Responsive Advertisement

గుంతకల్లు మర్డర్ కేసులో ఏం జరిగింది?


గుంతకల్లు మర్డర్ కేసులో ఏం జరిగింది.
....................................................

1893 అక్టోబరు 4 వతేదీ సాయంత్రం బెంగళూరు నుండి సికింద్రాబాదుకు బ్రిటిష్ సైనికులను తీసుకువెళుతున్న రైలు గుంతకల్లు స్టేషన్ లో ఆగింది. కొంతమంది సైనికులు రైలుదిగారు. కనబడిన కోళ్ళు, గొర్రెలు, మేకలు, ఆవులు పట్టుకొని తినేయడం పంటలను దోచుకోవడంపాడుచేయడం వారినైజం.యువతులు స్త్రీలు కనబడితే చేయని ఘోరమంటూ ఉండదు. బ్రిటిష్ ప్రభుత్వంపైగా బ్రిటిష్ సైనికులు. ఏమిటిదని ప్రశ్నిస్తే ప్రాణాలు పోతాయి.

సిపాయిల దండు గుంతకల్లులో  దిగిన సంగతి జొన్నచేలో పనిచేసుకొంటున్న గొల్లయువతికి, గొల్ల స్త్రీకి తెలియదు. సాయంత్రం కనుక జొన్న చేలో పనిముగించుకొని ఇంటిదారి పట్టారు.

ఇంతలో బూట్లసవ్వడి వారికి వినిపించింది. తలెత్తిచూస్తే బ్రిటిష్ సైనికులు కొందరు కామవాంచతో తమవైపే వస్తున్నట్లు గమనిం చారు. వారినుండి తప్పించుకొటానికి వడివడిగా అడుగులు వేయసాగారు, వారి వాలకం చూచి పరుగులంఘించుకొన్నారు. బ్రిటిష్ సైనికులు వేగం పెంచారు. గొల్లవనితలు మానప్రాణరక్షణకై దగ్గరలోని రైల్వే గేటు క్యాబిన్ లోకి వెళ్ళి తలుపుకు గడియ వేసుకొన్నారు. 

రైల్వే గేటు కీపరుకు పరిస్థితి అర్థమైపోయింది. కేబిన్ రూం కు బయటనుండి గడిపెట్టి బీరపాతుకున్న వెదురుబొంగు తీసుకొని సిపాయిలు లోపలికి పోకుండా  తలుపుకు అడ్డంగా నిలబడ్డాడు. నల్లోడివి మా బానిసవి మమ్మల్నే ఎదిరిస్తావా అంటూ తిరగబడ్డారు తెల్లతోలు సిపాయిలు. వారిని లోపలకు వెళ్ళకుండా ఆ గేట్ కీపర్ చాలాసేపు నిలువరించాడు.

తెల్లసిపాయిలకు కోపంవచ్చింది.తుపాకితో రైల్వేగేటు కీపరుపై రెండుసార్లు కాల్పులు జరిపారు.రామా అంటూ గేటుకీపరు పడిపోయాడు. తుపాకిశబ్దం విని పోలాలలో పనిచేసుకొంటున్న రైతులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు.మంది రాకతో బ్రిటిష్ సిపాయిలు జొన్నచేన్లో పడిఅడ్డంగా పారిపోయారు. అప్పటికే ఒకరైలు సిగ్నల్స్ లేకపోవడంతో అక్కడికొచ్చి ఆగింది.గార్డు సిబ్బంది రైలుదిగి పరిస్థితిని గమనించి గాయపడిన గేటుకీపరును రైల్లో చేర్చి గుంతకల్లు రైల్వే ఫ్లాట్ ఫారంపైన పడేసి వెళ్ళిపోయారు.

రైల్వేపోలీసులు కలుగ చేసుకొంటే అర్థరాత్రికికాని డాక్టర్ గేటుకీపరును చూడటానికి రాలేదు. అతనో బ్రిటిష్ దేశ వైద్యుడు. గేటుకీపరును రక్షించాలని శతవిధాలా ప్రయత్నించాడు.ఒక బుల్లెట్ ను తొడనుండి తీశాడు కాని గేటుకీపరు ప్రాణాలను రక్షించలేకపోయాడు. గేటుకీపరు ప్రాణాలు అనంతవాయువులలో కలిశాయి.

తన ప్రాణాలను అడ్డుగా వేసి గొల్లపడచుల మానాలను కాపాడిన ఆ గేటుకీపరు పేరేమిటో  తెలుసా?

గూళ్యపాలెం హంపన్న. వయసు ఆనాటికి 50 సం॥రాలు. భార్య చనిపోయింది, పిల్లలులేని ఏకాకి.

ఈ చారిత్రిక గాథ అయిపోలేదు, ఇపుడే మొదలైంది. 

పట్టుకేశవపిళ్లై స్వతంత్ర సమరయోధుడు. తమిళనాడులోని ఉత్తర ఆర్కాడు జిల్లాలోని పట్టు గ్రామంలో 1860 లో జన్మించాడు. కొద్దికాలం అక్కడే తాలూకాకార్యాలయంలో పనిచేసి గుత్తి ఆర్.డీ.వో. కార్యాలయానికి గుమాస్తాగా వచ్చాడు. గుమస్తాగా పనిచేస్తున్నపుడే ది హిందూ దినపత్రికకు విలేఖరిగా కూడా పనిచేసేవాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసి వకీలుగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 1885లో ముంబైలో జరిగిన లార్డ్ హ్యూం అధ్యక్షతన జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశానికి హాజరైనాడు కూడా. 1908లో మదరాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరుగా కూడా ఎన్నుకోబడ్డాడు. గుత్తిలో అశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు. గుత్తి కేశవపిళ్ల్లె అని ప్రసిద్ధిగాంచాడు.

గూళపాలెం హంపన్నను అన్యాయంగా కాల్చిచంపిన బ్రిటిష్ సైనికుల కర్కశత్వాన్ని, ప్రభుత్వ ఉదాసీనతను హిందూపత్రికలో ఏకిపారేశాడు.

ప్రభుత్వం దిగివచ్చింది. సైనికులలో బాధ్యుడైన  corporal Ashford ను అరెస్టుచేసింది. బ్రిటిష్ జాతీయుడు కనుక స్థానిక కోర్టులలో విచారించకుండా కేసును మద్రాసు హైకోర్టుకు మార్చారు.రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవ, గుత్తికేశవ పిళ్లై ఎంత వాదించినా, బ్రిటిష్ దొరలు కేసును తారుమారు చేశారు.

పల్లెపడుచులు వేశ్యలని, హంపన్న తార్చుడు (బ్రోకరు) పనిచేస్తాడని, బ్రోకరేజి విషయంలో కొంతమంది  సైనికులకు హంపన్నకు గలాటా జరిగిందని ఆ ఘర్షణలో గుర్తుతెలియని సిపాయి కాల్పులు జరిపాడని, అరెస్టు చేసిన కల్నల్ యాష్ పోర్డ్ కు సంబంధంలేదని కేసును హైకోర్టు జడ్జి Mr.collins కోట్టేశాడు.

హంపన్నను గుత్తిలోని థామస్ మన్రో సత్రంవద్ద ఖననం చేశారు కదా! గుత్తికేశవపిళ్లై హంపన్న సమాధిమీద  పలకాన్ని ఏర్పాటుచేసి చిన్న స్మారకాన్ని నిర్మించాడు.ఇలా స్మారకమందిరాన్ని నిర్మించడం బ్రిటిష్ వారికి కంటగింపైంది. పిళ్లైను బందీచేసి (అరెస్టు) స్మారకాన్ని పడదోయాలని చర్యలు తీసుకొన్నారు.

ప్రజలలో అగ్రహాజ్వాలలు రేగాయి.కేశవపిళ్లె హిందూ పత్రికలో కలాన్ని జళిపించాడు. విషయం తెలుసుకొన్న మదరాసు గవర్నరు Lord wenlock గుత్తికేశవుడిని అరెస్టు చేయరాదని స్మారకాన్ని పడగొట్టరాదని ఆర్డరువేశాడు.

ఇది గుంతకల్లు మర్డరుకేసుగా ఆ రోజులో ప్రసిద్ధిగాంచింది.
ఈ విధంగా తెలుగు ఆడబిడ్డల మానప్రాణాలను కాపాడిన గూళపాలెం హంపన్న, తెలుగుజాతికి జరిగిన అవమానాన్ని నిరసించిన పట్టు ( గుత్తి) కేశవపిళ్లేలు చిర:స్మరణీయులైనారు.

గుత్తిపట్టణం నడిబొడ్డున థామస్ మన్రోసత్రం దగ్గర పాత NH 7 పైన హంపన్న స్మారక చిహ్నముంది. గుత్తికి వెళితే చూడండి.
............................................................................................................ జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments