....................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

1 Comments

  1. Chaduvu tundtee bhayam vestundi ..........aa kaalam naati parishitulu .

    ReplyDelete